18 గంటలు పనిచేయాలి.. లేకపోతే బదిలీ: సీఎం రేవంత్

18 గంటలు పనిచేయాలి.. లేకపోతే బదిలీ: సీఎం రేవంత్

ఆరు గ్యారంటీలను ప్రజలకు చేరవేయడానికి అధికారులే ప్రభుత్వ సాధకులని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. వీటిని అమలు పరిచే క్రమంలో అధికారులకు ఇబ్బంది అనిపిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గానీ, పోలీసు డిపార్ట్ మెంట్ లో డీజీపీకి  గానీ తెలియజేయాలని, ఈ టాస్క్​లో పనిచేయడానికి ఇబ్బందిగా ఉంటే ఇతర ప్రాంతానికి బదిలీ చేయడానికి, బాధ్యతల నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని  ఆయన తేల్చిచెప్పారు. ‘‘ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆదేశాలను బాధ్యతగా నిర్వర్తించాల్సిందే. 

18 గంటలు పనిచేయాల్సి వచ్చినప్పుడు..  మానసికంగా, శారీరకంగా ఇబ్బంది ఎందుకు అనిపిస్తే మాకు చెప్పండి. కలెక్టర్లుగా , ఎస్పీలుగా అక్కడి నుంచి మార్చి వేరోచోటికి బదిలి చేస్తం. 18 గంటలు పనిచేయాల్సిన అవసరం లేని ప్రాంతానికి బదిలీ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు” అని సీఎం స్పష్టం చేశారు. ప్రజలతో మమేకం కావడానికి ఇది మంచి అవకాశం అని, గ్రామ సభల ద్వారా జనంలోకి వెళ్లాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మరింత బెటర్​గా పాలన అందించేందుకు అధికారులు సూచనలు చేస్తే తప్పకుండా  స్వీకరిస్తామని చెప్పారు.