జనజాతర సక్సెస్.. తుమ్మిడి హెట్టి, కుప్టీ ప్రాజెక్టులకు సీఎం రేవంత్​రెడ్డి హామీ

జనజాతర సక్సెస్.. తుమ్మిడి హెట్టి, కుప్టీ ప్రాజెక్టులకు సీఎం రేవంత్​రెడ్డి హామీ
  •     యూనివర్సిటీ ఏర్పాటుపై నిరుద్యోగులకు గుడ్ న్యూస్
  •     ఆదిలాబాద్ లో​జనజాతర సభకు
  •     వేలాదిగా తరలివచ్చిన​ కార్యకర్తలు, ప్రజలు

ఆదిలాబాద్/ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి హామీల జల్లు కురిపించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన రెండు ప్రాధాన ఇరిగేషన్ ప్రాజెక్టులపై స్పష్టతనిచ్చారు. మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత నదిపై తుమ్మిడి హెట్టి ప్రాజెక్టుతోపాటు బోథ్ నియోజకవర్గం నేరడిగొండ మండలంలోని కుప్టీ వాగుపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా సోమవారం ఆదిలాబాద్​జిల్లా కేంద్రంలోని డైట్​ కాలేజ్​ మైదానంలో నిర్వహించిన జన జాతర సభకు హాజరై మాట్లాడారు. ఆదిలాబాద్​పార్లమెంట్​పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి ప్రజలు, కార్యకర్తలు వేలాదిగా తరలిరాగా సభ జనసంద్రంగా మారింది. 

సాగునీరు, సంక్షేమానికి పెద్దపీట

సీఏం రేవంత్ రెడ్డి హామీతో కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి ముందుడగుపడనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 18 వేల ఎకరాల సాగునీరు, మూడు మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు బోథ్, బజార్​హత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ మండలాలు, కడెం మండలానికి నిరంతరం తాగునీరు అందుతుంది. తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంతో సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల ఐదు నియోజకవర్గాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఆదిలాబాద్​లో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. 

దీంతో ఇక్కడ ఆదివాసీ, పేద విద్యార్థులకు వివిధ కోర్సుల్లో ఉన్నత విద్య చదివేందుకు అవకాశం దక్కనుంది. వందేండ్లకు సరిపడా సున్నపు రాయి నిల్వలు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇక్కడి సిమెంట్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ మూలన పడింది. ఈ క్రమంలోనే సీసీఐని తెరిపించేందుకు ప్రైవేట్ పరంగా కూడా ప్రయత్నిస్తామని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడంతో జిల్లా వాసుల్లో ఆశలు రేకెత్తాయి.

కాంగ్రెస్​ మాటిస్తే నిలబెట్టుకుంటుంది

కాంగ్రెస్​ పార్టీ ప్రజలకు మాటిస్తే నిలబెట్టుకుంటుందని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని జిల్లా ఇన్​చార్జి​ మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​, బీజేపీలు ప్రజలకు ఏం చేశాయో చెప్పాలని ప్రశ్నించారు. హిందువుల పార్టీ అని చెప్పే బీజేపీ పూజలు చేసే అగర్బత్తీలపైనా జీఎస్టీ వసూలు చేస్తోందన్నారు. 

కాంగ్రెస్​ అధికారంలో ఉన్నపుడు పేదల కోసం ఉపాధిహామీ పథకాన్ని, ప్రతి బిడ్డా చదువుకునేలా విద్యాహక్కు చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. కానీ బీజేపీ మాత్రం జీఎస్టీ తీసుకువచ్చి దేశ వ్యాప్తంగా పేదల నుంచి రూ.54 లక్షల కోట్ల పన్నులు వసూలు చేసిందన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని, నల్లదనం వెనక్కి తెచ్చి జన్​ధన్​ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 

కాంగ్రెస్​పై మోదీ అసత్య ప్రచారాలు

ప్రధాని మోదీ కాంగ్రెస్​ మానిఫెస్టోలో లేని అనేక అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్​బాబు విమర్శించారు. బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు దేశ వ్యాప్తంగా అనేక ఆలయాలు నిర్మించిందని ఈ విషయాన్ని పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ మతతత్వ పార్టీగా దేవుడిని చూపి ఓట్లడుగుతోందని విమర్శించారు. బీఆర్ఎస్​ పాలనలో ఆదిలాబాద్ తీవ్ర అన్యాయానికి గురైందన్నారు.

ప్రశ్నించే గొంతుకకు ఒక్క అవకాశం ఇవ్వండి: ఆత్రం సుగుణ

ఆదిలాబాద్​ ఆడబిడ్డల తరఫున ప్రశ్నించే గొంతుకగా ఉన్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అభ్యర్థించారు. తనకు అవకాశమిస్తే ప్రజల్లోనే  ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, ఆదిలాబాద్​ను అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు. స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు ఆదిలాబాద్​లో మహిళకు అవకాశం రాలేదని, కానీ కాంగ్రెస్​ ఓ సాధారణ మహిళకు అవకాశం ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చానని.. తమ ఆడబిడ్డగా అవకాశం ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీ పదేండ్లు పరిపాలించి మోసాలు చేశాయని విమర్శించారు