
Rules Changing From August 1: నేటితో జూలై నెల ముగిసిపోతోంది. ప్రతి నెల మాదిరిగానే కొత్త నెలలో అనేక అంశాలకు సంబంధించిన కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తున్నాయి. అయితే యూపీఐ నుంచి ఇతర అంశాల్లో వస్తున్న మార్పులు ఆర్థికంగా ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనే అంశాలను తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
యూపీఐ కొత్త నిబంధనలు..
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ కొత్త నెల నుంచి యూపీఐ సేవల్లో కీలక మార్పులను తీసుకొస్తోంది. ఇవి యూజర్లతో పాటు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయని వెల్లడించింది.
- కొత్త రూల్స్ ప్రకారం యూజర్లు తమ యూపీఐ యాప్ ద్వారా రోజుకు గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోగలరు.
- ఆటోపే చెల్లింపులను రోజులో పీక్ గంటలు లేని సమయంలో మాత్రమే ప్రాసెసింగ్ చేసేందుకు అనుమతి.
- ట్రాన్సాక్షన్ పెండింగ్ లో పడితే 90 సెకన్ల వ్యవధితో మూడు సార్లు మాత్రమే చెక్ చేసేందుకు అనుమతి.
- లింక్ చేసిన ఖాతాలు చెక్ చేసేందుకు రోజూ ఒక్కో చెల్లింపు యాప్ ద్వారా 25 సార్లే గరిష్ఠ పరిమితి
- ఇక చివరిగా పేమెంట్ చేసేందుకు వెల్లినప్పుడు వారి బ్యాంక్ ఖాతాలోని పేరు మాత్రమే కనిపించనుంది.
క్రెడిట్ కార్డ్ ఇన్సూరెన్స్ ఆఫర్..
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసిన విధంగా అన్ని కో బ్రాండెడ్, సొంత క్రెడిట్ కార్డులపై ఆఫర్ చేస్తున్న రూ.కోటి విమాన ప్రమాద ఇన్సూరెన్స్ ఆఫర్ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
ట్రేడింగ్ గంటల మార్పు..
కాల్ మనీ, మార్కెట్ రెపో, ట్రై పార్టీ రెపో ట్రేడింగ్ మార్కెట్ పనిగంటలను పొడిగిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. ఆగస్టు 1, 2025 నుంచి.. కాల్ మనీ మార్కెట్ ఉదయం 9నుంచి సాయంత్రం 7వరకు, రెపో మార్కెట్ ట్రేడింగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండనుంది.
గ్యాస్ ధరల్లో మార్పులు..
ఇక ప్రతి నెల మాదిరిగానే దేశంలోని చమురు విక్రయ సంస్థలు గ్యాస్ ధరల్లో మార్పులు ప్రకటించిస్తాయి. దీంతో డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ ధరలతో పాటు సీఎన్జీ, పీఎన్జీ, విమాన ఇంధన ధరల్లో మార్పులు రావొచ్చు.