హైదరాబాద్: ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల అంశంపై శనివారం (జనవరి 3) సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘‘గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయని.. వాటిని వాడుకోవాలని 2015లో జరిగిన కేంద్ర జలశక్తి సమావేశంలో అప్పటి సీఎం కేసీఆర్ సలహా ఇచ్చారు. కేసీఆర్ చెప్పిన మాటలతోనే ఏపీ సీఎం చంద్రబాబు బనచర్ల ప్రాజెక్ట్ ఆలోచన చేశారు. కేసీఆర్ హయాంలోనే 2016లో బనకచర్ల ప్రాజెక్ట్‌కు పునాది పడింది’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.
జల్ శక్తి శాఖ నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేసీఆర్ రెండు సార్లు వెళ్లారని.. కృష్ణా జలాల్లో ఏపీకీ 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని ఆయన ఒప్పుకున్నారని తెలిపారు. కృష్ణా ట్రైబ్యునల్ తుది తీర్పు వచ్చేవరకు ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని సంతకం పెట్టి కృష్ణా జలాల్లో తెలంగాణకు కేసీఆర్ మరణ శాసనం రాశారని విమర్శించారు.
కృష్ణా జలాల్లో వాటా పెంపు కోసం 2020లో మరోసారి అవకాశం వస్తే కూడా కేసీఆర్ ఉపయోగించుకోలేదన్నారు. అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కేసీఆర్‌కు సంబంధమే లేదని.. ఈ ప్రాజెక్ట్ కోసం మాజీ ఎంపీ విఠల్ రావు మొదటిసారి కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం పార్టీలకతీతంగా ఆనాడు మహబూబ్ నగర్ జిల్లా నేతలు సంతకాలు చేశారన్నారు.
2013లోనే పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ జీవో ఇచ్చిందని.. విఠల్ రావు లేఖతోనే పాలమూరు ప్రాజెక్టుకు పునాది పడిందని చెప్పారు. ప్రాజెక్ట్ అడిగింది కాంగ్రెస్.. సాధించింది కాంగ్రెస్సేనని.. ఇందులో బీఆర్ఎస్ పాత్ర ఏమిలేదని పేర్కొన్నారు. నీళ్లను ఏపీకి తాకట్టు పెట్టి మాపై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిజాలన్నీ బయటకు వచ్చే సరికి బహిరంగా సభల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని.. బండారం బయటపడుతుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెట్టిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.
