కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా కేసీఆర్ పై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంపైన, ఏపీ సీఎం చంద్రబాబుపైన ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించిన చరిత్ర నాది..ఏపీకి నీళ్లు దోచి పెట్టిన చరిత్ర కేసీఆర్ దని ధ్వజమెత్తారు.
రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలనే ఇప్పటి వరకు తాను సాధించిన విజయాన్ని చెప్పలేదన్నారు రేవంత్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితేనే తాము ప్రాజెక్టులపై చర్చలకు వస్తామని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తే.. తనపై గౌరవంతో రాయల సీమ ప్రాజెక్టు పనులు ఆపారని చెప్పారు రేవంత్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాయల సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు ఆగాయా? లేదో.. కేసీఆర్, హరీశ్ నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ వేసి చూసుకోవాలని చెప్పారు రేవంత్. జలదోపిడిని ఆపి తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పొద్దని ఏపీపై ఒత్తిడి తెచ్చామన్నారు.
Also Read : అసెంబ్లీలో కేసీఆర్ పై అతడు సినిమా స్టోరీ చెప్పిన రేవంత్
గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయని.. వాటిని వాడుకోవాలని 2015లో జరిగిన కేంద్ర జలశక్తి సమావేశంలో అప్పటి సీఎం కేసీఆర్ సలహా ఇచ్చారు. కేసీఆర్ చెప్పిన మాటలతోనే ఏపీ సీఎం చంద్రబాబు బనచర్ల ప్రాజెక్ట్ ఆలోచన చేశారు. కేసీఆర్ హయాంలోనే 2016లో బనకచర్ల ప్రాజెక్ట్‌కు పునాది పడింది’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్.
2013లోనే పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ జీవో ఇచ్చిందని.. విఠల్ రావు లేఖతోనే పాలమూరు ప్రాజెక్టుకు పునాది పడిందని చెప్పారు. ప్రాజెక్ట్ అడిగింది కాంగ్రెస్.. సాధించింది కాంగ్రెస్సేనని.. ఇందులో బీఆర్ఎస్ పాత్ర ఏమిలేదన్నారు. నీళ్లను ఏపీకి తాకట్టు పెట్టి మాపై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిజాలన్నీ బయటకు వచ్చే సరికి బహిరంగా సభల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని.. బండారం బయటపడుతుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెట్టిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.
