లక్ష మందితో సీఎం కేసీఆర్‌‌ సభ : జగదీశ్ రెడ్డి

లక్ష మందితో సీఎం కేసీఆర్‌‌ సభ : జగదీశ్ రెడ్డి
  • విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి  

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట కొత్త మార్కెట్ సమీపంలో 70ఎకరాల విస్తీర్ణంలో లక్ష మందితో సీఎం కేసీఆర్‌‌ సభ నిర్వహిస్తామని  విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.  సీఎం ఈనెల 20 న సూర్యాపేటకు రానుండడంతో మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్‌లో పార్టీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చరిత్రలో నిలిచిపోయేలా  సీఎం సభ ఉంటుందని.. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు  సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కేసీఆర్ ఖిల్లాగా మారిందని,  తమకు ఎదురే లేదని విర్ర వీగిన కాంగ్రెస్ వృద్ధ సింహాలను మట్టికరిపించిన ఘనత బీఆర్‌‌ఎస్‌ నేతలదన్నారు.

ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్‌కు తిరుగులేదని, కాంగ్రెస్ , బీజేపీలకు స్థానమే లేదని విమర్శించారు.  వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జల్లాలోని 12 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.   కేసీఆర్‌‌ సూర్యాపేటను జిల్లా చేయడంతో పాటు కలెక్టరేట్‌,  పోలీసు కార్యాలయం , మోడల్ మార్కెట్‌, మెడికల్ కాలేజీని నిర్మించి జిల్లా కీర్తిని పెంచారని కొనియాడారు.  అనంతరం బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించి..  వేదిక, పార్కింగ్‌పై సూచనలు చేశారు.

ఈ కార్యాక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్,  భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, శానంపూడి సైది రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, యాదాద్రి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, గుజ్జా యుగంధర్ రావు తదితరులు పాల్గొన్నారు.