బీసీ డిప్యూటీ సీఎం!..రెండో పోస్ట్ కేటాయించే చాన్స్?

బీసీ డిప్యూటీ సీఎం!..రెండో పోస్ట్ కేటాయించే చాన్స్?
  • లోక్ సభ ఎన్నికలకు ముందే నియామకం?
  •  రేసులో మహేశ్ కుమార్ గౌడ్, పొన్నం! 
  • బీసీ నేతకు పీసీసీ చీఫ్​ ఇస్తే.. డిప్యూటీ సీఎం పోస్ట్ మైనార్టీ లీడర్ కు?
  • బీసీలకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ వ్యూహం
  • గత ఎన్నికల్లో 40 సీట్లకోసం టీం ఓబీసీ డిమాండ్
  • ఇచ్చింది 23.. గెలిచింది కూడా చాలా తక్కువే
  • అందులో 10 వరకు గ్రేటర్ పరిధిలోనే.. 
  • ఓడిపోయే సీట్లు ఇచ్చారని బీసీ లీడర్ల వాయిస్
  • ఆ లోటును భర్తీ చేసుకునే చర్యల్లో హస్తం పార్టీ

హైదరాబాద్: తెలంగాణకు రెండో ఉపముఖ్యమంత్రిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఈ అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలకు ముందే మరో డిప్యూటీ సీఎం, కొందరు మంత్రులు ప్రమాణం చేస్తారని సమాచారం. గత ఎన్నికల సమయంలో ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంటు సెగ్మెంట్  పరిధిలో ఇద్దరు బీసీలకు సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ లోని ఓబీసీ నేతల టీం అధినాయకత్వాన్ని కోరింది. రాష్ట్రంలో 17 పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలో 34 మంది బీసీలకు కాంగ్రెస్ టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అయితే రకరకాల సమీకరణాలు, గెలుపు గుర్రాల ఎంపిక క్రమంలో బీసీలకు కేవలం 23 టికెట్ల మాత్రమే లభించాయి. అందులో దాదాపు 10 టికెట్లు గ్రేటర్ పరిధిలోనే ఉండటం గమనార్హం. ఎక్కువ సీట్లు మైనార్టీ ఏరియాల్లో ఇవ్వడం వల్ల ఓటమి బీసీ అభ్యర్థులు ఓటమి చెందారనే భావన నెలకొంది. ఈ నేపథ్యంలో బీసీ ప్రాతినిధ్యాన్ని పెంచాలని, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. మరో అడుగు ముందుకు వేసి బీసీ నేతకు కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం. 

త్వరలో ఆరు మంత్రి పదవుల భర్తీ!

కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్, కర్నాటకల్లో ఒక్కొక్క డిప్యూటీ సీఎం ఉండగా.. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. పొరుగునే ఉన్న ఏపీలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండటం గమనార్హం. తెలంగాణలో 18 మంత్రి పదవులకు అవకాశం ఉండగా.. ప్రస్తుతం ఆరు ఖాళీ ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వీటిని సామాజికవర్గాలు, ఇతర రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. 

పీసీసీ చీఫ్​ ఎవరు?

ప్రస్తుతం పీసీసీ చీఫ్​ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతున్నాయి. ఆ పదవిని ఇతరులకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతుందా..? తర్వాత చేస్తారా..? అన్నది కాంగ్రెస్ అధినాయకత్వం చేతిలో ఉంది. ఒక వేళ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు పీసీసీ చీఫ్ పదవి దక్కితే.. మైనార్టీ వర్గానికి చెందిన నాయకుడు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పేరు పీసీసీ చీఫ్​ గా పరిశీలనలో ఉందని సమాచారం. లేదంటే ఆయనకు డిప్యూటీ సీఎం పోస్టు దక్కవచ్చని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో కీలక నేత, తెలంగాణ ఉద్యమకారుడు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా డిప్యూటీ  సీఎం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలకు దీటుగా  కౌంటర్ ఇస్తూ.. నిత్యం ప్రజల్లో ఉంటూ దూసుకుపోతున్న పొన్నం ప్రభాకర్ ను డిప్యూటీ సీఎం పదవి వరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మైనార్టీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వానుకుంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన అమీర్ అలీఖాన్ పేరును పరిశీలించాల్సి ఉంటుంది.