
- రూ.110 కోట్లతో ప్రారంభమైన కురుమూర్తి ఘాట్ రోడ్డు పనులు
- రూ.200 కోట్లతో మన్యంకొండ, కురుమూర్తి ఆలయాల అభివృద్ధికి ప్రపోజల్స్
- రెస్ట్ రూమ్స్, గెస్ట్ హౌస్‌లు, కల్యాణ మండపాలు, రోడ్ల నిర్మాణాలకు ఎస్టిమేషన్లు
మహబూబ్‌నగర్, వెలుగు: పాలమూరు పుణ్య క్షేత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వందల ఏండ్ల చరిత్ర ఉన్న ఇక్కడి క్షేత్రాలను డెవలప్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్య క్షేత్రాలైన కురుమూర్తి, మన్యంకొండ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని ఇటీవల పాలమూరు జిల్లా పర్యటనలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఆఫీసర్లు ఈ రెండు ఆలయాలకు సంబంధించి దాదాపు రూ.200 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఇది వరకే మంజూరుచేసిన రూ.110 కోట్లతో కురుమూర్తి ఘాట్ రోడ్డు పనులను ప్రారంభించారు.
మన్యంకొండకు రూ.110 కోట్లతో..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్యంకొండ క్షేత్రానికి వందల ఏండ్ల చరిత్ర ఉంది. ఈ క్షేత్రంలో ఏటా మాఘమాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆ మాసంలో వచ్చే పున్నమి రోజున నిర్వహించే రథోత్సవానికి కర్నాటక, తెలంగాణ, ఏపీ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయలు కల్పించేందుకు ఎండోమెంట్ ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.130 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. అందులో అలివేలు మంగతాయారు ఆలయ మండపం పునర్నిర్మాణం, కల్యాణ మండపం, కొండపై ప్రధాన ఆలయం వద్ద అన్నదాన సత్రం, అక్కడే ప్రసాదాల తయారీ, విక్రయాల కేంద్రం నిర్మాణాలకు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం గర్భలాయంలోకి వెళ్లేందుకు ఒకే ఒక్క క్యూ లైన్ ఉంది.
దీంతో ప్రత్యేక రోజులు, పండుగలు, అమావాస్య సందర్భాల్లో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎంట్రీకి ఒక క్యూ, ఎగ్జిట్‌కు మరో క్యూ లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. రూ.5.83 కోట్లతో డార్మెటరీ హాల్స్‌కు, రూ.10 కోట్లతో వంద గదుల సత్రానికి, రూ.8 కోట్లతో అన్నదానం హాల్ నిర్మాణానికి, రూ.1.84 కోట్లతో రెస్ట్ హౌస్, రూ.20 కోట్లతో దర్శనానికి నడిచి వెళ్లే వారికి స్కై వాక్కు, రూ.కోటితో ఫుడ్ కోర్టు, గుట్టపై నుంచి కిందికి రావడానికి సెకండ్ ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ.22.25 కోట్లు, అమ్మవారి టెంపుల్, మండప నిర్మాణం కోసం రూ.6.81 కోట్లు, గుట్ట కింద విశ్రాంతి మండపం, క్యూ కాంప్లెక్స్ కోసం రూ.20.50 కోట్లతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఎండోమెంట్ ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపారు. దీనిపై రెండు సార్లు టీటీడీకి చెందిన అధికారులు మన్యంకొండ క్షేత్రాన్ని పరిశీలించి వెళ్లారు. త్వరలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది.
రూ.70 కోట్లతో కురుమూర్తి ఆలయానికి..
పేదల తిరుపతిగా కురుమూర్తి క్షేత్రం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ ప్రాంతాలకు నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల(పాదుకలు) ఉత్సవానికి 5 లక్షల మంది భక్తులు వస్తారు. నిరుడు జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్రం అభివృద్ధికి కావాల్సిన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
రూ.20 కోట్లతో 50 గదులతో సత్రం, రూ.14 కోట్లతో అన్నదాన సత్రం, రూ.4 కోట్లతో మహా మండపం, రూ.7 కోట్లతో కల్యాణ మండపం, రూ.3 కోట్లతో దాసంగాలు పెట్టుకోవడానికి మూడు షెడ్లు, రూ.4 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి సిస్టం, రూ.3 కోట్లతో కల్యాణ కట్ట, రూ.2 కోట్లతో మూడు గెస్ట్ హౌస్‌లు, రూ.4 కోట్లతో ఆలయ రాజగోపురం నుంచి డివైడర్, లైటింగ్ సిస్టంతో కూడిన మెయిన్ రోడ్డు నిర్మాణం, రూ.2 కోట్లతో ఐదు లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ నిర్మాణం, రూ.2 కోట్లతో ఇంటర్నల్ సీసీ రోడ్లు, రూ.4 కోట్లతో టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నిర్మాణం కోసం ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఘాట్ రోడ్డు పనులు షురూ..
నిరుడు జరిగిన కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సీఎం చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గుట్ట పైకి వెళ్లేందుకు రూ.110 కోట్లతో చేపట్టే ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులకు ఇటీవల టెండర్లు పూర్తి కాగా, కాంట్రాక్టర్ రెండు రోజుల కింద పనులు ప్రారంభించారు. అయితే ఈ రోడ్డు ఎంట్రీ, ఎగ్జిట్‌కు వేర్వేరు మార్గాలు ఉండేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం కురుమూర్తి విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్న ప్రాంతం నుంచి కురుమూర్తి గర్భ గుడి సమీపం వరకు ఫ్లై ఓవర్‌ను నిర్మించనున్నారు.
ఇది ఎంట్రీ, దర్శనం అయిపోయాక దేవుని గుట్ట, దేవర గుట్ట చుట్టూ తిరిగి వెళ్లేలా నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి వచ్చే వాహనాలు నేరుగా అమ్మాపురం గ్రామ సమీపంలోని మెయిన్ రోడ్డుకు చేరుకునేలా డిజైన్ చేశారు. ఆరు కిలోమీటర్ల మేర రోడ్లు వేయనున్నారు. ఈ పనులను ఏడాదిలోపు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.