‘వార్ధా’కు బ్రేక్‌‌‌‌!

‘వార్ధా’కు బ్రేక్‌‌‌‌!
  • వ్యాప్కోస్‌‌‌‌ దగ్గరే డీపీఆర్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : తుమ్మిడిహెట్టికి బదులుగా వార్ధా నదిపై బ్యారేజీ నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్ హామీకి బ్రేక్‌‌‌‌ పడింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆసిఫాబాద్‌‌‌‌, మంచిర్యాల జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో సుమారు 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి. కానీ దీనిపై సర్కారు ఇంట్రస్ట్‌‌‌‌ చూపడం లేదు. దీంతో ప్రాజెక్టుకు చెందిన డీటైల్డ్‌‌‌‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌‌‌‌)కూడా కేంద్ర ప్రభుత్వ సర్వే సంస్థ  వ్యాప్కోస్‌‌‌‌ దగ్గరే ఉండిపోయింది. తుపాకులగూడెం డీపీఆర్‌‌‌‌ రూపొందించేందుకు వ్యాప్కోస్‌‌‌‌ సంస్థ రూ.2 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసింది. ఆ బకాయిలు చెల్లిస్తేనే వార్ధా నది బ్యారేజీ డీపీఆర్‌‌‌‌ ఇస్తామని వ్యాప్కోస్‌‌‌‌ తేల్చిచెప్పింది. డీపీఆర్ విషయంలో వ్యాప్కోస్‌‌‌‌ షరతులపై ఇరిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఉన్నతాధికారులు కేసీఆర్‌‌‌‌కు చెప్పినా ఆయన అంతగా ఆసక్తి చూపలేదని సమాచారం. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీ డిజైన్‌‌‌‌ చేయడంతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మంగళం పాడారు. దానికి ఎగువన వార్ధా నదిపై బ్యారేజీ నిర్మించి ఆసిఫాబాద్‌‌‌‌, సిర్పూర్‌‌‌‌, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని కేసీఆర్‌‌‌‌ పలు సందర్భాల్లో ప్రకటించారు.

డీపీఆర్‌‌‌‌ రెడీ అయినా..
వార్ధా నది ప్రాణహితలో కలిసే సంగమానికి 5 కి.మీ.ల ఎగువన 632 మీటర్ల పొడవైన బ్యారేజీ నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. 35 గేట్లతో నిర్మించే బ్యారేజీలో 4టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసేలా డిజైన్‌‌‌‌ చేశారు. ఈ బ్యారేజీ కింద మహారాష్ట్రలోని 288 హెక్టార్లు, తెలంగాణలోని 117 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని అంచనా వేశారు. బ్యారేజీ నిర్మాణానికి రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చవుతుందని లెక్కగట్టారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌‌‌‌ నాలుగు నెలల క్రితమే రెడీ అయినా రాష్ట్ర సర్కారు దానికి ఆమోదం తెలిపే ప్రయత్నం చేయలేదు.