
- యువతలో టెక్నికల్ స్కిల్స్‌ను పెంపొందిస్తున్నం
- ఇందుకోసం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినం
- ఐఐటీలను ఏటీసీలుగా మారుస్తున్నం
- విద్యారంగాన్ని ఓ సవాల్‌గా తీసుకొని పనిచేస్తున్నామని వెల్లడి
- కేరళలోని అలప్పుళలో ఎంపీ మెరిట్ అవార్డుల కార్యక్రమానికి హాజరు
హైదరాబాద్, వెలుగు: దేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి విద్య ఒక్కటే మార్గమని, అందుకే తెలంగాణలో విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యను ఒక గొప్ప బహుమతిగా, ఆయుధంగా, శక్తిగా తాను బలంగా విశ్వసిస్తానని చెప్పారు. లోక్‌సభ సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ కేరళలోని అలప్పుళలో ఆదివారం నిర్వహించిన ‘ఎంపీ మెరిట్ అవార్డులు-2025’ బహూకరణ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యకు కేరళ రాష్ట్రానికి బలమైన సంబంధం ఉందని అన్నారు. దేశంలో వంద శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రశంసించారు. అణచివేత, అన్యాయానికి గురవుతున్నవారికి కేసీ వేణుగోపాల్ గొంతుకగా నిలబడుతున్నారని కొనియాడారు. 19 ఏండ్లుగా పది, పన్నెండు తరగతుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ‘పొంథువల్ ఎంపీ మెరిట్ అవార్డులు’ బహూకరించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు.
విద్యా రంగంపై ప్రభుత్వాలకు సరైన దృష్టి లేకపోవడం వల్లే ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారని, అందుకే తెలంగాణలో విద్యా రంగాన్ని ఒక సవాల్‌గా తీసుకొని పనిచేస్తున్నామని తెలిపారు. ‘‘తెలంగాణలో వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలు నిర్మిస్తున్నాం. ప్రతి పాఠశాలకు రూ. 200 కోట్లు వెచ్చించి ఒక్కో క్యాంపస్‌లో 2,500 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని వివరించారు.
నైపుణ్యాభివృద్ధికి ప్రయారిటీ
ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ విద్యార్థుల్లో సరైన నైపుణ్యత లేకపోవడంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాలాంటి పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని తెలిపారు. అలాగే, పాత మోడల్ ఐటీఐలను టాటా టెక్నాలజీస్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మారుస్తున్నామన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లవుతున్న 2047 నాటికి భారతదేశం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని, ఈ లక్ష్య సాధనలో తెలంగాణ నుంచి 10 శాతం మేరకు దోహదపడాలన్న సంకల్పంతో తమ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ‘‘సౌత్ కొరియాలాంటి చిన్న దేశం ఒలింపిక్స్‌లో 32 పతకాలు సాధిస్తే, 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించలేకపోవడం విచారించదగిన విషయం’’ అని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సంజీవ్గోయెంకా లాంటి క్రీడా దిగ్గజాలతో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డును ఏర్పాటు చేశామని, వారి నేతృత్వంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ స్థాపిస్తున్నామని తెలిపారు.
శాసనసభకు పోటీ చేసే వయసును 21కు తగ్గించాలి
యువతలో క్రీడారంగంపై ఆసక్తిని పెంచడానికి కొరియా, ఆస్ట్రేలియాలాంటి దేశాల్లోని యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉన్నదని చెప్పారు. ఓటు హక్కు వయోపరిమితిని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 21 ఏండ్ల నుంచి 18 ఏండ్లకు తగ్గించినట్లే, శాసనసభకు పోటీ చేసే వయసును కూడా 25 నుంచి 21 ఏండ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
యువత తమ శక్తిని గుర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మొత్తం 3,500 మంది విద్యార్థులకు మెరిట్ అవార్డులు బహూకరించారు. కేసీ వేణుగోపాల్‌తోపాటు కేరళ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీజీ థామస్, డీఆర్డీవో అగ్ని –4 మిసైల్ ప్రాజెక్టు మాజీ డైరెక్టర్ డాక్టర్ టెస్సీ థామస్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.