
- అన్ని శాఖల్లో వారికి ఏం చేయగలమో ప్రతిపాదనలు సిద్ధం చేయండి
- కోటి మంది మహిళలకు ఏడాదంతా పని కల్పించేందుకు ఏర్పాట్లు
- ఐదేండ్లలో రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు.. ఇప్పటికే 21వేల కోట్లు మంజూరు
- మహిళా సంఘాలకు ఎలాంటి టెండర్లుఇవ్వాలనే దానిపైనా ఫోకస్
- సోలార్ ప్లాంట్స్, స్కూల్ యూనిఫామ్, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, అమ్మ ఆదర్శ పాఠశాలల బాధ్యతలు వారికే
- డిజిటల్ అక్షరాస్యత, సైబర్ భద్రత, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణలో ప్రత్యేక శిక్షణ
- రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ ఆఫీసుల నిర్వహణ, స్వచ్ఛభారత్ కార్యక్రమాల టెండర్లూ మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: మహిళా సాధికారతను టాప్ ప్రయారిటీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం లబ్ధిదారులుగా కాకుండా తెలంగాణ నిర్మాణంలో, రైజింగ్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్లో ఆడబిడ్డలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ, మహిళల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడంతోపాటు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు. ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్‌లో భాగంగా మహిళల కోసం ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుండగా.. అన్ని శాఖల్లో వారికి ప్రత్యేకంగా ఏం చేయగలం, మహిళా సంఘాలకు ఎలాంటి టెండర్లు ఇవ్వొచ్చు, కోటి మంది మహిళలకు ఏడాదంతా పని కల్పించాలంటే ఏం చేయాలి.. అనే దానిపై ప్రతిపాదనలు రెడీ చేయాలని ఆఫీసర్లను ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
మహిళలు.. ప్రగతికి వారధులు
ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వడంతోపాటు మార్కెటింగ్‌లో మెళకువలు నేర్పిస్తున్నది. సోలార్ పవర్ ప్లాంట్స్, యూనిఫామ్, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, అమ్మ ఆదర్శ పాఠశాలలు వంటివి వాటిలో ఇప్పటికే వారిని భాగస్వామం చేసింది.
రోల్ మోడల్‌గా తెలంగాణ
మహిళా సాధికారతలో తెలంగాణను రోల్ మోడల్‌గా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఐదేండ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే రూ. 21వేల కోట్లు ఇచ్చింది. డిజిటల్ అక్షరాస్యత, సైబర్ భద్రత, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణలో శిక్షణతో పాటు, మహిళలకు అనుకూలమైన పని గంటలు, శిశు సంరక్షణ సౌకర్యాల వంటి వాటిపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, స్వచ్ఛభారత్ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల ప్రచారంలో మహిళా సంఘాలకు టెండర్లు కేటాయించాలని నిర్ణయించింది.
ఇది ఆడబిడ్డల వ్యాపార నైపుణ్యాలను పెంచడమే కాకుండా సమాజంలో వారి గౌరవాన్ని, గుర్తింపును మరింత పెంచుతుందని అధికారులు అంటున్నారు. రూ.25,000 కోట్లతో చిన్న వ్యాపారాలు, మినీ ఇండస్ట్రియల్ పార్కులు, శిక్షణ, బ్రాండింగ్, మార్కెటింగ్, ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నది. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నది. మొదటి విడతలో ప్రతి జిల్లాకు 2 చొప్పున సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నది. రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతిచోటా క్యాంటీన్లు, స్కూళ్ల మరమ్మతులు, విద్యార్థుల స్కూల్ డ్రెస్సులు కుట్టడం వంటి పనులను మహిళా సంఘాలకు ఇచ్చి వారిని ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నది.
మహిళా సంఘాలు తీసుకున్న వడ్డీ లేని రుణాలు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి.. ఎలాంటి వ్యాపారాలు చేయించాలి.. మహిళా సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువులను తిరిగి ప్రభుత్వమే కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఇప్పటికే రూ. 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందించగా.. ఏటా రూ.20 వేల కోట్లకు తగ్గకుండా వీటిని ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తంగా ఐదేండ్లలో రూ. లక్ష కోట్ల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కోటి మంది సభ్యులే లక్ష్యంగా..!
రాష్ట్రంలో సెర్ఫ్ పరిధిలో 4.4 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలు ఉండగా.. ఇందులో 47 లక్షల మంది గ్రామీణ మహిళలకు సభ్యత్వం ఉంది. వీరిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేరినవాళ్లే 1.67 లక్షల మంది ఉన్నారు. ఇక, మెప్మా పరిధిలో 2 లక్షల మహిళా సంఘాలు ఉండగా.. 17 లక్షల మంది సభ్యులు ఉన్నారు. రెండింటిలో కలిపి కోటి మందిని సభ్యులుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. వీరందరినీ కోటీశ్వరులు చేయాలని ప్రణాళికలు రెడీ చేస్తున్నది. సెర్ఫ్ పరిధిలోని మహిళా సంఘాలకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 57.10 కోట్ల సీఐఎఫ్, రూ.6.60 కోట్లు రీవాలింగ్ ఫండ్ అందజేసింది.
వీవో సహాయకులకు రూ.5వేల చొప్పున జీతాల కోసం రూ.104 కోట్లు మంజూరు చేసింది. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు రూ.110 కోట్లు కేటాయించింది. మహిళా సంఘాల కోసం 359 పౌల్ట్రీ మదర్ యూనిట్లు, 29,895 బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ యూనిట్లు నెలకొల్పింది. విజయ డెయిరీ భాగస్వామ్యంతో 64 డెయిరీ పార్లర్లు ఏర్పాటు చేసింది. 50కి పైగా మొబైల్ ఫిష్ రిటైల్ ఔట్‌లెట్లు అందించింది. ఇక్రిసాట్‌తో కలిసి 2,500 అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తున్నది.
మినీ గోదాముల కోసం రూ.27 కోట్లు విడుదల చేసింది. అంతేకాకుండా.. 29,680 మహిళా టైలర్లకు 37.58 లక్షల స్కూల్ యూనిఫామ్స్ స్టిచింగ్ పని అప్పగించింది. వీరికి రూ.28.09 కోట్లు ఆదాయం సమకూరింది. పెట్రోల్ బంక్‌లు ద్వారా నెలకు రూ.4 నుంచి 5 లక్షల ఆదాయం పొందేలా ప్రణాళికలు రూపొందించింది. శిల్పారామం నైట్ బజార్ 106 ఔట్‌లెట్లు ఏర్పాటు చేసింది.