తెలంగాణ తరహాలో రైతుల కోసం పోరు

తెలంగాణ తరహాలో రైతుల కోసం పోరు

హైదరాబాద్‌‌, వెలుగు : దేశంలోని రైతుల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాడాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్​ అన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తూనే ఎన్నికల్లో పోటీ చేసినట్టుగా దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పోరాటంతో పాటు పార్లమెంటరీ పంథా అనుసరించాలి. జమిలి పంథాతోనే రైతులు గమ్యాన్ని చేరుకోగలుగుతారు” అని పేర్కొన్నారు. తెలంగాణ వ్యతిరేకులతో ‘జై తెలంగాణ’ అనిపించినట్టుగానే దేశంలో రైతు వ్యతిరేకులతో ‘జై కిసాన్‌‌’ నినాదం పలికించాలన్నారు. ఆదివారం ప్రగతి భవన్‌‌లో రెండో రోజు 25 రాష్ట్రాల రైతు నాయకులతో కేసీఆర్‌‌ సమావేశమయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టడానికి ముందే వైఫల్యాలను అన్వేషించానని, రాజకీయ, ఉద్యమ పంథాను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడంతోనే గమ్యాన్ని ముద్దాడామని ఆయన చెప్పారు. ఓటు అనే ఆయుధాన్ని ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా మార్చి లక్ష్యాన్ని చేరుకున్నామని తెలిపారు.  

రాజకీయాలతోనే ప్రజల జీవితాలు ప్రభావితమవుతాయని, అలాంటి రాజకీయాలు చేయడం నామోషీ అనుకోవద్దని సీఎం అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు. రైతు నేతలంతా ఒక్కటై పనిచేయాల్సిన అసవరం ఉందని, రైతుల కోసం ఎక్కడ అవసరమైతే అక్కడ ఆందోళనలు చేయాలని, అదే సమయంలో రాజకీయాలు కూడా చేయాలని పిలుపునిచ్చారు. కొద్ది రోజుల్లోనే మరోసారి భేటీ అయి, దేశవ్యాప్తంగా రైతుల ఐక్యత చాటేలా ఐక్య సంఘటన నిర్మిద్దామని ఆయన అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, పలురంగాల మేధావులు, జర్నలిస్టులతో చర్చించి దేశంలో వ్యవసాయాన్ని సమస్యల నుంచి కాపాడేందుకు అనుసరించాల్సిన విధానాలపై బ్లూప్రింట్‌‌ సిద్ధం చేద్దామని కేసీఆర్​ చెప్పారు. ఫెడరల్‌‌ స్ఫూర్తితో గ్రామ, తాలూకా, జిల్లా, రాష్ట్రా స్థాయిల్లో సంఘాన్ని నిర్మిద్దామన్నారు. తాను స్వయంగా రైతునని, రైతుల కష్టాలు, వాటిని ఎట్లా పరిష్కరించాలో కూడా తనకు తెలుసని కేసీఆర్​ తెలిపారు. ఉత్తర, దక్షిణ భారత దేశాలను అనుసంధానం చేసేలా రైతు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుందామన్నారు. రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరిగేలా ‘అవ్వల్‌‌ దర్జా కిసాన్‌‌’ తయారు చేద్దామని చెప్పారు. 

ముగిసిన రైతు సంఘాల నేతల పర్యటన
కేసీఆర్‌‌ సూచించినట్టుగా పార్లమెంటరీ పంథాను అనుసరించి రైతుల సమస్యలకు పరిష్కారాలు వెదుకుదామని పంజాబ్‌‌, యూపీ, కేరళ, పశ్చిమబెంగాల్‌‌ రాష్ట్రాల రైతు నాయకులు అన్నట్లు సీఎంవో తెలిపింది. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు, బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌‌, దళిత బంధు పథకాలు కేంద్రంలోని పాలకుల్లో భయం సృష్టిస్తున్నాయని, ఆయా పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని వారు డిమాండ్​ చేసినట్లు పేర్కొంది. ఈ సమావేశంతో రాష్ట్రంలో రైతు సంఘాల నాయకుల మూడు రోజుల పర్యటన ముగిసింది.