ఏ కాలం ఎప్పుడో తెల్వదా.. వానాకాలంలో సీఎంగా ఉన్నదే నువ్వు.. మా వల్ల కరువొచ్చిందంటవా? : సీఎం రేవంత్​రెడ్డి

ఏ కాలం ఎప్పుడో తెల్వదా.. వానాకాలంలో సీఎంగా ఉన్నదే నువ్వు.. మా వల్ల కరువొచ్చిందంటవా? : సీఎం రేవంత్​రెడ్డి
  • 80 వేల పుస్తకాలు చదివిన మేధావితనం ఇదేనా?: కేసీఆర్​పై సీఎం రేవంత్​ ఫైర్​
  • కేసీఆర్ పాపాలకు వానాకాలంల వరుణుడు కూడా భయపడ్డడు
  • పదేండ్ల తర్వాతైనా ఆయన ఫామ్​హౌస్​ దాటినందుకు సంతోషం
  • కరువుతోపాటు రూ.7 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయిండు
  • కేసీఆర్​ రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటోడు
  • దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి టక్కు టమారా విద్యలు ప్రదర్శిస్తున్నడు
  • నాడు మా పర్యటనలు అడ్డుకుంటే.. నేడు కేసీఆర్​ టూర్​కు భద్రత ఇచ్చినం
  • మందుకల్లు తాగినట్లు కేటీఆర్​ మాట్లాడుతున్నారని విమర్శ
  • ఈ నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్​ సభ.. అక్కడే మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్​, వెలుగు: వానాకాలంలో అధికారంలో ఉన్నది కేసీఆరేనని, అప్పుడు వర్షాలు పడకపోవడంతోనే ఇప్పుడు కరువు పరిస్థితులు వచ్చాయని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. కేసీఆర్​ చేసిన పాపాలకు అప్పుడు వరుణ దేవుడు కూడా భయపడి పారిపోయాడని వ్యాఖ్యానించారు. ‘‘మీ పాలనలో 2023లో  వానాకాలంలో వానలు పడకపోవడంతోనే ఈ ఏడాది కరువు పరిస్థితులు వచ్చినయ్​.

మేం అధికారంలోకి వచ్చింది చలికాలంలో. 80 వేల పుస్తకాలు చదివిన మేధావికి ఏ కాలం ఎప్పుడొస్తదో తెలుస్తలేదు’’ అని విమర్శించారు. కాంగ్రెస్​తో కరువు వచ్చిందంటూ కేసీఆర్​ చేసిన కామెంట్లకు సీఎం రేవంత్​ కౌంటర్​ ఇచ్చారు. కరువుతోపాటు రూ. 7లక్షల కోట్ల అప్పును వారసత్వంగా కేసీఆర్​ ఇచ్చిపోయారని మండిపడ్డారు. పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో వందేండ్ల విధ్వంసం జరిగిందని అన్నారు.

‘‘నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని ప్రయత్నించడమేంది? ఏరా.. రాము.. వానాకాలం ఎప్పుడు అంటే.. చలికాలంలో వస్తదని ఎన్కటికి ఎవడో బడిలో అన్నడట. కేసీఆర్​ తీరు అట్లనే ఉన్నది. మేం వచ్చింది ఎప్పుడు.. వానలు రాకపాయె ఎప్పుడు.. కరువు ఎప్పుడు తెస్తిమి. నువ్వు(కేసీఆర్​) చేసిన ఖర్మ మాకు తగులుకున్నది. నువ్వుచేసిన పాపాలు నీ పిల్లలకు తగిలి ఎట్ల జైలుకు పోతున్నరో.. ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి నువ్వు చేసిన అన్యాయం, పాపాల వల్ల  2023 వానాకాలంలో వానలు పడక 2024లో కరువు పరిస్థితులు వచ్చినయ్​” అని ఆయన అన్నారు.

ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్​ జన జాతర సభ ఏర్పాట్లను మంగళవారం మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి సీఎం రేవంత్​రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి, ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులు పారిపోతుంటే దాన్ని అధిగమించడానికి తనకు తెలిసిన టక్కుఠమారా విద్యలన్ని కేసీఆర్​ ప్రదర్శించాలని చూస్తున్నారని, వాటికి కాలం చెల్లిందన్నారు.

తమ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమాన్ని చూసి, ఆడబిడ్డల కండ్లలో ఆనందాన్ని చూసి ఓర్వలేక మాజీ సీఎం కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ఆయన విమర్శించారు. ‘‘నువ్వు కండ్లల్ల నిప్పులు పోసుకున్నా.. నీ కడుపులో మంటలు చెలరేగినా ప్రజలు మాత్రం నీపై సానుభూతి చూపరు. ఎందుకంటే నువ్వు చేయని పాపమంటూ లేదు. పాపాలభైరవుడు అనే పదం కూడా నీకు చిన్నది. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు” అని కేసీఆర్​కు హెచ్చరించారు. కేసీఆర్​ అనే వ్యక్తి రద్దయిపోయిన వెయ్యిరూపాయల నోటు లాంటివారని, వెయ్యి రూపాయల నోటును ఎవరు జేబులో పెట్టుకున్నా జైలు కు పోతారని, కేసీఆర్​ పరిస్థితి అదీ అని విమర్శించారు. 

ఇప్పటికైనా నీకు రైతులు గుర్తొచ్చినందుకు సంతోషం

అధికారంలో ఉన్నప్పుడు  రైతుల ముఖం చూడని, ఫామ్​హౌస్​ దాటని కేసీఆర్​కు పదేండ్ల తర్వాతైనా ఇప్పుడు రైతులు గుర్తొచ్చినందుకు, పొలంబాట పట్టినందుకు సంతోషమని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. పొగ పెట్టగానే కలుగులోంచి ఎలుకలు బయటకు వచ్చినట్లు.. ఎన్నికలు అనే పొగ పెట్టడంతో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారని, కేసీఆర్ పర్యటన చూస్తుంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుందని ఎద్దేవా చేశారు. ‘‘కేసీఆర్​కు అధికారం పోయినందుకు, కిందపడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు సాటి మానవుడిగా మాకు కొంత సానుభూతి ఉంటది.

కానీ, ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపనీయం. కాంగ్రెస్​ వచ్చింది.. కరువొచ్చిందని అంటున్నడు. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్​కు వానాకాలం ఎప్పుడొస్తది, చలికాలం ఎప్పుడొస్తదో కూడా తెలియకుండా పోయిందా?” అని విమర్శించారు. ‘‘జులై నుంచి అక్టోబర్ వరకు వానాకాలం, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలికాలం. మరి కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? చలికాలంలో డిసెంబర్ 7 న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

మరి చలికాలంలో వానలు పడుతాయా? మొన్న వానాకాలంలో అధికారంలో ఉన్నది కేసీఆరే కదా? అప్పుడు వర్షాలు పడకపోతే మేము తెచ్చిన కరువు అవుతుందా? తమరి(కేసీఆర్​) పాపాలకే కదా వరుణ దేవుడు భయపడిపోయి వానలు కురువక కరువొచ్చింది. మీ వారసత్వంగా కరువుతో పాటు రూ. 7 లక్షల కోట్ల  అప్పులు కూడా మాకు అప్పజెప్తే.. రోజుకు 18 నుంచి 20 గంటలు కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నం” అని అన్నారు. 

రైతుబంధు పైసలు పదిరోజుల్లో ఎప్పుడేసినవ్​?

వందరోజులకే మీరు అది చేయలేదు ఇది చేయలేదని తమను కేసీఆర్​ అంటున్నారని, పదేండ్లలో ఆయన చేసింది ఏమిటని సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ‘‘పదిరోజుల్లోనే రైతుబంధు డబ్బులు జమజేసినట్లు కేసీఆర్​ చెప్పుకుంటున్నడు. వాళ్ల పాలనలో డిసెంబర్​లో మొదలు పెట్టి సెప్టెంబర్​ వరకు పదినెలల వరకు రైతుబంధు పైసలను రైతుల ఖాతాల్లో వేస్తూ వచ్చిన్రు. అసెంబ్లీలోనే ఈలెక్కలన్నీ బయటపెడితే కేసీఆర్​ సభకు రాకుండా పారిపోయిండు. 2018 ఎన్నికలప్పుడు తప్ప రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడానికి నాలుగు నెలల నుంచి పదినెలలు టైమ్​తీసుకున్నడు.

ఆయన ఇప్పుడు మా గురించి మాట్లాడుతున్నడు. కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా...మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 64 లక్షల 75 వేల 581 మంది రైతు ఖాతాల్లో రైతు బంధు వేసినం. ఇంకా 4 లక్షల మంది రైతులకు రైతు బంధు వేయాల్సి ఉంది.   ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన వారికీ వేస్తం. మొత్తం రైతు బంధు ఖాతాలు 69 లక్షలు ఉన్నయ్​. ఈ లెక్కలు తప్పు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా సిద్ధమే” అని తేల్చిచెప్పారు. తాము చెప్పిన లెక్కలు వాస్తవమైతే తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

నువ్వు మమ్మల్ని అడ్డుకుంటే.. నీకు ఇప్పుడు భద్రత ఇచ్చింది మేమే

‘‘పదేండ్లు మేం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నిరుద్యోగ సమస్యలపై, ఇతర సమస్యలపై ఆందోళనలకు పిలుపునిస్తే..మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లనియ్యకుండా అడ్డుకున్నది నువ్వు. ఇప్పుడు నువ్వు కరువు యాత్ర అని బయలుదేరితే.. ప్రతిపక్ష నేతగా నీకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మా ప్రభుత్వం దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి మమ్మల్ని అభినందించాల్సిందిపోయి.. మా ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేయడం సిగ్గుచేటు. మేం తలుచుకుంటే నువ్వు కాలు బయటపెట్టెటోడివా?” అని కేసీఆర్​కు సీఎం రేవంత్​రెడ్డి చురకలంటించారు.

కేసీఆర్ పర్యటించిన రోజున సూర్యాపేటలో 30 సెకన్లు కూడా కరెంటు పోలేదని, కానీ.. కరెంట్​ పోయినట్లు ఆయన డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ‘‘అక్కడ ప్రెస్ మీట్ లో కేసీఆర్ మైక్ జనరేటర్ కు కనెక్ట్ అయి ఉంది. నీ(కేసీఆర్​) జనరేటర్ లో ఎవడు పుల్ల పెట్టిండో ఎవరికి తెలుసు. దానికి కరెంట్​ పోయిందని బద్నాం చేస్తవా” అని అన్నారు. ‘‘ప్రతివారం నువ్వు(కేసీఆర్​) బయటకు వెళ్లాలే.. ప్రజల్లో తిరగాలే.. ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత పోషించు.. నీలెక్క ప్రతిపక్షాల గొంతు మేం నొక్కం. ప్రజా సమస్యలు మీరు తీసుకువస్తే సహేతుకమైనవాటిని పరిష్కరిస్తం” అని అన్నారు. కేటీఆర్ మాటలు చూస్తే ఉర్లలో మందు కల్లుతాగిన వాళ్లలా ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ , కేటీఆర్ వాళ్ల బాస్ మోదీ గెలవాలని కోరుకుంటున్నారని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. 

మీ లెక్క ఫామ్​హౌస్​లో పండుకుంటలే

రాష్ట్రంలోని ఆర్థిక, సహజ వనరులను కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకోవడంతో వంద ఏండ్ల వరకు తెలంగాణ కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్లిందన్నారు. తాగునీటి సమస్యపై కేసీఆర్ బుర్ర లేకుండా వితండ వాదం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ సిటీలో వెయ్యి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తే...అభినందించాల్సింది పోయి ట్యాంకర్ల ద్వార నీటిని సరఫరా చేసుడేందని విమర్శిస్తారా? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ‘‘మీ నిర్వాకం వల్ల మేడిగడ్డ కుంగింది.. అన్నారం పగిలింది...అందులో ఇంక నీరెక్కడిది? ఎత్తిపోసుడెక్కడ?” అని ప్రశ్నించారు.

‘‘రేవంత్ రెడ్డి ఎక్కడ నిద్రపోతున్నావని కేసీఆర్ అంటుండు. అప్పుడు ప్రతిపక్ష నేతగా, ఇప్పుడు సీఎంగా కూడా నా ఇంట్లోనే నిద్రపోతున్న. మీ లెక్క ఫామ్ హౌస్ లోనో.. సినిమా వాళ్ల గెస్ట్ హౌసుల్లోనో పడుకుంటలే” అని ఆయన అన్నారు. ఇక్కడి సీఎం నిత్యం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని కేసీఆర్​ అనడంపై రేవంత్​ మండిపడ్డారు. ‘‘నీ పాపాలను ఒక్కొక్కటిగా కడిగే పనిలో భాగంగానే ఢిల్లీ వెళ్తున్న.

ట్రిపుల్ ఆర్, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, మూసీ నది అభివృద్ధి, పెండింగ్ పనులకు నిధుల విడుదల వంటి వివిధ పనులపై కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్న” అని అన్నారు. విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. రాష్ట్రంలో 7 వేల పైచిలుకు ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేశామని, గత బీఆర్​ఎస్​ సర్కార్​ లెక్క క్వింటాలుకు 10 కిలోల కమీషన్ కొట్టుడు ఉండదని స్పష్టం చేశారు. ‘‘నీ లెక్క కమీషన్ల దందాలు చేయం” అని కేసీఆర్​పై మండిపడ్డారు.

తుక్కుగూడ వేదికగా మేనిఫెస్టో విడుదల

ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ సభా ప్రాంగణంలో తెలంగాణ జనజాతర సభ నిర్వహించనున్నట్లు సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ప్రకటించారు. జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ వేదికగా విడుదల కాబోతున్నదని చెప్పారు. ‘‘తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకం. తెలంగాణకు సోనియమ్మ కుటుంబం మరీ ప్రత్యేకం. అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 సెప్టెంబర్ 17న ఆరు గ్యారంటీలను సోనియమ్మ విడుదల చేశారు. సోనియమ్మపై అభిమానంతో ప్రజలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఆరు గ్యారంటీలను మా ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది.. మిగతా హామీలను ఎన్నికల కోడ్ తరువాత వందశాతం అమలు చేస్తం. జాతీయ కార్యాచరణను ఇక్కడి నుంచే పిలుపునివ్వడం అంటే మా కార్యకర్తల కష్టాన్ని అధిష్టానం గుర్తించినట్లు. అందుకే ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు రాష్ట్రం నలుమూలల నుంచి జనజాతర సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలి. ముఖ్యంగా ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో సభకు తరలి వచ్చి ఆశీర్వదించాలి” అని ఆయన కోరారు. ఇండియా కూటమికి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన మెజార్టీ సీట్లు రావడం ఖాయమని, జూన్ 4 న ఫలితాలు, జూన్ 9 న ఎర్రకోటపై మూడు రంగుల జెండాను ఇండియా కూటమి ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అందరూ రావాలని అన్నారు. 

సభకు తరలిరావాలి:మంత్రి శ్రీధర్ బాబు

అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడ వేదికగానే కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ ద్వారా ఆరు గ్యారంటీలను ప్రకటించామని, అవి విజయవంతంగా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఇదే వేదికగా ఈ నెల 6న ఏఐసీసీ జాతీయ స్థాయి మేనిఫెస్టోను విడుదల చేయబోతు న్నామని తెలిపారు. దీనికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్​గాంధీ హాజరవుతారని, దీన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని ఆయన కోరారు.