- దేవా, కంకణాల రాజిరెడ్డి సహా 20 మంది లొంగుబాటు
- 48 ఆయుధాలు, రూ.20 లక్షలు అప్పగింత
- రాష్ట్రంలో ఇంత భారీగా ఆయుధాల సరెండర్ ఇదే మొదటిసారి
- తెలంగాణ కేడర్‌లో మిగిలింది 17 మందేనని డీజీపీ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మావోయిస్టు పార్టీ పతనం అంచున ఉందని, అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులంతా వెంటనే లొంగిపోవాలని డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. మడావి హిడ్మా అనుచరుడు పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ బెటాలియన్ కమాండ్ బడ్సె సుక్క అలియాస్ దేవా, దర్శన్(49), తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్(50) ఆయన భార్య అడ్లూరి ఈశ్వరి అలియాస్ రంకో(49) సహా మొత్తం 20 మంది మావోయిస్టులు శనివారం డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. 2 అత్యాధునిక లైట్ మెషిన్ గన్స్, యూఎస్ఏలో తయారైన కోల్ట్ రైఫిల్, ఇజ్రాయెల్ లో తయారైన టవర్ రైఫిల్, ఎనిమిది ఏకే 47 గన్స్,10 ఇన్సాస్ గన్స్ సహా మొత్తం 48 ఆయుధాలు పోలీసులకు అప్పగించారు.
వీటితో పాటు నాలుగు బ్యారెల్ గ్రనైడ్ లాంచర్లతో పాటు హెలికాప్టర్ లను కూల్చే 19 షాట్స్, 2,206 లైవ్ రౌండ్స్, రూ.20.30 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్‌కుమార్, ఐఎస్‌బీ చీఫ్ సుమతితో కలిసి మీడియా సమావేశంలో డీజీపీ వివరాలను వెల్లడించారు.
‘‘మావోయిస్టు పార్టీ పతనం అంచుకు చేరింది. ఇప్పటికే 576 మంది లొంగిపోయారు. తెలంగాణకు చెందిన వారు మరో 52 మంది ఉన్నారని అనుకున్నాం. కానీ 17 మందే మిగిలి ఉన్నారని గుర్తించాం. అలాగే హిడ్మా నాయకత్వంలోని పీఎల్‌జీఏ బెటాలియన్‌లో 400 మంది ఉండగా.. 66 మంది మాత్రమే మిగిలారు” అని డీజీపీ వెల్లడించారు.
స్టేట్ కమిటీలో బడే చొక్కారావు ఒక్కరే..
కంకణాల రాజిరెడ్డితో పాటు ఆయన భార్య ఏపీ విశాఖపట్నం అరిలోవకు చెందిన అడ్లూరి ఈశ్వరి అలియాస్ రంకో ప్రస్తుతం తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్లుగా ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హనుమకొండ హసన్‌పర్తి మండలం మునిపల్లికి చెందిన దార సారయ్య(49) అర్బన్ పార్టీ మెంబర్‌గా ఉన్నారన్నారు. ఈ ముగ్గురి లొంగుబాటుతో తెలంగాణ కేడర్ పతనం అంచున చేరిందన్నారు.
‘‘ప్రస్తుతం బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఒక్కరే స్టేట్ కమిటీలో ఉన్నారు. దామోదర్‌తో పాటు తిప్పిరి తిరుపతి సహా అజ్ఞాతంలో ఉన్న 17 మంది లొంగిపోవాలని సూచిస్తున్నాం. దేవాపై రూ.75 లక్షల రివార్డ్ ఉంది. లొంగిపోయిన డివిజన్ సభ్యులకు రూ. 5 లక్షలు, ఏరియా సభ్యులకు రూ. 4 లక్షలు, మిగతా సభ్యులకు రూ. లక్ష అందిస్తున్నాం. ప్రస్తుతం లొంగిపోయిన 20 మందికి మొత్తంగా రూ.1.81 కోట్ల రివార్డు అందిస్తాం. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున డీడీలు ఇస్తున్నాం. కేంద్ర కమిటీలో మిగిలిన నలుగురు కూడా లొంగిపోవాలని కోరుతున్నాం” అని డీజీపీ సూచించారు.
రాజిరెడ్డి.. కొరియర్ నెట్‌వర్క్, గెరిల్లా స్థావరాలు
పెద్దపల్లి జిల్లా కల్వ శ్రీరాంపుర్ మండలం కిష్టంపేటకు చెందిన కంకణాల రాజి రెడ్డి అలియాస్ వెంటేష్(50) 1997లో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరారు. 2010లో డివిజనల్ కమిటీ మెంబర్‌గా డిసెంబర్ -2019లో స్టేట్‌కమిటీ మెంబర్‌గా పదోన్నతి పొందారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కొరియర్ నెట్‌వర్క్‌ను నిర్మించారు. మావోయిస్టు అనుబంధ సంస్థలను యాక్టివ్ చేశారు.
కర్రిగుట్టల్లో గెరిల్లా స్థావరాన్ని స్థాపించడంలో రాజిరెడ్డి కీలక పాత్ర పోషించారు. పేలుడు పదార్థాల డంపులు ఏర్పాటు చేసే వారు. ప్రస్తుతం స్టేట్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్ ఆయుధాలతో లొంగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు, అనారోగ్య పరిస్థితుల కారణంగా లొంగిపోయాననితెలిపారు.
కర్రిగుట్టలకు బడ్సే దేవా కాపలా
చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా పువ్వర్తికి చెందిన బడ్సే సుక్క అలియాస్ దేవా.. మడావి హిడ్మా స్నేహితుడు. హిడ్మా ప్రేరణతో 2003లో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరారు. 2023 నవంబర్‌లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కమాండర్‌గా బాధ్యతతలు చేపట్టారు.
గెరిల్లా ఆపరేషన్‌లో వ్యూహకర్తగా భద్రతా దళాలను నిర్మూలించడంలో క్రూరంగా వ్యవహరించేవారు. జెరామ్ ఘాటి వంటి అనేక ఆకస్మిక దాడులు చేశారు. ఇందులో మంత్రి మహేంద్ర కర్మ సహా ఇతర కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మరణించారు. 2024లో దక్షిణ బస్తర్‌లో భారీ పోలీసు ఆపరేషన్ కారణంగా, దేవోజీ, హిడుమా, చంద్రన్న, దామోదర్ సహా ఇతర దళాలు కర్రెగుట్టలకు క్యాంపు మార్చారు. ఇందుకు సంబంధించిన సెక్యూరిటీ, పేలుడు పదార్థాల సరఫరా కోసం దేవాను కర్రెగుట్టల ఇంచార్జీగా నియమించారు. దేవా, తన సైనిక నైపుణ్యం, వ్యూహాలతో కర్రెగుట్టల్లో పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీని తిరిగి పటిష్టం చేశారు.
