పనులు వేగంగా పూర్తి చేయాలని..కేసీఆర్ ఒత్తిడి చేశారు : లక్ష్మీ నారాయణ

పనులు వేగంగా పూర్తి చేయాలని..కేసీఆర్ ఒత్తిడి చేశారు : లక్ష్మీ నారాయణ
  • ఇంజినీర్లతో సంబంధం లేకుండా అన్నీ తానై వ్యవహరించారు: లక్ష్మీ నారాయణ
  • రికార్డుల కోసం చూశారే తప్ప.. నాణ్యత పాటించలేదు
  • మేడిగడ్డ బ్యారేజీ కుంగడంలో కుట్ర కోణం లేదు
  • మానవ, సాంకేతిక లోపమే కారణమన్న తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం కన్వీనర్

ఖైరతాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి మానవ తప్పిదంతో పాటు సాంకేతిక లోపమే కారణమని తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం కన్వీనర్ దొంతుల లక్ష్మీనారాయణ అన్నారు. నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలంటూ ఇంజినీర్లపై సీఎం కేసీఆర్ ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. పిల్లర్లు కుంగిపోవడంలో ఎలాంటి కుట్ర కోణం లేదని స్పష్టం చేశారు. రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ మురళీధర్​కు నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన లోపాలపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చి మీడియాతో మాట్లాడారు. వేలకోట్ల ప్రజాధనంతో నిర్మించే బ్యారేజీల విషయంలో నాణ్యత పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఇసుక నేలపై ఫౌండేషన్ వేసే టైమ్​లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సరైన ప్రమాణాలు, నిబంధనలు పాటించకపోవడంతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఆరోపించారు. ఇంజినీర్లతో సంబంధం లేకుండా కేసీఆరే.. అన్నీతానై వ్యవహరించారని విమర్శించారు. కేసీఆర్ మాటలకు ఇంజినీర్లు కూడా ఎదురు చెప్పలేకపోయారన్నారు. ఆయన చెప్పిన విధంగానే పనులు పూర్తి చేశారని ఆరోపించారు. అన్నారం బ్యారేజీ కూడా కుంగిపోయే స్థితికి చేరుకుందన్నారు.

పనుల్లో రికార్డు సృష్టించడానికి ప్రయత్నించారే తప్ప.. నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. 2018, డిసెంబర్ 23వ తేదీన 24 గంటల్లో 16,700 క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీట్ వేశారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం సుమారు రూ.6,220 కోట్లు అని వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్​లో 18, 19, 20, 21 పిల్లర్లు కుంగిపోవడానికి కుట్ర ఏమీ లేదని, మానవ తప్పిదమే కారణమన్నారు. నిర్మాణం చేపట్టేముందు ఇసుక బెడ్స్ ను 85 శాతం రిలేటివ్ డెన్సిటీ వచ్చే దాకా, వైబ్రో కంపాక్టర్స్ ద్వారా సరైన రీతిన తొక్కించకపోవడం కూడా పిల్లర్లు కుంగిపోవడానికి రీజన్ అని వివరించారు. వేగంగా పనులు పూర్తి చేసి.. రికార్డు సృష్టించాలనే కేసీఆర్ ఆలోచించారని తెలిపారు. సమావేశంలో సామాజిక కార్యకర్త హరి, తదితరులు పాల్గొన్నారు.