
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుకగా ఇచ్చే 28 శాతం లాభాల వాటాను సంస్థ యాజమాన్యం తక్కువగా చూపించి కార్మికులను మోసం చేస్తున్నదన్నారు బీఎమ్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మాధవ్.
2018-19 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కి 1766.66 కోట్లు లాభాలు వచ్చాయని, ఇందులో కార్మికుల వాటాగా సీఎం ఆనాడు కూడా 28 శాతం ప్రకటించారని అన్నారు. 28 శాతం అంటే దాదాపు 494.6 6 కోట్లని చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 993 కోట్లు లాభాలు వచ్చినట్టుగా యాజమాన్యం ప్రకటించిందని.. రూ 993 కోట్లకు 28 శాతం అంటే . దాదాపు రూ 278. 04 కోట్లని అన్నారు. గత ఏడాదిలాగే 28 శాతం కార్మికుల వాటా గా యాజమాన్యం ప్రకటించినప్పటికీ ఒక్కో కార్మికుడికి గతేడాదితో పోలిస్తే దాదాపు 30 నుంచి 35 శాతం డబ్బులు తక్కువగా వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇది చాలా దారుణమన్నారు.
2019-20 కి గాను లాభాలను యాజమాన్యం ప్రకటించలేదని, గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈ సారి ఎక్కువ ప్రొడక్షన్ వచ్చినా లాభాలు మాత్రం తక్కువగా చూపించిందన్నారు. దీంతో కార్మికులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కెసిఆర్ యాజమాన్యం కుట్రపూరిత చర్యల వల్ల కార్మికులకు వేలల్లో నష్టం కలగనుందన్నారు
సీఎం కేసీఆర్ కు సింగరేణి సి.ఎం.డి శ్రీధర్ తొత్తుగా మారారు హెచ్ ఎం ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్. ఇద్దరూ కుట్ర పన్ని వాస్తవ లాభాలను ప్రకటించలేదన్నారు. గతం కన్నా ప్రొడక్షన్ ఎక్కువ వచ్చినప్పుడు లాభాలు ఎక్కువ రావాలి గానీ.. గతంలో 1766 కోట్లు వస్తే ఈసారి మాత్రం రూ 993 కోట్లు వచ్చాయని యాజమాన్యం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. గతం కన్నా ఒక్క శాతం కూడా లాభాల వాటాను సీఎం పెంచలేదని, కార్మికులను ఇద్దరూ కలిసి మోసం చేస్తున్నారన్నారు