దొంగదెబ్బ తీసే కుట్ర.. అందుకే ఐదు సార్లు కొడంగల్ వచ్చిన : సీఎం రేవంత్ రెడ్డి

దొంగదెబ్బ తీసే కుట్ర..  అందుకే ఐదు సార్లు కొడంగల్ వచ్చిన : సీఎం రేవంత్ రెడ్డి

నారాయణపేట: తనను దొంగదెబ్బ తీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే తాను ఐదు సార్లు కొడంగల్ కు వచ్చి మీటింగ్ లు పెట్టానని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇవాళ నారాయణపేట జిల్లా మద్దూరులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం మాట్లాడారు. డీకే అరుణ శత్రువు చేతిలో కత్తిలా మారి పాలమూరు కంట్లో పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏండ్ల తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందని, జిల్లా అభివృద్ధికి దానిని వినియోగించుకోవాలని కోరారు. 

జెండాల పక్కన పడేసి, ఎజెండాలను పక్కన పెట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్దికి  ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తాను కేసీఆర్ లా ఫాంహౌస్ లో పడుకోవడం లేదని, నిరంతరం ప్రజల మధ్యే ఉంటున్నానని అన్నారు. తాగుబోతోనికి సంసారం అప్పజెప్పితే అప్పుల కుప్ప చేసిండని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలో కేసీఆర్ చేసిన అప్పులకు 26 వేల కోట్ల కిస్తులను చెల్లించామని తెలిపారు. పాలమూరుపై ద్వేషంతో కేసీఆర్ ఇక్కడి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని అన్నారు. కేసీఆర్ పదేండ్లు చేసిన మోసానికి ఆయనను చెంపలు వాసేలా కొట్టాలని అన్నారు. 

సేవాలాల్ సాక్షిగా రుణమాఫీ

పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ చేస్తానని సీఎం పునరుద్ఘాటించారు. సేవాలాల్  సాక్షిగా తాను మాట ఇస్తున్నానని అన్నారు. డీసీసీబీ బ్యాంకు వాళ్లు రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. రైతులను ఇబ్బంది పెడితే చూస్తు ఊరుకోమని చెప్పారు. పంద్రాగస్టు వరకు ఓపిక పట్టాలని కోరారు.  

ఇంట గెలిచేందుకే వచ్చా

ఇంట గెలిచి రచ్చ గెలవాలని సామెత ఉందని సీఎం రేవంత్  రెడ్డి అన్నారు. అందుకే తనకు రాజకీయంగా జన్మనిచ్చిన కొడంగల్ కు వచ్చానని చెప్పారు. ఈ సెగ్మెంట్ నుంచే వంశీచంద్ రెడ్డికి  యాభై వేల మెజార్టీ రావాలని, ఇందుకోసం ప్రతి కార్యకర్త కథానాయకుడిగా మారి కదనరంగంలో దూకాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. 

హరీశ్ రావుకు సవాల్

మాజీ మంత్రి హరీశ్ రావు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తవా అంటూ సవాలు విసురుతున్నారని, తప్పకుండా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  కేసీఆర్ ఫాంహౌస్ లో ఉరివేసుకొని సచ్చినా రుణమాఫీ ఆగదని సీఎం చెప్పారు. రుణమాఫీ చేస్తే మీ పార్టీని రద్దు చేసుకుంటారా..? అంటూ సవాల్ విసిరారు.