ఓరుగల్లులో స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం.. సీఎంకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల విజ్ఞప్తి

ఓరుగల్లులో స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం.. సీఎంకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల విజ్ఞప్తి
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల విజ్ఞప్తి
  • సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చిన సీఎం  
  • ఉనికిచెర్ల శివారులో 50 ఎకరాల్లో ఏర్పాటుకు కసరత్తు

హనుమకొండ, వెలుగు: ఓరుగల్లులో స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.  ప్రతిపాదనలను పరిశీలించాలని ఆఫీసర్లను ఆదేశించారు.  స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం మంజూరు కోరుతూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, పాలకుర్తి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, యశస్వినీ రెడ్డి ఆదివారం హైదరాబాద్ ​జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కలిశారు. ముందుగా ఓరుగల్లు అభివృద్ధిపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతర్జాతీయ క్రీడల్లో సత్తా చాటుతున్న క్రీడాకారులెందరో ఉన్నారన్నారు. వీరిలో అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారన్నారు.

కానీ క్రీడాకారులకు ప్రస్తుతం జేఎన్ఎస్ మాత్రమే అందుబాటులో ఉందని, అది అందరి అవసరాలు తీర్చలేకపోతోందన్నారు. వరంగల్ రింగ్ రోడ్డు(ఎన్ హెచ్--163) బైపాస్ ను ఆనుకుని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారు సర్వే నం.325లోని 20 ఎకరాలు, మరో 30 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు  ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని తెలిపారు.  వరంగల్ సిటీని మరింత గొప్పగా అభివృద్ధి చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని సీఎం హామీ ఇచ్చారు. త్వరలోనే క్రీడా పాఠశాల, క్రికెట్ స్టేడియం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు.