- ఇవాళ (నవంబర్19 ) ఇందిరమ్మ జీవిత బీమా ప్రారంభం..
- సిద్దిపేటకు సీఎం.. ఇవాళ (నవంబర్19 )ఇందిరమ్మ జీవిత బీమా ప్రారంభం
- బీమా దరఖాస్తుల నమోదు కూడా అక్కడే షురూ
- రూ. 544 కోట్ల అభివృద్ధి పనులకు
- శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కోటికి పైగా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రూపొందించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి గురువారం సిద్దిపేట జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు. బీమా దరఖాస్తుల నమోదును ప్రారంభించనున్నారు. వివిధ శాఖల కింద నేతన్నలు, గీత, కార్మికులు, మత్స్యకారులకు ఇప్పుడు అందుతున్న రూ.2 లక్షల జీవిత బీమాను ఈ పథకం గొడుగు కిందకు తెచ్చి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సిద్దిపేట జిల్లాలో రూ.544.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో రూ.451.13 కోట్లతో చేపట్టే కొత్త పనులకు భూమిపూజ చేసి, రూ.92.98 కోట్లతో పూర్తయిన భవనాలు, వసతులను ప్రజలకు అంకితం చేస్తారు. అనంతరం సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా విధివిధానాలను వివరిస్తారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఊరూరా నమోదు కేంద్రాలు: సీఎస్
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం సెక్రటేరియెట్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల రోజుల పాటు సాగే నమోదు కోసం ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక యాప్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని, అర్హులైన ప్రతి కుటుంబాన్నీ నమోదు చేయాలని సూచించారు.
సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో రూ.200 కోట్ల చొప్పున రూ.400 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సీఎం శంకుస్థాపన చేస్తారు. చిన్నకోడూరు మండలంలో రూ.7.50 కోట్లు, దౌల్తాబాద్ మండలంలో రూ.7.80 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, ఏడు ప్రభుత్వ స్కూళ్లలో రూ.15.44 కోట్లతో అదనపు తరగతి గదులు, రూ.13.50 కోట్లతో ఆరు కొత్త తహసీల్దార్ ఆఫీసుల భవనాలకు పునాదిరాయి వేస్తారు. జనగామ నియోజకవర్గ పరిధిలో రూ.6.89 కోట్లతో మూడు విద్యుత్ సబ్స్టేషన్ల పనులకు శంకుస్థాపన చేస్తారు.
పూర్తయిన పనుల ప్రారంభం
లోవోల్టేజీ సమస్యకు పరిష్కారంగా రూ.54.67 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్స్టేషన్లు, గజ్వేల్‌లో రూ.1.59 కోట్లతో కట్టిన విద్యుత్ శాఖ డివిజనల్ ఆఫీసును సీఎం ప్రారంభిస్తారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి భక్తుల కోసం రూ.14.35 కోట్లతో నిర్మించిన వసతి సత్రం, రూ.12 కోట్లతో కట్టిన క్యూ కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తెస్తారు. జిల్లావ్యాప్తంగా రూ.6.50 కోట్లతో నిర్మించిన 53 గ్రామ మహిళా సంఘాల భవనాలు, రాయపోల్ మండలంలో రూ.3.87 కోట్లతో కట్టిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు.
