ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రయిక్ : సీఎం రేవంత్​రెడ్డి

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రయిక్ : సీఎం రేవంత్​రెడ్డి
  • రిజర్వేషన్ల రద్దుకు కుట్ర.. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్​
  • రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని ప్లాన్​ వేసిన్రు
  • ఈ కుతంత్రాలను తిప్పికొడ్తుంటే మాపై దుష్ప్రచారం చేస్తున్నరు
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలి
  • బీజేపీ కుట్రలపై కేసీఆర్​ ఎందుకు మాట్లాడ్తలే?
  • ఆయన కూడా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని గతంలో అన్నడు
  • ఈటల గెలుస్తడని మల్లారెడ్డి అంటే కేసీఆర్​ ఎందుకు చర్యలు తీసుకోలే.. బీఆర్​ఎస్​, బీజేపీ ఒక్కటేనని తేలిపోయింది
  • రిజర్వేషన్లు ఉండాలన్నా, వాటిని పెంచాలన్నా కాంగ్రెస్ గెలవాలి
  • బీఆర్​ఎస్​కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రయిక్ చేస్తున్నదని, ఈ వర్గాల రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నదని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. బీజేపీ తీరును చూస్తుంటే దేశం అత్యంత  ప్రమాదకర పరిస్థితుల వైపు వేగంగా ప్రయాణిస్తున్నట్లు ఉందని అన్నారు. ‘‘దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. మోదీ, అమిత్ షా కుట్రలకు అదానీ, అంబానీ తోడయ్యారు. ఆర్ఎస్ఎస్ మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడంలో భాగంగానే బీజేపీ 2025 లోగా రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నది.

రిజర్వేషన్లను రద్దు చేసి, రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయాలన్నది ఆర్ఎస్ఎస్  ప్లాన్. అందుకే దేశంలో మూడింట రెండో వంతు మెజార్టీ సాధించేందుకు 400 సీట్లు గెలవాలనే వికృత రాజకీయ క్రీడకు బీజేపీ తెరలేపింది. ఈ మెజార్టీ సాధిస్తే ఏదైనా చేయవచ్చనే దుర్మార్గపు ఆలోచనలో బీజేపీ ఉంది” అని ఆయన విమర్శించారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు.

రిజర్వేషన్లను రద్దు చేసి దళితులు, గిరిజనులు, ఓబీసీలను కార్పొరేట్ కంపెనీల ముందు కట్టు బానిసలుగా నిలబెట్టాలని బీజేపీ చూస్తున్నదని.. దీన్ని తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విషప్రచారం చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. ‘‘దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తాళి పుస్తెలు లాక్కుంటదంటూ మోదీ, అమిత్​ షా ఆరోపణలు చేస్తున్నరు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం ఏంది?” అని ఆయన ప్రశ్నించారు. 

గత పదేండ్లుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేసుకుంటూ వస్తున్నదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీలా బీజేపీ వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ‘‘రిజర్వేషన్లు రద్దు చేయబోమని, అవసరమైతే వీటిని పెంచుతామని మోదీ, అమిత్ షా ఎక్కడ కూడా ఎందుకు చెప్పడం లేదు?” అని  ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మాత్రమే కాదు.. లెఫ్ట్ భావజాలం అని చెప్పుకునే ఈటల రాజేందర్ కూడా ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ‘‘బీజేపీ విధానమేంటో వాళ్లకు స్పష్టంగా తెలుసు. అందుకే వాళ్లు మాట్లాడటం లేదు. ఈ ఇష్యూ నుంచి తప్పించుకోవాలన్న ఆలోచనే తప్ప.. ఇది తప్పని మోదీ, అమిత్ షాతో చెప్పిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు అనడం లేదు? ఈ నేతల పని బంజరుదొడ్డి ముందు కాపలా ఉండడమే తప్ప మరేమీ లేదు.’’ అని అన్నారు. 

తెలంగాణ ప్రజలు ఆలోచించాలి

‘‘తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్న.. రిజర్వేషన్లు ఉండాలన్నా, వాటిని పెంచాలన్నా కాంగ్రెస్ గెలవాలి. రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీ గెలవాలి. ఆలోచించండి” అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిందే కాంగ్రెస్​ పార్టీ అని, 1978లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు మండల్ కమిషన్​ను కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కమిషన్ బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సూచిస్తే  ఆనాడు ఆర్ఎస్ఎస్ అనుకూల వర్గాలు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించాయని అన్నారు.

‘‘సుప్రీంకోర్టు కూడా మండల్ కమిషన్ నివేదికను సమర్థించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా అమలు చేయాలని తెలిపింది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని రాహుల్ గాంధీకి ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. బీసీ కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అందుకే కుల గణన ఎక్స్ రే లాంటిదని ఆయన స్పష్టం చేశారు. బీసీ జనగణన చారిత్రక అవసరం. జనాభాను లెక్కిస్తేనే దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచే వీలుంటుంది” అని తెలిపారు. 

కాంగ్రెస్​పై మోదీ దుష్ప్రచారం

కాంగ్రెస్​పై మోదీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘ఎవరి కష్టార్జితం వాళ్లదే.. ఎవరి సంపాదన వాళ్లదే.. భార్య ఆస్తిని కూడా అనుమతి లేకుండా భర్త తీసుకోవడానికి హక్కు లేదని కోర్టులు చెప్తున్నాయి. అలాంటిది దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన సంపద అంతా ముస్లింల పరమవుతుందంటూ.. మహిళలపై ఉన్న తాళి పుస్తెలు కూడా లాక్కుంటారని మోదీ దుష్ప్రచారం చేస్తున్నరు. ఇలా మాట్లాడడం ఏంది?” అని రేవంత్​ ప్రశ్నించారు. 

మల్లారెడ్డి మాటలతో బీజేపీ, బీఆర్​ఎస్ ఒప్పందం బయటకు​

తెలంగాణలో బీఆర్ఎస్ ఐదు ఎంపీ స్థానాలను బీజేపీకి తాకట్టు పెట్టిందని తాను మొదటి నుంచి చెప్తున్నానని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. మల్కాజ్​గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల గెలుస్తారని రెండు రోజుల కింద మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పడమే ఇందుకు నిద ర్శనమని పేర్కొన్నారు. ‘‘అమాయకంగానో, అత్యుత్సాహంతోనో మల్లారెడ్డి ఈ విషయంపై కుండ బద్దలు కొట్టారు. నిజంగానే బీఆర్ఎస్ కు బీజేపీతో రాజకీయ వైరం ఉంటే మల్లారెడ్డిని వెంటనే పార్టీ నుంచి కేసీఆర్​ సస్పెండ్ చేయాలి.

లేకపోతే ఇక కేసీఆర్, కేటీఆర్​ గుండు పగులగొట్టుడే మిగిలింది” అని ఆయన అన్నారు. మల్లారెడ్డి మాటలు, ఆయనపై కేసీఆర్​ చర్యలు తీసుకోకపోవడం చూస్తే తెలంగాణ సమాజం బీజేపీ, బీఆర్​ఎస్​ మధ్య ఒప్పందం ఉన్నట్లు భావిస్తుందని చెప్పారు. బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ గెలుస్తుందని చెప్పిన ఎమ్మెల్యేను కేటీఆర్ సమర్థించడం దేనికి సూచన అని ఆయన ప్రశ్నించారు. ‘‘గత ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్​గిరి నుంచి నేను పోటీ చేసి నప్పుడు ఓడించేందుకు 31 సమావేశాలు పెట్టిన కేటీఆర్.. ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు కేవలం ఒక్క సమావేశం మాత్రమే పెట్టిండు.

ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా కేటీఆర్ మాట్లాడ్తలే. కేసీఆర్, కేటీఆర్​కు వ్యతిరేకంగా ఈటల మాట్లాడ్తలే. పైగా భూములు అమ్మకుండా రుణమాఫీ చేయాలని నాపై ఈటల విమర్శలు చేస్తున్నడు. కేసీఆర్, కేటీఆర్ భూములు అమ్మినప్పుడు ఆయనకు గుర్తు కు రాలేదా?” అని నిలదీశారు. రుణమాఫీ ఎలా చేయాలనేది తన వద్ద పక్కా ప్రణాళిక ఉందని అన్నారు. ‘‘రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగినప్పుడు ఈటల రాజేందర్​ ఆర్థిక మంత్రిగా ఉన్నడు.  రైతుల చావులను కేసీఆర్, ఈటల కోరుకున్నరు” అని మండిపడ్డారు.  

పెద్దమ్మ సాక్షిగా పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తం

జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి సాక్షిగా మాట ఇస్తున్నానని, పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతామని మరోసారి సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందిస్తూ.. ప్రస్తుతం విచారణ దశలో ఉందని, అలాంటప్పుడు దీనిపై తాను ఇప్పుడు మాట్లాడలేనని అన్నారు. విచారణ పూర్తయి, అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపై మాట్లాడుతానని స్పష్టం చేశారు. 

కేసీఆర్​ వైఖరేంది? 

రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్న బీజేపీ విధానంపై బీఆర్ఎస్ వైఖరేంటో కేసీఆర్ చెప్పాలని సీఎం రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. ‘‘అమెరికా నుంచి అమలాపురం వరకు.. చంద్ర మండలం నుంచి చింతమడక వరకు  కేసీఆర్ అన్ని మాట్లాడుతున్నడు. కానీ, బీజేపీ చేసే కుట్ర గురించి మాత్రం మాట్లాడడం లేదు.. ప్రశ్నించడం లేదు” అని సీఎం రేవంత్​ అన్నారు. ‘‘ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లోనే ఎన్నో హామీలను అమలు చేస్తున్నం. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నం. అలాంటి మా ప్రభుత్వాన్ని దిగిపొమ్మంటూ బస్సుయాత్ర చేస్తున్నవ్ కదా.. మరి పదేండ్లు దేశాన్ని అప్పుల కుప్పగా మార్చి, రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోదీపై నీ కార్యాచరణ ఎక్కడుంది కేసీఆర్​?” అని ఆయన నిలదీశారు.

‘‘కేసీఆర్ .. మీ టార్గెట్ వంద రోజుల మా ప్రభుత్వమా.. పదేండ్లు ప్రజలను మోసం చేస్తున్న మోదీపైనా? నీకు ఇంత అసహనం ఎందుకు.. అధికారం లేకపోతే ఊపిరి ఆగిపోతుందా..” అని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్నారని, అందుకే రిజర్వేషన్ల రద్దు కోసం మోదీ, కేసీఆర్ ఒక్కటయ్యారా? అని ఆయన ప్రశ్నించారు. బిడ్డ బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్​ ఒప్పందం చేసుకున్నారని, ఇప్పుడు మోదీని మెప్పించి, అమిత్ షాను ఒప్పించే పనిలో ఆయన ఉన్నారని రేవంత్​ దుయ్యబట్టారు. 

బీఆర్​ఎస్​కు ఒక్క సీటు కూడా రాదు

‘‘కేసీఆర్ నాకు ఇచ్చిన వారసత్వం కరువు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు మేము నాలుగు నెలల్లో రూ.24 వేల కోట్లు మిత్తి కట్టినం. ప్రతి నెల రూ.6 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీళ్లు, కరెంట్ ఎక్కువ ఇస్తున్నం.. నీళ్ల వినియోగం పెరిగినా అందుకు తగ్గట్టుగా నీటి సరఫరా చేస్తున్నం”అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు పంట నష్ట పరిహారం ఇస్తామన్నారు. తెలంగాణలో 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

‘‘సికింద్రాబాద్ ఎప్పుడు కూడా కాంగ్రెస్​కే అనుకూలం. దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎంపీగా ఓడిపోయారు. అలాంటిది ఆయనకన్నా కిషన్ రెడ్డి తోపా? మహబూబ్​నగర్  నా సొంత జిల్లా. ఎన్నిసార్లు అయినా అక్కడికి ప్రచారం కోసం వెళ్త” అని తెలిపారు. బీఆర్ఎస్ రెండు చోట్ల మాత్రమే రెండో స్థానంలో ఉంటుందని, మిగితా అన్ని చోట్ల ఆ పార్టీకి మూడో స్థానమేనని, మెదక్​లోనూ ఆ పార్టీది మూడో స్థానమేనని చెప్పారు.

ఈ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఒక్క సీటు కూడా గెలువదని అన్నారు. వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం ఉంటుందని, ఇంకా తేదీలు ఖరారు కాలేదని సీఎం తెలిపారు. ‘‘సమాధానం చెప్పలేక ఇరుక్కుంటానన్న భయంతో కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. కానీ, ఓ టీవీ చానల్​ ఇంటర్వ్యూ కోసం ఆ స్టూడియోకు వెళ్లి నాలుగు గంటలు సొల్లు పురాణం చెప్పిండు. అక్కడ సాంబా.. చెప్పురా అన్నట్లు కేసీఆర్ చెప్పిందే ప్రసారం అయింది తప్ప అందులో పస లేదు” అని ఆయన విమర్శించారు.  

కేటీఆర్​ను పట్టించుకోను.. ఆయనో పిల్లాడు

కేసీఆర్ ఏం మాట్లాడినా ఆయన మాటలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘అధికారం పోయిందన్న అసహనంలో ఉన్న కేసీఆర్.. ఏమేమో మాట్లాడుతున్నడు. చివరికి మాజీ ఎంపీ సంతోష్ కూడా ఆయన దగ్గర ఉండకుండా సెలవు పెట్టిండు” అని విమర్శించారు. కేటీఆర్ మాటలను కూడా తాను పట్టించుకోనని సీఎం స్పష్టం చేశారు. ‘‘కేటీఆర్​.. మేనేజ్​మెంట్ కోటా నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన పిల్లాడు’’ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్​ చేసిపోయిన ఏడు లక్షల కోట్ల అప్పుతో తాము ప్రభుత్వాన్ని మొదలుపెట్టామని ఆయన అన్నారు.