
- బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలే
- త్వరలో బీసీ సంఘాలతో సమావేశమవుతాం
- స్థానిక సంస్థల ఎన్నికలు ఆపడం వల్ల రాష్ట్రానికి నష్టం
- మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: ఎర్రవల్లి ఫామ్‌హౌసే కేసీఆర్‌కు చర్లపల్లి జైలు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ప్రస్తుతం కేసీఆర్ స్వీయ నియంత్రణలోనే ఉన్నారు. ఆయన జైల్లో ఉన్నట్లే ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. ఆయనను నేనెం దుకు జైల్లో వేస్త.. ఆయనంతట ఆయనే స్వీయ నియంత్రణగా జైల్లో ఉన్నట్లు ఫామ్ హౌస్‌లో ఉన్నా రు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు, చర్లపల్లి జైలుకు తేడా ఏముంది? అక్కడా పోలీసులు ఉంటారు, ఇక్కడా ఉన్నారు.
మధ్య మధ్యలో విజిటర్స్ వచ్చి మాట్లాడి వెళ్తారు. కేసీఆర్‌ను ఓడించడమే ఆయనకు పెద్ద శిక్ష’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో ప్రెస్ మీట్ తర్వాత కాసేపు మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ చేశారు. ‘‘కేసీఆర్ హాస్పిటల్లో చేరినట్లు తెలిసి పార్టీ నేతల్ని వెళ్లి చూడాల న్నాను. అయితే, బీఆర్ఎస్ నేతలు వద్దన్నారు.
అయినప్పటికీ ప్రతిపక్ష నేత ఆరోగ్యంపై ఎప్పటిక ప్పుడు వాకబు చేస్తూ, బెస్ట్ ట్రీట్మెంట్ అందించాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించాను. జైపాల్ రెడ్డి ఆరోగ్యం విషయంలో అప్పటి ప్రభుత్వం ఇలానే స్పందించింది. వాజ్ పేయి విషయంలోనూ ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఆరా తీశారు” అని వివరించారు. తాను విద్వేష రాజకీయాలు చేయడం లేదని, కేసీఆర్ మాదిరిగా తనకు బిట్టర్ పాలిటిక్స్ రావని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ నేతలకు నైతికతపై మాట్లాడే అర్హత లేదు
బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్మెంట్ అడిగి నా ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అయితే.. ఈ విషయంలో కేంద్ర హోంశాఖతో సంబంధం లేనందున అమిత్ షా అపాయింట్మెంట్ కోరలేదని చెప్పారు. ఇక, దుప్పటి కప్పుకొని పడుకున్నా రెండోసారి తాము సునాయాసంగా అధికారంలోకి వస్తామని సీఎం అన్నారు. ఇతరుల ఇంటి వ్యవహారాల్లో వేలు పెట్టకుండా ఉంటే అధికారం దానంతట అదే వస్తుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ‘‘వాళ్లు చేసిన పాపాలకు నైతికత పేరుఎత్తితే, ‘ఆ నైతికత’ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది’’ అని సీఎం వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికలతోపాటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వస్తుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై త్వరలోనే బీసీ సంఘాలు, బీసీ భాగస్వాములతో భేటీ కానున్నట్లు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోయాయని.. వాటిని వాయిదా వేయడం వల్ల కూడా రాష్ట్రానికి నష్టమేనని చెప్పారు. బీసీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే.. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ(పీఏసీ)లో చర్చిస్తామని తెలిపారు. ఇతర పార్టీలు ఈ విషయంలో ముందుకొస్తే మరీ సంతోషం అన్నారు. 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దని కేసీఆర్ తెచ్చిన పంచాయతీ చట్టంతోనే అసలు సమస్య తయారైందని సీఎం రేవంత్ తెలిపారు.