తెలంగాణలో మంచినీటి సరఫరా తగ్గింది10 శాతమే

తెలంగాణలో మంచినీటి సరఫరా తగ్గింది10 శాతమే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తాగునీటికి ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైతే తాగునీటి సరఫరా కోసం ఇంకో రూ.100 కోట్లు అయినా సరే ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పారు. నీటి కొరత ఉన్నచోట్ల ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని.. కంప్లయింట్లు వస్తే వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఈ మేరకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 

రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ను మినహాయిస్తే మొత్తం142 పట్టణాలున్నాయి. వీటిలో130 మున్సిపాలిటీలు,12 కార్పొరేషన్లున్నాయి. వీటిలో పది మున్సిపాలిటీలు, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్ల పరిధిలోనే తాగునీటి కొరత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సాధారణ రోజులతో పోలిస్తే పది శాతంలోపు తాగునీటి సరఫరా తగ్గిందని.. అయినప్పటికీ ప్రజల అవసరాలకు సరిపడేలా నీటిని అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో సగటున రోజుకు1,398.05 ఎంఎల్ డీ(మిలియన్స్ ఆఫ్ లీటర్ ఫర్ డే)ల తాగునీటి సరఫరా జరుగుతుండగా.. ప్రస్తుతం 1,371 ఎంఎల్ డీల నీటి సరఫరా జరుగుతోంది. కేవలం 26.31 ఎంఎల్ డీల నీటి కొరత మాత్రమే నెలకొంది.   

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి 

ఎండలు పెరిగిన కొద్దీ ఖమ్మం, కరీంనగర్ పట్టణాల్లో నీటి ఎద్దడి పెరుగుతుందనే అంచనాలతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. తలసరి నీటి అవసరాన్ని పరిశీలిస్తే 27 పట్టణాల్లో ప్రస్తుతం 135 ఎల్పీసీడీ (లీటర్ ఫర్ పర్సన్ ఫర్ డే) కంటే ఎక్కువ నీటి సప్లై ఉంది. 48 పట్టణాల్లో 100 నుంచి 135 ఎల్పీసీడీ ల మధ్య తాగునీటి సరఫరా జరుగుతోంది. 100 ఎల్పీసీడీల కంటే తక్కువగా సరఫరా అవుతున్న 67 పట్టణాలను సమస్యాత్మకమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. అక్కడ ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించి సరఫరా చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 23,839 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. 

ఇప్పటికైతే ఎక్కడా తాగునీటి ఎద్దడి లేదని మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు. అన్ని గ్రామాల్లో 100 ఎల్పీసీడీల నీటి సరఫరా చేస్తున్నారు. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు. గ్రిడ్ పంపులతో పాటు స్టాండ్ బైగా పంపులు అందుబాటులో ఉంచారు. పట్టణాలు, గ్రామాలన్నింటా సమీప నీటి వనరులను ఉపయోగించుకోవాలని ఇప్పటికే అన్ని మున్సిపల్, కార్పొరేషన్ల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.