మానవతా పరిమళం రేవంతన్న

మానవతా పరిమళం రేవంతన్న

అందెశ్రీ అఖరి మజిలీలో అన్నీ తానై నిలిచాడు సీఎం రేవంతన్న.  ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉండగా పాడెమోసి చివరి క్రతువు నిర్వహించినవారు చరిత్రలో ఎవ్వరూ లేరు.  చాలామంది ముఖ్యమంత్రులు అధికారిక నివాసాల్లో ఉండి శ్రద్ధాంజలి  సందేశాలను పంపి చేతులు దులుపుకున్నవారినే చూశాం.  ఒక గొప్ప కవి మరణిస్తే ఆయన అంత్యక్రియలలో సాదాసీదా మనిషిగా ముఖ్యమంత్రి  పాల్గొని మానవత్వాన్ని చాటిన  సీఎం రేవంత్ రెడ్డి  చరిత్రలో నిలిచిపోతారు.  ప్రొటోకాల్ ను  పక్కనపెట్టి,  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ అంతిమయాత్రలో దాదాపు నాలుగు గంటలకు పైగా గడిపారు.  అందెశ్రీతో ఆయనకున్న అనుబంధం అలాంటిది.  కవి గొప్పతనాన్ని గౌరవిస్తూ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను చేయడమే కాకుండా అంత్యక్రియల్లో అన్నీ తానై నిలబడటం ఓ కవికి ఇచ్చిన గొప్ప గౌరవం. ఇది చరిత్రపుటల్లో ఎప్పటికి చెరగని ముద్రే అవుతోంది.

చెవిలో చివరి పిలుపు

సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ దింపుడు కళ్లెం దగ్గర చివరిసారిగా అన్నా లెవ్వు అని చెవిలో చివరి పిలుపు పిలిచారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో అన్ని తానై అందెశ్రీ కుమారునితో  తంతు జరిపించారు. ఒక సీఎం ఈ స్థాయిలో పని చేయడం ఎన్నడూ చూడలేదు. సీఎం పాల్గొన్న అంత్యక్రియల దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  సీఎం రేవంత్​రెడ్డి  చేసిన ఈ పనిపై  ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  సీఎం హోదా అంటే  ప్రొటోకాల్, అధికార దర్పంలాంటి ఏవీ అక్కడ కనిపించలేదు. ఒక మహాకవి పార్థివ దేహం ఈ భూమి నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు దక్కాల్సిన గౌరవాన్ని సీఎంగా రేవంత్​ దగ్గరుండి అందించారు.

అందెశ్రీని తెలంగాణ మరువదు

అందెశ్రీని తెలంగాణ మరవదు. జయ జయహే తెలంగాణ గీతం ఉన్నంతవరకు ఆయన మనందరిలో  ప్రతిధ్వనిస్తూనే ఉంటాడు.  ప్రతిరోజు ఉదయం బడి పిల్లల గొంతు నుంచి జాలువారుతుంటాడు.  ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆయన గేయం మార్మోగుతూనే ఉంటుంది.  తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి ఆయన అందించిన సాహిత్యం పరిమళిస్తూనే ఉంటుంది.  తెలంగాణ యావత్ జాతి మదిని దోచిన మహాకవి అందెశ్రీ నిష్క్రమణ రాష్ట్రానికి తీరని లోటు.  ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా  కోరుకోవడం మాత్రమే మనం చేయగలిగింది. తెలంగాణ ఆత్మకు ప్రతీక అయిన అందెశ్రీకి ఘనంగా నివాళి 
అర్పించడం మన కర్తవ్యం.

గద్దర్​కు అదే గౌరవం

తెలంగాణ అసెంబ్లీ జనరల్ ఎలక్షన్లకు మూడు నెలల ముందు ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణించారు. పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న రేవంత్ గద్దర్ అంత్యక్రియలకు హాజరై గద్దర్ కుమారుడు సూర్యం పక్కనే ఉండి అన్నీ తానై క్రతువు  నిర్వహింపజేశారు.  మూడు నెలల తర్వాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సినీనటుల నటనకు ఉత్తమ అవార్డు కింద గద్దర్ పేరిట పురస్కారాలకు అందజేసేందుకు రేవంత్ నిర్ణయించారు.  కళాకారుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి గత పాలక సీఎంలలో ఎవ్వరికీ లేదనే చెప్పాలి.  తెలంగాణ కవులను ఆదరించి అమితంగా గౌరవించుకునేందుకు ఆయన తెరతీశారు.  పాలకునికి గొప్ప మనసుంటేనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే  దృక్ఫథం సీఎం రేవంత్  చేతల్లో కనిపిస్తోంది.

- ఆది శ్రీనివాస్,  
ప్రభుత్వ విప్,
వేములవాడ ఎమ్యెల్యే