ఆగస్టు 2న నాగార్జున సాగర్ లో పర్యటించనున్న కేసీఆర్

ఆగస్టు 2న నాగార్జున సాగర్ లో పర్యటించనున్న కేసీఆర్

ఆగస్టు 2న నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. సాగర్ నియోజకవర్గంలోని హాలియాలో ప్రగతి సమీక్షలో పాల్గొనబోతున్నారు సీఎం కేసీఆర్. సాగర్ ఎన్నికలకు ముందు నెల్లికల్లు సహా వివిధ లిఫ్టు స్కీంలకు 2 వేల 500 కోట్లు ప్రకటించారు. నల్గొండ జిల్లాలోని 844 గ్రామపంచాయతీలుకు 20 లక్షలు, 31 మండల కేంద్రాలకు 30 లక్షలు, నల్గొండ మున్సిపాలిటీకి 10 కోట్లు, మిర్యాలగూడకు 5 కోట్లు, మిగిలిన ఆరు మున్సిపాలిటీలకు కోటి చొప్పున సుమారు 200 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తెల్లారే నిధులు ఇస్తామని చెప్పారు. ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. కానీ.. 4 నెలల వరకు సాగర్ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు.. హుజూరాబాద్ బై పోల్ తో సాగర్ హామీలు గుర్తొచ్చి.. అక్కడ పర్యటించబోతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 

రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అక్కడ వరాలు ప్రకటించడం సీఎం కేసీఆర్ కు అలవాటుగా మారింది. కిందటేడాది దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా 57 ఏండ్లు దాటిన అందరికీ పింఛను ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆ నియోజకవర్గంలో 4వేల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చి ఆపేశారు. ఊరూరా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి 20 కోట్ల వరకు హామీ ఇచ్చినా ఇప్పటికీ ఫండ్స్ రిలీజ్ చేయలేదు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్ లో వరదలు ముంచెత్తడంతో ఇంటికి 10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు. అవి కూడా కొందరికే ఇచ్చి ఆపేశారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా 134 పంచాయతీలు, ఆరు మండల కేంద్రాలు, రెండు మున్సిపాలిటీలకు కలిపి 70 కోట్లు ప్రకటించారు. అక్కడి లంబాడా గిరిజనులను దృష్టిలో పెట్టుకొని పోడుభూములకు పట్టాలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ హామీలు నెరవేరలేదు.

తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఉండటంతో.. అక్కడ 2వేల కోట్లతో దళితబంధు అమలు చేయబోతున్నారు. హుజూరాబాద్ లో ఇల్లు లేని దళితుడు ఉండొద్దని.. ఆరోగ్య, భూ సమస్యలు కూడా ప్రభుత్వమే పరిష్కారం చేస్తుందని మొన్నటి మీటింగ్ లో సీఎం చెప్పారు. కేవలం హుజూరాబాద్ పైనే దృష్టిపెడితే.. హామీలిచ్చుడు, మర్చిపోవుడు అవుతుందనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుందని.. సాగర్ లో ఒకసారి పర్యటించేందుకు రెడీ అయ్యారు సీఎం. దీనిద్వారా హామీలిచ్చినా.. ఆ తర్వాత వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని.. ప్రజల్లోకి వెళ్తుందని భావిస్తున్నారు కేసీఆర్.