ఢిల్లీలో సీఎం బిజీబిజీ..కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో రేవంత్ భేటీ

ఢిల్లీలో సీఎం బిజీబిజీ..కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో రేవంత్ భేటీ
  • ఎన్​హెచ్ఎం బకాయిలు రూ. 693 కోట్లు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్
  • దాదాపు 4 గంటల పాటు పార్లమెంట్​లోనే సీఎం
  • నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణ, పార్టీలో చేరికలపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు కూడా బిజీబిజీగా గడిపారు. తొలిరోజు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్​ను కలిసిన సీఎం.. రెండో రోజు కూడా అంతే బిజీగా కనిపించారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని వెంటనే రిలీజ్ చేసి రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి పార్లమెంట్​లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో ఆయన చాంబర్ లో సమావేశం అయ్యారు.

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) కింద తెలంగాణకు రావాల్సిన రూ. 693.13 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. వైద్య, ఆరోగ్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని, ఆయుష్మాన్ భారత్ రూల్స్ అన్నింటినీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 5,159 బస్తీ దవాఖానలు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు)సమర్థంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 

ఎన్‌‌హెచ్ఎం కింద 2023--–24 ఆర్థిక సంవత్సరంలో 3, 4 త్రైమాసికాలకు సంబంధించి తెలం గాణకు రూ.323.73 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, ఈ నిధుల్ని తక్షణమే విడుద‌‌ల చేయాల‌‌ని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఎన్‌‌హెచ్ఎంలో 2024-25 మొద‌‌టి త్రైమాసిక గ్రాంట్ రూ.138 కోట్లు మంజురు చేయాల్సి ఉందని తెలిపారు. ఎన్ హెచ్ఎంలో భాగంగా చేపట్టిన మౌలిక వసతులు, నిర్వహణ కింద 2023–24 ఏడాదికి సంబంధించి

రూ.231.40 కోట్ల బకాయిలను కూడా తక్షణమే రీయింబర్స్ చేయాలని కోరారు. 2023 అక్టోబ‌‌రు నుంచి రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం నుంచి రావ‌‌ల్సి న వాటా మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే విడుద‌‌ల చేస్తోందని సీఎం వివరించారు. ఇప్పటికైనా ఎన్ హెచ్ఎం కింద తెలంగాణ‌‌కు రావ‌‌ల్సిన పెండింగ్ నిధులను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు.   

నాలుగు గంటలు పార్లమెంట్​లోనే.. 

రెండో రోజు పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి దాదాపు నాలుగు గంటలపాటు పార్లమెంట్ లోనే గడిపారు. ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్, ఇతర పార్టీ ఎంపీలతో కాసేపు ముచ్చటించారు. మరోసారి ఎంపీలుగా ఎన్నికైన సుప్రియా సూలే, ఇతర సీనియర్లకు అభినందనలు తెలిపారు. తర్వాత లంచ్ కోసం తిరిగి తుగ్లక్ రోడ్డుకు వెళ్లారు. తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు మధ్యాహ్నం 1:40 నిమిషాలకు తిరిగి పార్లమెంట్ కు చేరుకున్నారు.

రాహుల్ ప్రమాణ స్వీకారం చూసేందుకు కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ వస్తున్నారన్న సమాచారంతో చాంబర్ దగ్గర ఆమె కోసం సీఎం వెయిట్ చేశారు. తర్వాత సోనియా, ప్రియాంక గాంధీ, మంత్రులు పొంగులేటి, సీతక్క, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ వివేక్ తో కలిసి రాష్ట్ర ఎంపీలు, రాహుల్ ప్రమాణ స్వీకారాన్ని రేవంత్ వీక్షించారు. అనంతరం రాష్ట్ర మంత్రులు పొంగులే టి, సీతక్క, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, ఇతర నేతలతో కలిసి  ఫొటోలు దిగారు.  

సోనియాతో 50 నిమిషాలకు పైగా...

పార్లమెంట్ లో దాదాపు 50 నిమిషాలకు పైగా అగ్రనేత సోనియా గాంధీ వెంట సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సోనియా, ప్రియాంకతో కలిసి తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు వీవీఐపీ గ్యాలరీకి వెళ్లారు. తెలంగాణ తర్వాత, మిజోరం, యూపీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. యూపీలోని రాయ్ బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం టైంలో సోనియా, రేవంత్ మధ్య రాష్ట్రానికి చెందిన పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోపాటు ఎంపీ ఎన్నికల్లో ఓటు షేర్ పెరగడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

అయితే, మరిన్ని స్థానాలు తెలంగాణ నుంచి వస్తాయని ఆశించినట్టు చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల రాష్ట్ర కేబినెట్ తీసుకున్న రుణ మాఫీ నిర్ణయాన్ని సోనియా దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్సీల చేరికలు, కేబినెట్ విస్తరణపై కూడా డిస్కషన్ జరిగినట్లు సమాచారం. ప్రమాణ స్వీకారం తర్వాత సోనియాతో కలిసి బయటకు వచ్చిన రేవంత్, ఆమెకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీలకు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ దీపా మున్షీ విందు ఇచ్చారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని సీఎం అధికారిక నివాసంలో ఈ విందు కార్యక్రమం జరిగింది.

రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడండి

ఎన్నిక‌‌ల్లో ఏ పార్టీ నుంచి గెలుపొందినా, రాష్ట్ర ప్రయోజ‌‌నాలే ల‌‌క్ష్యంగా లోక్‌‌స‌‌భ‌‌లో పోరాడాల‌‌ని ఎంపీల‌‌ను సీఎం కోరారు. ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీలంద‌‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ‌‌కీయ వైరుధ్యాలు వేరు, రాష్ట్ర ప్రయోజ‌‌నాలు వేరని గుర్తించి ముందుకు సాగాల‌‌న్నారు. రాష్ట్ర ప్రయోజ‌‌నాల సాధ‌‌న‌‌కు పార్లమెంట్‌‌ ను వేదిక‌‌గా చేసుకోవాల‌‌ని కోరారు.