సీఎం సార్​ వస్తుండని.. స్పీడ్​గా పనులు

సీఎం సార్​ వస్తుండని.. స్పీడ్​గా పనులు

సీఎం సార్​ వస్తుండని..  స్పీడ్​గా పనులు
మానుకోటలో సీఎం పర్యటించే  రూట్​లోనే  హడావుడి 

మహబూబాబాద్​, వెలుగు : మహబూబాబాద్​జిల్లా కేంద్రంలో త్వరలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈక్రమంలో మున్సిపాలిటీ పరిధిలో డెవలప్​మెంట్​పనులను అధికారులు స్పీడప్​ చేశారు. కేవలం సీఎం పర్యటించే మార్గం, ప్రధాన కూడళ్లలోనే పనులు చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శివారు, విలీన గ్రామాలు మాత్రం ఎప్పటిలాగే అభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నాయి.  సీఎం పర్యటనతోనైనా పట్టణ రూపురేఖలు మారుతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సీఎం పర్యటించే మార్గంలోనే.. 

త్వరలో సీఎం కేసీఆర్ జిల్లాకు వస్తే న్యూ కలెక్టరేట్ బిల్డింగ్ నుంచి  అండర్ బ్రిడ్జి ద్వారా,  గవర్నమెంట్ హాస్పిటల్, తహసీల్దార్ సెంటర్, కోర్టు సెంటర్, తొర్రూర్ రోడ్, మెడికల్ కాలేజీ వరకు పర్యటించే అవకాశం ఉంది. దీంతో ఈ రూట్లలో ప్రధాన కూడళ్ల వద్ద డ్రైనేజీ, రోడ్ల క్లీనింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్, ట్రీగార్డ్స్, ఏర్పాటు చేయడం, వేస్ట్​మొక్కల తొలగింపు,  రోడ్లు సమానం చేయడం, ఇండికేషన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం.. తదితర పనులు చేస్తున్నారు. వీటిని పర్యవేక్షించడం కోసం సమీప మండలాలకు చెందిన ఎంపీడీవోలకు ఇన్​చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు.  అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు.

బంధం చెరువును క్లీన్​ చేస్తున్నరు

మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బంధం చెరువు కొన్నేళ్లుగా మురుగునీటితో, గుర్రపుడెక్క పెరిగిపోయి అపరిశుభ్రంగా ఉండేది.  ప్రస్తుతం ఈ దారిలోనే సీఎం కేసీఆర్​ రానుండడంతో చెరువులోని గుర్రపు డెక్కను ఓవైపు తొలగించారు, మరోవైపు తొలగించాల్సి ఉంది.

విలీన గ్రామాలపై పట్టింపేదీ.. 

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జమాండ్లపల్లి, అనంతారం, బేతోలు, రజాల్​ పేట, శనిగపురం, ఈదుల పూసపల్లి, శివారు తండాలను గతంలో మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఆయా  మున్సిపల్​ డివిజన్ల లో  అంతర్గత రోడ్లు, డ్రైనేజీల విస్తరణ, రోడ్ల వెంట  ఎవెన్యూ ప్లాంటేషన్.. తదితర డెవలప్​మెంట్​పనులు ఎక్కడా కనిపించడం లేదు. మున్సిపాలిటీలో కలిసిన తర్వాత పన్నుల భారం పెరిగిందే తప్ప అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

పట్టణ  సమగ్ర అభివృద్ధి కోసం కృషి

మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం.  ఆఫీసర్ల సూచనల మేరకు సీఎం కేసీఆర్​పర్యటించే మార్గంలో  తొలి ప్రాధాన్యతగా డెవలప్​మెంట్​పనులు చేపడుతున్నాం. అనంతరం విలీన గ్రామాలు , శివారు ప్రాంతాల్లోనూ పనులు చేస్తాం. మున్సిపాలిటీని  మోడల్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నాం.

- పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మహబూబాబాద్​ మున్సిపాలిటీ చైర్మన్