ప్రజా దర్బార్..​ సామాన్యుడి కోసం తెరుచుకున్న ప్రజా భవన్ గేట్లు

ప్రజా దర్బార్..​ సామాన్యుడి కోసం తెరుచుకున్న ప్రజా భవన్ గేట్లు
  • తొలి రోజే 2 వేల మందికి పైగా రాక
  • దివ్యాంగులు, నిరుద్యోగులు, ధరణి బాధితులు, 
  • ప్రాజెక్టుల నిర్వాసితులే ఎక్కువ
  • స్వయంగా అప్లికేషన్లు స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి
  • అర్జీదారుల కోసం హెల్ప్ డెస్క్.. గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్లకు 15 డెస్కులు
  • దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి హెల్త్ చెకప్స్
  • ప్రజా దర్బార్‌‌‌‌కు రోజుకో ఎమ్మెల్యే హాజరయ్యేలా ప్లాన్
  • ప్రతి ఫిర్యాదును పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగం

హైదరాబాద్, వెలుగు: ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ‘ప్రజా దర్బార్‌‌’‌‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం ప్రజా భవన్‌‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వినతిపత్రాలను పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వచ్చిన దాదాపు పదేండ్లకు స్వయంగా సీఎం తమ గోడు వింటానని చెప్పడంతో.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు పోటెత్తారు.

మొదటి రోజే 2 వేల మందికి పైగా వచ్చారు. ఇన్నాళ్లూ తమ బాధ వినేందుకు ప్రభుత్వం నుంచి ఎవరూ ముందుకు రాలేదని.. ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టి తమతో మాట్లాడుతున్నారని జనం సంతోషం వ్యక్తం చేశారు. ‘‘సమస్య పరిష్కారం అయితదో లేదో తెల్వదు. కానీ ఇక్కడికి వచ్చి సీఎంతో నా సమస్య చెప్పుకున్నందుకు బీపీ, షుగర్​ పోయినట్టయింది. పాణం నిమ్మలమైంది”అని ఓ పెద్దాయన మీడియాతో అన్నాడు.

ఉదయం ఏడు గంటలకే క్యూ

ఇప్పటి వరకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని దూరం నుంచి చూడడమే తప్ప సామాన్యులు లోనికి వెళ్లిన దాఖలాలు లేవు. కేవలం అనుమతించిన వారినే లోపలికి పంపేవారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌‌ను జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌‌గా మారుస్తున్నామని, శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తామని తన ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 


ఈ నేపథ్యంలో ఏండ్ల నుంచి పరిష్కారం కాని సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చేందుకు జనం పోటీ పడ్డారు. ఉదయం 7 గంటల నుంచే క్యూ కట్టారు. సుమారు గంటపాటు ముఖ్యమంత్రి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తర్వాత కరెంట్‌పై రివ్యూ కోసం సీఎం సెక్రటేరియెట్‌కు వెళ్లడం, అప్పటికీ వందల మంది క్యూలో ఉండటంతో మంత్రి సీతక్క మిగతా వినతిపత్రాలను తీసుకున్నారు.

సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్​ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, జలమండలి ఎండీ దానకిశోర్, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తదితరులు ప్రజాదర్బార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దివ్యాంగులు, నిరుద్యోగులు, ధరణి బాధితులు, వివిధ ప్రాజెక్టుల నిర్వాసితులు ఎక్కువగా వచ్చారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సీఎంలు ఉదయం పూట నేరుగా ప్రజలను కలుస్తుండేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇది విజయవంతంగా నడిచింది. ఇప్పుడు రేవంత్ కూడా అదే ఫాలో అవుతున్నారు.

జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు

క్యాంపు కార్యాలయం ఆవరణలో అర్జీదారుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అర్జీ పెట్టుకునేందుకు అవసరమైన తెల్ల కాగితాలు, పెన్నులు, కూర్చునేందుకు కుర్చీలు, తాగేందుకు నీళ్లు, వికలాంగులు, వృద్ధుల కోసం వీల్​చైర్లు ఏర్పాటు చేశారు. నడవ లేని వారిని సహాయకులు తీసుకెళ్లారు. అర్జీదారుల నుంచి తీసుకున్న దరఖాస్తులకు తొలుత రసీదులు ఇచ్చారు.

తర్వాత ఫోన్ నంబర్లకు మెసేజ్‌లు పంపిస్తామని అక్కడి సిబ్బంది తెలిపారు. ప్రజాదర్బార్‌‌లో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించారు. గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్లకు 15 డెస్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రజాదర్బార్ లోపల జనం కూర్చోడానికి 320 సీట్లను ఏర్పాటు చేశారు. బయట కూడా క్యూలైన్లు పెట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టెస్టులు చేశారు. బీపీ చెక్ చేసి గోళీలు ఇచ్చారు. మరికొందరికి పల్స్ చెక్​చేసి చికిత్సకు అవసరమైన సలహాలు ఇచ్చారు.

ప్రతి జిల్లాకు ఒక టీమ్‌

ప్రజాదర్బార్​ను కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి.. జిల్లాకు ఒక టీమ్‌ చొప్పున ఏర్పాటు చేయనున్నారు. వచ్చిన ఫిర్యాదులు, వినతి పత్రాల పర్యవేక్షణకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తున్నారు. ప్రజా దర్బార్‌‌కి రోజుకు ఒక ఎమ్మెల్యే హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

ధరణి బాధితులే ఎక్కువ

ప్రజాదర్బార్‌కు వచ్చిన వారిలో ధరణి బాధితులే ఎక్కువగా ఉండడం గమనార్హం. ధరణి పోర్టల్‌తో తమ భూములు తమకు దక్కకుండా పోయాయని, తమ పేరిట ఉన్న భూములను వేరేవారి పేరిట ఎక్కించారని, ధరణిలో తమ పేరు రావడం లేదని, గతంలో అమ్మినవారి పేర్లు ధరణిలో వస్తున్నాయని పలువురు వాపోయారు.
మల్లన్నసాగర్ బాధితులు కూడా ఎక్కువగానే వచ్చారు.

బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తమ భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ముంపు కింద ప్రభుత్వానికి అప్పగించి ఎక్కువ మొత్తంలో పరిహారం పొందారని కొందరు చెప్పారు. తమకు పరిహారం ఇవ్వలేదని మరికొందరు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్‌ భూములు, ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూములు ప్రభుత్వం లాక్కుందని కొందరు ఫిర్యాదు చేశారు.


గత ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదని, ఇచ్చిన నోటిఫకేషన్లు పేపర్‌ లీకేజీలతో రద్దయ్యాయని, నిర్వహించిన పరీక్షల ఫలితాలు రావడం లేదని సీఎం రేవంత్‌కు నిరుద్యోగులు విన్నవించారు.

తమకు ఏండ్లుగా పింఛన్‌ రావడం లేదని, ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. 
డబుల్‌ బెడ్రూం ఇండ్ల మంజూరులో అవకతవకలు జరిగాయని, అనర్హులకు కేటాయించారని, బీఆర్‌ఎస్‌ నేతలకే ఇండ్లు మంజూరు చేసుకున్నారని కొందరు ఫిర్యాదు చేశారు. తమకు అర్హత ఉన్నా ఇవ్వలేదని ఇంకొందరు, ఇల్లు ఇప్పిస్తామని బీఆర్‌ఎస్‌ నాయకులు డబ్బులు వసూలు చేసి మోసం చేశారని మరికొందరు తెలిపారు.

సమయానికి స్కాలర్​షిప్​లు రిలీజ్ చేయకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు తమతో ఫీజులు కట్టించుకుంటున్నాయని కొందరు విద్యార్థులు సీఎంకు ఫిర్యాదు చేశారు. ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేస్తే తమకు ఇబ్బంది ఉండదని విజ్ఞప్తి చేశారు.

ఈయన పేరు రామ్​నాయక్​. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి సొంతూరు. మోడల్ స్కూల్ టీచర్​గా బాన్సువాడలో పని చేస్తున్నారు. దాదాపు ఏడేండ్ల నుంచి ఎలాంటి ట్రాన్స్​ఫర్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారానికోసారి సొంతూరుకు వెళ్లి వస్తున్నానని చెప్పారు. ముగ్గురు పిల్లలు, కనీసం నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని చూసుకోలేకపోతున్నానని వాపోయారు.

మోడల్ స్కూల్ టీచర్లకు ట్రాన్స్​ఫర్లు లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2012లోనే ఎగ్జామ్స్​ రాసినా.. 2016లో రిక్రూట్ చేశారని, ఆ నాలుగేండ్ల కాలాన్ని సర్వీసులో కలపాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మోడల్ స్కూల్ టీచర్ల ట్రాన్స్​ఫర్లు చేపట్టాలంటూ విజ్ఞప్తి చేసేందుకు ప్రజా దర్బార్‌‌కు వచ్చారు.

ఇతడి పేరు సుధాకర్.. మెదక్ జిల్లా కొంతాల్​పూర్ గ్రామం. అక్కడ వారికున్న ఎకరం 37 గుంటల భూమిని ఓ నేత కబ్జా పెట్టారని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. హైదరాబాద్‌కు జీవనోపాధి కోసం వస్తే.. ధరణి పోర్టల్​తో బీఆర్ఎస్ నేతలు తమ భూమిని కాజేశారని వాపోయాడు. అడిగితే ఎక్కడో అడవిలో తమ భూమి ఉందంటూ చూపిస్తున్నారని చెప్పాడు. అడవిలోకి వెళ్తే ఫారెస్ట్ ఆఫీసర్లు కేసు పెడతామంటున్నారని చెప్పాడు. 2019 నుంచి కలెక్టర్లకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ వాపోయాడు. ఇకనైన తమకు న్యాయం చేయాలని అడిగేందుకు సుధాకర్ వచ్చాడు.

కిడ్నాప్ చేసి భూమి రాయించుకున్నరు

పదేండ్లుగా మా కుటుంబాన్ని బీఆర్‌‌ఎస్ లీడర్లు వేధిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు మా ఇంట్లోనే కిరాయి ఉండి, మా భూములను కబ్జా చేశారు. స్కూల్‌లో నుంచి నన్ను కిడ్నాప్ చేసి, చంపుతమని బెదిరించి స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్‌’ ఆప్షన్ కింద రూ.6 కోట్ల విలువైన భూమి రాయించుకున్నరు.

నెల రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. బీఆర్‌‌ఎస్ లీడర్లు, కౌన్సిలర్లతో పోలీసులు కుమ్మక్కయ్యారు. సీఐ నన్ను చెప్పుతో కొట్టిండు. స్టేషన్‌లో నిర్బంధించి వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద కూడా సంతకాలు పెట్టించుకున్నరు. మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసినం. కానీ ఎక్కడా న్యాయం జరగలేదు. మా బాధను సీఎం సార్‌‌తో చెప్పుకుని, న్యాయం చేయమని అడగడానికి వచ్చినం.
- నర్సారెడ్డి, గవర్నమెంట్ టీచర్‌, పరకాల, వరంగల్ జిల్లా

మా డెత్ సర్టిఫికెట్లు సృష్టించి.. భూమి కబ్జా

మేము చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్లు సృష్టించి, మా భూమిని కబ్జా చేసిన్రు. గోపాల్‌రావు అని ఓ ఎమ్మార్వో, కేసీఆర్ అనుచరులు కలిసి ఈ పని చేసిన్రు. పదేండ్ల సంది కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. కేసీఆర్‌‌ను కూడా కలిసేందుకు ప్రయత్నించినం. కానీ ఆయన కలవలేదు. ఇప్పుడు సీఎం రేవంత్‌ సారుకు మా సమస్య చెప్పుకుని పత్రం ఇచ్చినం. మా భూమి మాకు ఇస్తరని ఆశిస్తున్నం.  

 -అప్పిరెడ్డి నర్సిరెడ్డి, పల్లెగూడెం, బీబీనగర్ మండలం

ఈయన పేరు డి.తిరుపతి. జీడిమెట్ల సూరారంలో ఉంటున్నారు. ఒక కాలు లేదు. వినపడదు. నాలుగేండ్లుగా దివ్యాంగుల పింఛన్ కోసం ప్రయత్నిస్తున్నా.. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్ని సార్లు అధికారుల చుట్టూ తిరిగినా.. ఏదో ఒకటి రాసి పంపారే తప్ప పింఛన్ మాత్రం మంజూరు చేయలేదు. శుక్రవారం ఉదయం ప్రజాభవన్​లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన గోడు వినిపించాలని కుటుంబంతో వచ్చారు. తమకు పింఛను మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు. తమకు ఏ ఆధారమూ లేదని, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని అతడి భార్య వాపోయింది.

పెన్షన్ ఇప్పించండి

నాకు చూపులేదు. పెన్షన్ కోసం గత ప్రభుత్వంలో ఎన్నో దరఖాస్తులు చేసిన. ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకే కొత్త ముఖ్యమంత్రికి చెప్పుకుందామని వచ్చిన.
- రాఘవేంద్ర, ఎల్బీనగర్

రేషన్ కోసం

హైదరాబాద్‌లోని బాలాజీనగర్‌‌లో ఉంటాను. 2016లో నా రేషన్​కార్డు తీసేశారు. వికలాంగుల కోటాలో పెన్షన్ వస్తున్నది. లేచి తిరగలేను. వీల్​చైర్లోనే రావాలి. పదేండ్లుగా రేషన్​కార్డు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా. కొత్త సీఎం రేషన్​ కార్డు ఇస్తారని వచ్చా. మేం ఉండేందుకు ఇళ్లు కూడా లేదు.
- అప్పారావు

నాటి సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న లక్ష్మాపూర్ గ్రామం మాది. మా ఊరులోనే ధరణి పోర్టల్ లాంచ్ చేశారు. నాకు ఆరున్నర ఎకరాల భూమి ఉంది. ఇందులో 4 ఎకరాలు అసైన్డ్‌, మిగిలింది పట్టా భూమి. కానీ ధరణిలో మొత్తం భూమినంతా అసైన్డ్‌ కింద రాశారు. మాకు రైతు బంధు వస్తలేదు. మా భూమి మాకు పట్టా చేయాలని కోరడానికి వచ్చాం.
- ఓ రైతు

మా ఊరికి రోడ్డు లేదు

పది ఏండ్ల నుంచి మా ఊరికి రోడ్డు వేయించలేదు. రోడ్డు కోసం సారుకు రిప్రజెంటేషన్ ఇచ్చాం. అలాగే సాగు నీటి కాలువ కోసం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం.
- మహేందర్‌‌, కబురాయిపల్లి గ్రామం, భువనగిరి

84 మంది ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకురండి

తెలంగాణ స్థానికత ఉన్నా ఏపీలో పనిచేస్తున్న 84 మంది ఉద్యోగులను స్వరాష్ర్టానికి తీసుకురావాలని మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసినం. తెలంగాణ స్థానికత ఉన్నా ఏపీకి బదిలీ చేయటంతో తొమ్మిదిన్నర ఏండ్ల నుంచి ఏపీలో పనిచేస్తున్నం. మమ్మల్ని రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. జాయిన్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వమూ అంగీకరించింది. అయినా ఫైల్ ముందుకు కదలటం లేదు. మా కేటగిరీలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు ఈ సమస్య పరిష్కారం కాకముందే కరోనా టైమ్‌లో చనిపోయారు.
- ఉద్యోగులు ఖాజామొహినుద్దీన్, ఆంజనేయులు , రజనీ, ఆశలత

ప్రజా దర్బార్‌‌లో ఆర్టీసీ యూనియన్‌ నేతలు
తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రజా దర్బార్‌‌లో మంత్రి సీతక్కను కలిసి యూనియన్ నేతలు వినతిపత్రం అందజేశారు. రెండు పీఆర్సీలు, డీఏ బకాయిలు, సీసీఎస్ బకాయిలు, పీఎఫ్ ఫండ్స్ రిలీజ్ చేయాలని నేతలు రాజిరెడ్డి, గోపాల్, సాయిరెడ్డి కోరారు. 10 ఏండ్ల బీఆర్‌‌ఎస్ పాలనలో మోసపోయిన వారిలో ఆర్టీసీ కార్మికులు ముందు వరుసలో ఉన్నారని రాజిరెడ్డి పేర్కొన్నారు.

ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగుల జీతాలు పెరగడం లేదని, ఆర్టీసీ విలీన సమస్యలు పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారని, సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు రాజిరెడ్డి తెలిపారు.

దాదాపు వంద మంది దాకా జెన్‌కో పరీక్షల అభ్యర్థులు ప్రజాభవన్​కు వచ్చారు. డిసెంబర్ 17న పరీక్ష ఉందని, అదే రోజున కొన్ని కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు ఉన్నాయని, పరీక్షను వాయిదా వేయాలని కోరారు. ఎలక్ట్రికల్ సిలబస్​లో మెకానికల్, ఈసీఈ సబ్జెక్టులు పెట్టారని వాపోయారు.

అన్ని జోన్లకు కలిపి కేవలం 145 పోస్టులనే భర్తీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క హైదరాబాద్​లోనే దాదాపు 100 పోస్టులున్నాయంటున్నారు. కాబట్టి డిసెంబర్​ 17 నాటి పరీక్షను వాయిదా వేయాలని, పోస్టులను పెంచాలని, తమవి కాని సబ్జెక్టులను పరీక్షల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఇప్పుడు ఇనుప కంచె లేదు.. అడ్డుగోడలు లేవు.. సామాన్యుల కోసం తలుపులు తెరుచుకున్నాయి. జనం సమస్యలను నేరుగా ముఖ్యమంత్రే వింటున్నరు!

దసరా, దీపావళి కన్నా సంబురంగా ఉంది

నేను మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాపూర్ నుంచి వచ్చిన. మా పొలంలో ట్రాన్స్ ఫార్మర్ పేలి నా రెండు చేతులు, కాళ్లు పోయినయ్. నా కష్టం చెప్పుకోనికే ప్రజాదర్బార్ కు వచ్చిన. సీఎం రేవంత్ రెడ్డి మంచిగ పలకరించిండు. మాట్లాడిండు. నీకు నేనున్నా.. నువ్వు అధైర్యపడకని చెప్పిండు. సీఎంను కలవడం దసరా, దీపావళి 
కన్నా ఎక్కువ సంబురంగా ఉంది. 
-  నారాయణరెడ్డి

వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది 

స్కాలర్‌‌‌‌షిప్​లు, ఫీజు రీయింబర్స్​మెంట్ రాకపోవడంతో రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. మేనేజ్‌‌మెంట్లు స్టూడెంట్లతోనే ఫీజులు కట్టించుకుంటున్నాయి. అలా అయితేనే సర్టిఫికెట్లు ఇస్తామని, పరీక్షలు రాయనిస్తామని చెబుతున్నాయి. ఒక్కొక్కరి ఫీజులు వేలల్లో ఉన్నాయి. సీఎం రేవంత్​ను కలిసి స్కాలర్‌‌‌‌షిప్​ల సమస్య వివరించాను. సార్ శ్రద్ధగా విన్నారు. బకాయిలు విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. నేరుగా సీఎం సమస్య వినడం.. వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. ప్రజా దర్బార్‌‌‌‌ను ఇలాగే కొనసాగించాలి.
- హేమగౌరి, దుర్గాబాయి దేశ్​ముఖ్ 
కాలేజీ, ఫిజియోథెరపీ ఫైనల్ ఇయర్

భూమికి పట్టా కోసం

మా భూమికి పట్టాలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ఫిర్యాదు ఇచ్చిన. పట్టా ఇప్పిస్తామని అన్నరు.
- బాలమ్మ, కాశింనగర్, వనపర్తి

ఇల్లు కావాలె

నాకు భూమి లేదు. ఇల్లు లేదు. బతకడానికి ఆధారమేమీ లేదు. డబుల్ బెడ్రూం ఇల్లు కోసం ఎండ్ల నుంచి ఎదురు చూసినా కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా ఇల్లు వస్తదేమోనన్న ఆశతో ఇక్కడికి వచ్చాను. సీఎం రేవంత్‌‌ సారుకు వినతిపత్రం ఇచ్చిన.
- బి.రాము, హిమాయత్​నగర్, మొయినాబాద్