కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని సూచించారు సీఎం కేసీఆర్. 10 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ ఇవాళ ( మంగళవారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనాపై చర్చించారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించారు. దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తు చేసిందని అన్నారు.
కరోనా అనుభవాల దృష్ట్యా దేశంలో వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలని చెప్పారు సీఎం కేసీఆర్. గతంలో మనకు కరోనా వ్యాప్తి వంటి అనుభవం లేదని, ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదన్నారు. గతంలో అనేక వైరస్‌లు ప్రజలను ఇబ్బంది పెట్టాయని, కరోనా వంటి వైరస్ రాలేదని చెప్పారు. కోవిడ్ -19 వంటి వైరస్‌లు భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం ఉందని, ఏ విపత్కర పరిస్థితులు తలెత్తినా తట్టుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యుల సంఖ్యను పెంచడం, వైద్య కాలేజీల ఏర్పాటు వంటి వాటిపై ఆలోచించాలని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి వైరస్‌ల వంటివి ఎన్ని వచ్చినా తట్టుకునేలా వైద్య రంగం తయారుకావాలని కేసీఆర్ చెప్పారు. ఇందుకు ప్రధాని మోడీ చొరవతీసుకోవాలని… దీనికి తగ్గట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా పని చేసి వైద్యసదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 71 శాతం… మరణాలు రేటు 0.7 శాతం ఉందని తెలిపారు. కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచామని… కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
కరోనా ట్రీట్ మెంట్ కు కావల్సినన్ని బెడ్లు, మందులు, ఇతర పరికరాలు,సామాగ్రి సిద్ధంగా ఉంచామన్నారు సీఎం కేసీఆర్. ఐసిఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నామని తెలిపారు. వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా శక్తి వంచన లేకుండా పని చేస్తోందని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో వివరించారు కేసీఆర్.
