- వాళ్ల నిర్వాకంతో రూ.2 వేల కోట్ల ప్రాజెక్టు రూ.4,600 కోట్లకు చేరింది
 - ఎన్ని అడ్డంకులు వచ్చినా టన్నెల్‌ను పూర్తి చేస్తం
 - కృష్ణా జలాల్లో మన వాటా కోసం ట్రిబ్యునల్లో కొట్లాడుతున్నామని వెల్లడి
 - టన్నెల్ వద్ద ఎయిర్ బోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వే ప్రారంభం
 
నాగర్ కర్నూల్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్ట్‌ను ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేసి తీరుతామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరు బిడ్డనైన తాను సీఎంగా.. నల్గొండ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రులుగా ఉన్నామని, ఇప్పుడు కాకుంటే ఈ ప్రాజెక్ట్ ఇక ఎప్పటికీ పూర్తి కాదన్నారు. పదేండ్లు కేసీఆర్ సీఎంగా ఉన్నా పది మీటర్లు కూడా టన్నెల్ తవ్వలేదని ఫైర్ అయ్యారు. రాజకీయ కారణాలతోనే ఆయన దాన్ని పక్కన పెట్టారని ఆరోపించారు.
నాగర్ కర్నూల్ జిల్లా మన్నెవారిపల్లె సమీపలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ఔట్లెట్ దగ్గర సోమవారం ఎయిర్ బోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 30 లక్షల మంది ఫ్లోరైడ్ బాధితులకు తాగునీరు, 3 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు 1983లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మంజూరైందని, 2004లో అప్పటి సీఎం వైఎస్ హయాంలో పనులు మొదలయ్యాయని చెప్పారు. అయితే కేసీఆర్ హయాంలో కావాలనే దీన్ని నిర్లక్ష్యం చేశారన్నారు.
ఆయన సీఎంగా ఉన్న పదేండ్లలో ఏడాదికి ఒక కిలోమీటర్ తవ్వినా ఈ దుస్థితి ఉండేది కాదన్నారు. వైఎస్ హయాంలో రూ.1,968 కోట్ల అంచనాతో అత్యుత్తమ టెక్నాలజీతో టన్నెల్-1, టన్నెల్-2 పనులను ప్రారంభించారన్నారు. దేశంలోనే తొలిసారి టన్నెల్ బోర్ మిషన్ ఉపయోగించారని, 2014 వరకు32 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తయ్యాయని వివరించారు. ఈ ప్రాజెక్టుతో తమకు పేరు రాదని, కమీషన్లు రావనే రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్, హరీశ్ రావు దీన్ని పక్కన పెట్టారని ఆరోపించారు. పైసా ఖర్చు కాకుండా గ్రావిటీ ద్వారా తాగు, సాగునీరందించే ప్రాజెక్టును అప్పుడే పూర్తి చేసి ఉంటే రూ.2వేల కోట్లతో పూర్తి అయ్యేదని, కేసీఆర్ వివక్ష వల్ల ప్రాజెక్టు వ్యయం రూ.4,600 కోట్లకు చేరిందన్నారు.
కరెంటు బిల్లుల ఖర్చులో సగంతో పూర్తయ్యేది
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిలిచిపోయిన ఎస్ఎల్బీసీ పనులు మొదలు పెట్టామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎస్ఎల్బీసీని గత పదేండ్లు పక్కన పెట్టడం వల్ల అంచనా వ్యయం రూ.2600 కోట్లకు పెరిగిందని, ఏఎంఆర్పీ నుంచి నీటిని ఎత్తిపోయడం వల్ల ఏటా రూ.500కోట్ల విద్యుత్ ఖర్చు బిల్లులు కట్టారని, కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టు కరెంట్ ఖర్చు రూ.5,000 కోట్లకు చేరింది. అందులో సగం ఖర్చు చేసినా ఎస్ఎల్బీసీ పూర్తయ్యేదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇండియన్ ఆర్మీలో ఉన్న పరిచయాలతో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 
నల్లమల అభయారణ్యం, టైగర్ రిజర్వ్, కృష్ణానది ప్రవహిస్తున్న ఈ ప్రాంతంలో అవాంతరాలు ఎదురవుతున్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వినియోగంతో అన్ని అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ముంపునకు గురవుతున్న మర్లపాడు, కేశ్యతండా, నక్కలగండి తండా ప్రజలను ఆదుకుంటామని, డిసెంబర్ 31 లోగా సమస్యలు పరిష్కరించి పూర్తి స్థాయిలో పరిహారం, పునరావాసం అందిస్తామన్నారు.
మూడు రోజులు సర్వే: ఉత్తమ్
ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండేండ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. టన్నెల్ ప్రదేశంలో 800 నుంచి వెయ్యి మీటర్ల లోతులో భూమి పొరలు, రాళ్ల అమరిక, నీటి జాడలు గుర్తించేందుకు మూడు రోజుల పాటు ఏయిర్ బోర్న్ ఏరియల్ ఎలక్ర్టో మాగ్నటిక్ సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు సర్వే చేస్తారని, టన్నెల్ నిర్మాణంలో అనుభవం ఉన్న ఇండియన్ ఆర్మీ కర్నల్ పరిక్షిత్ మెహ్రాను ఏడాదిపాటు డిప్యూటేషన్‌పై తీసుకువచ్చామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సీఎంగా రేవంత్ రెడ్డి ఉండటం నల్గొండ జిల్లా ప్రజల అదృష్టమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, బాలు నాయక్, ఎన్జీఆర్ఐ చీఫ్‌సైంటిస్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కాళేశ్వరంపై ఉన్న ప్రేమ కృష్ణా ప్రాజెక్టుల మీద లేదు
కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లోని ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నెట్టెంపాడు, సంగంబండ, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులను అసంపూర్తిగా వదిలేసిందని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో రూ.1 లక్షా 86 వేల కోట్లు ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు ఇస్తే అందులో రూ.1 లక్షా 5 వేల కోట్లు కాళేశ్వరం కోసమే ఖర్చు చేశారన్నారు. 811 టీఎంసీల కృష్ణాజలాల్లో ఏపీకి 512 టీఎంసీల నీటిని అప్పగించి తెలంగాణకు 299 టీఎంసీలు చాలని ఆనాడు కేసీఆర్, హరీశ్ రావు సంతకాలు పెట్టి వచ్చారని దుయ్యబట్టారు. ఇప్పుడు మన వాటా మనకు దక్కాల్సిందేనని ట్రిబ్యునల్లో వాదిస్తున్నామని, మన వాటా నీటి కోసం సుప్రీంకోర్టు, బ్రిజేశ్ ట్రైబ్యునల్‌లో కొట్లాడాల్సివస్తున్నదన్నారు.
