
- వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన
- నీట మునిగిన ఇండ్లకు వెళ్లి పరామర్శ
- ఇసుక మేటలు వేసిన పోలాల సందర్శన
- సహాయ చర్యలపై అధికారులతో సమీక్ష
- 15 రోజుల్లో మరో సారి సుదీర్ఘ సమీక్ష
కామారెడ్డి/ కామారెడ్డిటౌన్/ లింగంపేట, వెలుగు: భారీ వరదలతో నష్టపోయిన బాధితులకు సీఎం రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను స్వయంగా పలకరించి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. గురువారం ఆయన లింగంపేట మండలం మోతే గ్రామానికి హెలిక్యాప్టర్‌లో చేరుకున్నారు.
హెలీపాడ్ వద్ద జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్ధుకు చేరుకొని వరదల్లో కొట్టుకుపోయిన బ్రిడ్జిని చూశారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో నష్టానికి సంబంధించిన ఫోటో ప్రదర్శను చూశారు. నియోజకవర్గంలో నష్టం గురించి ఎమ్మెల్యే మదన్మోహన్రావు సీఎం కు వివరించారు. బురుగిద్ద వద్ద ఇసుక మేటలు వేసిన వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు.
రైతులకు అండగా ఉంటామని, ఇసుక మేటలు తొలగించేందుకు సాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అ తర్వాత కామారెడ్డికి చేరుకున్న సీఎం జీఆర్ కాలనీలో నీట మునిగిన ఇండ్లను చూశారు. దివ్యాంగురాలు రమ్యతో మాట్లాడారు. జీఆర్కాలనీ, కౌండిన్య , ద్వారకనగర్ కాలనీలకు చెందిన పలువురు బాధితులు వరదల్లో తాము పడ్డ కష్టాలను వివరించారు. వరద ముప్పును శాశ్వతంగా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
వరద ఇండ్లలోకి రాకుండా వాగు పక్కన కరకట్ట కట్టాలని, అక్కడ ఉన్న 2 బ్రిడ్జిల ఎత్తు పెంచి.. నీరు ఆగకుండా కల్వర్టులు నిర్మించాలని అన్నారు. మెయిన్ రోడ్డుపై డివైడర్ల వల్ల వరద నీరంతా ఇండ్లలోకి వచ్చిందన్నారు. సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, కొడంగల్తరహాలో కామారెడ్డికి సాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.
ప్రపోజల్స్‌పై రివ్యూ
వరద సహాయ చర్యలపై ఆయా శాఖలు ఇచ్చిన ప్రపోజల్స్‌పై సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ చేశారు. రోడ్లు, బ్రిడ్జిలు, చెరువులు , ప్రాజెక్టుల రిపేర్లు, పునరుద్ధరణ కోసం పక్కాగా అంచనాలు తయారు చేయాలని, కేంద్రం నుంచి సహాయం అందే విధంగా రిపోర్ట్రూపొందించాలని ఆదేశించారు. వరద సహాయ చర్యల్లో కామారెడ్డి జిల్లా రోల్‌మోడల్‌గా ఉండేలా ప్లాన్ చేయాలన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు, అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి శాశ్వత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఎమ్మెల్యేల ప్రతిపాదనలపై సమీక్షించాలని ఇంచార్జి మంత్రి సీతక్కకు సీఎం సూచించారు. మరో 10, 15 రోజుల్లో ఉమ్మడి జిల్లా సమస్యలు, ప్రతిపాదనలపై పూర్తిస్థాయిలో సమీక్షిద్దామన్నారు.
ఎంత భారీ వరద వచ్చినా పోచారం ప్రాజెక్టు చెక్కుచెదరకుండా నిలబడిందని గుర్తు చేశారు. జిల్లాలో జరిగిన నష్టంపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్సీఎంకు పూర్తిస్థాయిలో రిపోర్ట్ అందించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎంపీ సురేష్‌షేట్కార్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాటిపల్లి వెంకటరమణరెడ్డి, కె.మదన్మోహన్రావు, తోట లక్ష్మీకాంతరావు, సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, అగ్రో ఛైర్మన్ కాసుల బాల్‌రాజు, ప్రత్యేక అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర , మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా లైబ్రరీ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా యంత్రాంగానికి సీఎం అభినందనలు
వరదల సందర్భంగా సహాయక చర్యలు, ప్రాణ, ఆస్థి నష్ట నివారణకు శ్రమించిన జిల్లా యంత్రాంగాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. వరదలు వచ్చాయని తెలియగానే క్షేత్ర స్థాయిలో పర్యటించాలని మంత్రి సీతక్క, సలహాదారు షబ్బీర్‌అలీ, ఎంపీ సురేష్షేట్కార్లకు సూచించానన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నానన్నారు.