మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ టైమ్ నీతి ఆయోగ్ మీటింగ్‎కు హాజరు

మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ టైమ్ నీతి ఆయోగ్ మీటింగ్‎కు హాజరు

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం (మే 23) రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం (మే 24) జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నీతి అయోగ్ మీటింగ్‎కు అటెండ్ అవుతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటా గురించి సీఎం ప్రస్తావించనున్నారు. 2047 తెలంగాణ రైజింగ్ కోసం నీతి ఆయోగ్ లో నిధుల కోసం విజ్ఞప్తి చేయనున్నారు.

వివిధ కారణాలతో గతేడాది జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ హాజరు కాలేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఈ సారి నీతి ఆయోగ్ మీటింగ్‎కు వెళ్తున్నారు. తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు నిధులు కావాలని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాసిన విషయం తెలిసిందే. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు, ఫోర్త్ సిటీ, మూసీ డెవలప్మెంట్‎కు నిధులు కేటాయించాలని కోరారు. ఇదిలా ఉంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో బీఆర్ఎస్ విభేదాల కారణంగా 2018 నుంచి తెలంగాణ నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి ఎవరూ హాజరు కాలేదు.

 తెలంగాణలో ప్రభుత్వం మారడంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ నీతి ఆయోగ్ సమావేశానికి అటెండ్ అవుతున్నారు. ఈ సమావేశం అనంతరం ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను సీఎం రేవంత్ కలవనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు, ఫోర్త్ సిటీ, మూసీ డెవలప్మెంట్ కు నిధులు  కేటయించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం.