
- రెవెన్యూ ఆఫీసర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
- గత ప్రభుత్వం.. లేని సమస్యలు తెచ్చి రైతులపై మోపింది
- ధరణి కోసం అసలు టెండర్ పిలిచిన్రా? నిర్వహణకు ఎంత చెల్లిస్తున్నరు?
- బ్యాంకులను ముంచిన కంపెనీతో గత సర్కార్ ఒప్పందం చేసుకునుడేంది?
- భూ సమగ్ర సర్వే కోసం ప్రణాళికలు రెడీ చేయాలని ఆదేశం
- ధరణి కోసం తీసుకున్న నిర్ణయాలపై రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్‌కు సూచన
- భూ సంబంధిత వివాదాల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక కమిటీ
- కమిటీలో మంత్రులు, అధికారులు, రెవెన్యూ ఎక్స్పర్ట్స్, రైతు ప్రతినిధులు
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి.. లేని సమస్యలు రైతులపై మోపిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘అసలు ధరణి పోర్టల్ ఏ ప్రాతిపదికన రూపొందించారు ? ధరణి నిర్వహణకు అసలు టెండర్ పిలిచారా? ఆ ప్రైవేట్ కంపెనీ చేతిలో రైతుల భూములు, వ్యక్తిగత వివరాలు సేఫ్‌గా ఉన్నాయని ఎట్ల చెప్పగలరు? ప్రభుత్వం నుంచి ఆ కంపెనీకి వెళ్తున్న ఆదాయం ఎంత ? ధరణికి అసలు చట్టబద్ధత ఏమిటి?” అని ఆయన రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌పై సమగ్ర అధ్యయనం చేసి, భూలావాదేవీల వ్యవహారాలపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ రిపోర్టు ఆధారంగా ధరణి పోర్టల్‌ను ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాల శాశ్వత పరిష్కారం కోసం మార్గదర్శకాలను ప్రతిపాదించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. భూ సమగ్ర సర్వే నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై సెక్రటేరియెట్‌లో బుధవారం సీఎం రేవంత్ సమీక్షించారు.
ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజ నర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. ‘‘ధరణి పోర్టల్ ఎక్కడ మొదలైంది.. తొలుత ఏ కంపెనీకి ఇచ్చారు?” అని అధికారులపై ప్రశ్నలు మొదలుపెట్టారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్ అనే ప్రైవేట్ కంపెనీకి ముందుగా ధరణి ఇచ్చినట్లు అధికారులు చెప్పగా.. ‘‘ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ప్రజల భూముల రికార్డులను ధరణి పేరుతో ఐఎల్‌ఎఫ్‌ఎస్ అనే ప్రైవేటు కంపెనీ చేతిలో పెట్టడమేంది? రైతుల భూలావాదేవీలన్నీ నిర్వహిస్తున్న ఈ కంపెనీ రూ. వేల కోట్ల అప్పులు చేసి బ్యాంకులను ముంచింది.. దివాలా తీసిన ఈ కంపెనీతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం మొదటి తప్పు” అని సీఎం మండిపడ్డారు. ధరణి నిర్వహణ కోసం ఈ కంపెనీ టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే మరో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసిందని, ఇందులో 49 శాతం వాటాను 2021 నవంబర్ 25న టెర్రాసిస్ కంపెనీ ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన ఫాల్కన్ కంపెనీకి రూ.1,275 కోట్లకు అమ్ముకుందని రేవంత్ అన్నారు. ఏమి లేని ఒక కంపెనీ వాటాను సగం అమ్మితే రూ. వెయ్యి కోట్లకు పైనే చెల్లించి తీసుకున్నారంటే.. ఆ సంస్థకు ధరణి నుంచి ఎంత సొమ్ము వెళ్తుందో స్పష్టం చేయాలని ఆదేశించారు. రూ.20 కోట్ల నుంచి 25 కోట్లు మాత్రమేనని అధికారులు చెప్పినప్పటికీ.. నోటీ మాటలు కాదని పూర్తి లెక్కలతో ఏం జరుగుతుందో తెలియజేయాలని ఆయన తేల్చిచెప్పారు.
జమాబంది.. రికార్డులూ రాయాలి
ధరణిలో చాలా డేటా తప్పులు ఉన్నాయని సీఎం అన్నారు. సాదా బైనామాల్లో తప్పులను తొలగించాలని ఆదేశించారు. ‘‘కంప్యూటర్లనే నమ్ముకోవద్దు. జమా బంది, రికార్డులు రాయలి. రెవెన్యూ శాఖలో అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలి. అందుకు ప్రతిపాదనలు పంపండి” అని ఆయన స్పష్టంచేశారు. ధరణిలో డేటాను సదరు కంపెనీ యాక్సెస్ చేసే అవకాశం ఉందా? అని అధికారులను ప్రశ్నించారు. ధరణిపై గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే కొత్తగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. భూసంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా ఈ కమిటీ ప్రతిపాదనలను సూచించాలని చెప్పారు. కమిటీలో మంత్రులతోపాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు సభ్యులుగా ఉండాలన్నారు. ధరణి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలపై పూర్తి నివేదిక అందజేయాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. సమావేశంలో ఉన్నతాధికారులు శివధర్ రెడ్డి, శేషాద్రి, షా-నవాజ్ ఖాసీం పాల్గొనగా.. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రైతు ప్రతినిధులు కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సంపత్ కుమార్ రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ధరణి సమస్యలు వివరించిన లచ్చిరెడ్డి, భూమి సునీల్
-ధరణిపై సీఎం చేపట్టిన రివ్యూకు డిప్యూటీ కలెక్టర్ వి.లచ్చిరెడ్డి, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్‌కుమార్ హాజరై.. ధరణితో క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లోపభూయిష్ట సాఫ్ట్‌వేర్, ఇతర సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. వీటి పరిష్కారానికి చేపట్టాల్సిన తక్షణ చర్యల గురించి సీఎం, ఇతర మంత్రుల దృష్టికి తెచ్చారు. ధరణిలో స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే కట్టిన డబ్బు వెనక్కి రావడం లేదని వారు వివరించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములు కూడా తప్పుల తడకగా పెట్టారని అన్నారు. ఎక్కువ మాడ్యుల్స్ ఉండటంతో గందరగోళం ఏర్పడుతున్నదని తెలిపారు. ఏదైనా అప్లికేషన్ రిజెక్ట్ అయితే అప్పీల్‌కు వెళ్లే అవకాశం లేదన్నారు. పహానీలు అందుబాటులో పెట్టడం లేదని చెప్పారు. చాలామంది ఆఫీసర్లకు కొత్త ఆర్ఓఆర్ యాక్ట్‌పై అవగాహన కూడా లేదని సీఎం, మంత్రులకు వారు వివరించారు. అన్నీ కలెక్టర్‌కే కాకుండా కలెక్టర్ నుంచి.. మండల తహసీల్దార్ వరకు డ్యూటీస్ డీసెంట్రలైజేషన్ చేయాలన్నారు. గ్రామాలు, మండలాల పరిధిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని తెలిపారు.