
- అద్భుత నగరంగా తీర్చిదిద్దుతం
- దానిని ఫ్యూచర్ సిటీగా మార్చేస్తం
- అక్కడి వరకు ఎంఎంటీఎస్, మెట్రో
- అక్కడే స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు
- అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు నేర్పుతం
- రేపు స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన
- నిఖత్కు డీఎస్పీ స్థాయి ఉద్యోగం
- అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్ల ప్రాంతాన్ని ఫోర్త్ సిటీగా తీర్చిదిద్దబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ముచ్చెర్ల ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చెందుతుందన్నారు. జంట నగరాలకు దీటుగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఫార్మా విలేజ్ను ఏర్పాటు చేస్తామన్నారు. రేపు అక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయబోతున్నట్టు సీఎం చెప్పారు. గోల్ఫ్ కోర్సును, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. యువకులకు సరైన క్రీడా నైపుణ్యం లేకపోవడం వల్ల గేమ్స్, స్పోర్ట్స్లో రాణించలేక పోతున్నారని, చాలా మంది యువకులు డ్రగ్స్కు అడిక్ట్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
క్రీడల్లో మన సత్తా చాటేలా స్పోర్ట్ యూనివర్సిటీని అంతర్జాయ స్థాయిలో నిర్మిస్తామని అన్నారు. బీసీసీఐతో మాట్లాడి అక్కడే ఓ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియం నిర్మించనున్నామని చెప్పారు. ముచ్చర్ల వరకు మెట్రోను, ఎంఎంటీఎస్ సేవలను విస్తరిస్తామని చెప్పారు. ఎన్ఏసీని అక్కడికే తరలించనున్నామని సీఎం చెప్పారు. జీనోమ్ వ్యాలీలో ఉన్న ఫార్మారిలేటెడ్ ఇండస్ట్రీస్ లాంటి వాటిని నాలుగువేల ఎకరాల్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఓ టూరిజం హబ్ను క్రియేట్ చేస్తామని అన్నారు. ఇందుకోసం భూ సేకరణ చేస్తుంటే కేటీఆర్ విషం చిమ్మడం విడ్డూరంగా ఉందన్నారు. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాను రెసిడెన్షియల్ ప్రాంతంగా మార్చుతూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం గుర్తు చేశారు. తాము మరో నగరాన్ని డెవలప్ చేస్తామంటే అడ్డుపడడం సరికాదన్నారు.
నిఖత్ జరీన్కు ఉద్యోగం
గత ప్రభుత్వం క్రీడాకారులను విస్మరించిందని నిజామాబాద్ బిడ్డ నిఖత్ జరీన్కు ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. తాము ఆమెకు డీఎస్పీ స్థాయి ఉద్యోగం ఇవ్వబోతున్నట్టు చెప్పారు. భారత్కు వరల్డ్ కప్ తేవడంలో భాగస్వామి అయిన సిరాజ్కు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు.