
- హైదరాబాద్‌లోని ముంపు ప్రాంతాల బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
- అమీర్‌పేట్‌లోని గంగూబాయి బస్తీ, బుద్ధనగర్‌లో ఆకస్మిక పర్యటన
- కాలనీల్లో నడుస్తూ బాధితుల సమస్యలు తెలుసుకున్న సీఎం
- ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్‌లో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, ఇందుకోసం ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తామని ముంపు ప్రభావిత ప్రాంతాల బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన పలు ప్రాంతాల్లో ఆదివారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. అమీర్‌పేటలోని గంగూబాయి బస్తీ, బుద్ధనగర్‌లో నడుస్తూ.. బాధితులతో నేరుగా మాట్లాడుతూ.. వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వరద వల్ల రాత్రంతా మెలకువతోనే ఉన్నామని స్థానికులు వాపోగా, సమస్యను పరిష్కరిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. మంచి నీటిలో మురుగు నీరు కలుస్తున్నదా? అని ఆరా తీశారు. బుద్ధనగర్‌లో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన సీఎం.. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎత్తులో ఉండటం వల్ల వరద తీవ్రత పెరుగుతున్నదని గుర్తించారు. దీనికి తక్షణమే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. గంగూబాయి బస్తీ కుంటను కొందరు పూడ్చివేసి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయగా, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
వరద సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ‘‘ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఇండ్లలోకి చేరిన వరదను తొలగించేందుకు చర్యలు తీసుకోండి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించండి. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి, వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడండి” అని అధికారులను ఆదేశించారు. వరద సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లు, అధికారులకు సూచనలు చేశారు.
పుస్తకాలు తడిసినయ్ సార్..
బుద్ధనగర్‌లో ఓ బాలుడితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏడో తరగతి చదువుతున్న జశ్వంత్‌ను పిలిచి వరద పరిస్థితిపై అడగ్గా.. ‘సార్.. ఇంట్లోకి వరద నీళ్లు వచ్చి పుస్తకాలన్నీ తడిసిపోయినయ్. వరద రాకుండా చూడండి’ అని కోరాడు. దీంతో వరద రాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాలుడికి సీఎం హామీ ఇచ్చారు.