పోతిరెడ్డిపాడుపై గప్ చుప్..కృష్ణా నీళ్లపై ఎలాంటి సమీక్ష జరపని సీఎం

పోతిరెడ్డిపాడుపై గప్ చుప్..కృష్ణా నీళ్లపై ఎలాంటి సమీక్ష జరపని సీఎం

హైదరాబాద్‌‌, వెలుగు:‘‘కృష్ణా పరీవాహక ప్రాంతంలో అనుసరించాల్సిన విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కొద్ది రోజుల్లో సమావేశం నిర్వహిస్తారు’’.. మే 15న సీఎంవో ఇచ్చిన ప్రకటన ఇది. తర్వాత రెండు రోజులకే గోదావరిపై మంత్రులు, ఇంజనీర్లతో ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. గోదావరి నీటి వినియోగం.. ప్రాజెక్టుల వారీగా అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. కాళేశ్వరం నీటిని ఎట్లా వాడుకోవాలో సూచించారు. కానీ రెండు వారాలు గడిచినా కృష్ణా నదీ కమాండ్‌‌ ఏరియాకు నీటి విడుదలపై రివ్యూ చేయలేదు. మరో రెండు రోజుల్లో వానాకాలం సీజన్ మొదలవుతున్నా.. కృష్ణా ఊసే ఎత్తడం లేదు. రివ్యూ నిర్వహిస్తే ఏపీ ప్రాజెక్టులైన పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరంపై ఎక్కడ చర్చించాల్సి వస్తుందోననే సీఎం సైలెంట్‌‌గా ఉంటున్నట్టు తెలుస్తోంది.

స్పందిస్తలే..

ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌‌ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ప్రకటించింది. వాటిని ఆపేందుకు ప్రయత్నించని కేసీఆర్‌‌ సర్కారు.. గోదావరి నీటి వినియోగంపై రివ్యూ చేస్తున్నట్టు ప్రకటించింది. వెంటనే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నుంచి విమర్శలు మొదలయ్యాయి. దీంతో గోదావరి నీటి వినియోగంపై సీఎం రివ్యూ ఉంటుందని సీఎంవో ప్రకటించిన కొంత సేపటికే.. కృష్ణాపైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ సమీక్ష నిర్వహిస్తారని ప్రకటన జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు కృష్ణా బేసిన్‌‌ పరిధిలోని మంత్రులు, ఇంజనీర్లతో సీఎం కేసీఆర్​ రివ్యూ చేయలేదు.

నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ, ఏఎమ్మార్​పీ ఎస్ఎల్బీసీ, జూరాల ప్రాజెక్టు, దానిపై ఏర్పాటు చేసిన భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ లిఫ్టులు, శ్రీశైలంపై ఏర్పాటు చేసిన కల్వకుర్తి లిఫ్ట్‌ స్కీం, రాజోలి బండ డైవర్షన్‌ స్కీం, తుమ్మిళ్ల, భక్తరామదాసు లిఫ్ట్‌ స్కీములు కృష్ణా బేసిన్‌లో ఆపరేషన్‌లో ఉన్న ప్రాజెక్టులు. వీటితోపాటు మీడియం, మైనర్‌ ఇరిగేషన్‌ వినియోగంపైనా ఇంజనీర్లు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి గోదావరిలో పెద్దగా చిక్కులు లేవు. కృష్ణా నీళ్ల వరకు వస్తే పొరుగు రాష్ట్రంతో చీటికి మాటికి పంచాయితీలు ఎదురవుతున్నాయి. వాటిపై ఇంజనీర్లు తమ బాధ్యతగా స్పందించడం, సంబంధిత బోర్డుకు ఫిర్యాదు చేయడం మినహా ప్రభుత్వపరంగా వారికి సహకారం అందడం లేదు.

అందుకేనా?

ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌ స్కీంపై మాట్లాడాల్సి వస్తుందనే సీఎం కేసీఆర్.. కృష్ణా నది నీటి వినియోగంపై సమీక్ష నిర్వహించడం లేదని ఇరిగేషన్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏపీ ప్రభుత్వం ఆ రెండు ప్రాజెక్టులు నిర్మించేందుకు ఈనెల 5న జీవో ఇవ్వగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల ఒత్తిడితో 11న సీఎం రివ్యూ నిర్వహించారు. ఏపీ ప్రాజెక్టులపై కేఆర్‌ఎంబీకి, కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో పాటు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. సీఎం ఆదేశాలతో ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌.. కేఆర్‌ఎంబీ చైర్మన్‌ను కలిసి ఏపీ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేశారు. అంతే తప్ప ఏపీ ప్రాజెక్టులను ఆపేందుకు ఎలాంటి చర్యలు మొదలు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వానికి, సీడబ్ల్యూసీకి ఇంతవరకు కంప్లైంట్‌ చేయలేదు. సుప్రీంకోర్టులో కేసు వేస్తామని చెప్పినా లీగల్‌ ప్రొసీడింగ్స్‌ కోసం ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు.

ఎన్నో డిమాండ్లు..

ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా నీళ్లపై ఏ రివ్యూ చేసినా ఏపీ ప్రాజెక్టుల విషయం మళ్లీ ముందుకు వస్తుంది. వాటిపై ప్రభుత్వపరంగా రియాక్ట్‌ కావాలి. మరోవైపు మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల మంత్రుల నుంచి పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలనే అభ్యర్థనలు వస్తాయి. జూరాలకు దిగువన 20 టీఎంసీలతో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించాలనే డిమాండ్‌ వస్తోంది. జూరాలపై భారీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు చేపట్టాలని పాలమూరు ఉద్యమ వేదికల నుంచి స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరుగుతోంది. రివ్యూ నిర్వహిస్తే వీటిపైనా ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.

పిటిషన్‌ ఎప్పుడేస్తరో?

పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని, సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయాలని సర్కారు నిర్ణయింయి 20 రోజులవుతున్నా ఆ దిశగా ఒక్క అడుగు పడలేదు. కేఆర్‌ఎంబీకి చేసిన ఫిర్యాదు కాపీనే కేంద్ర జలశక్తి శాఖకు పంపారు. సీడబ్ల్యూసీకి, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి ఇంతవరకు ప్రాపర్‌ కంప్లైంట్‌ చేయలేదు. ఇంటర్‌స్టేట్‌ విభాగంలో దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ ఏమీ సర్క్యులేషన్‌లో కనిపించడం లేదు. ఎంత ఖర్చయినా ప్రముఖ లాయర్‌లను పెట్టి సుప్రీంలో పిటిషన్‌ వేయిస్తామన్న సీఎం హామీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో తెలియడం లేదు. ఏపీ ప్రాజెక్టులను అడ్డుకుంటానని సీఎం ప్రకటించారే తప్ప.. ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం లేదని జలసౌధలో చర్చ సాగుతోంది