మావోయిస్టులు లొంగిపోవాలి.. జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధికి పాటుపడాలి: సీఎం రేవంత్

మావోయిస్టులు లొంగిపోవాలి.. జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధికి పాటుపడాలి: సీఎం రేవంత్
  • ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలి: 
  • పోలీస్‌‌ శాఖలో రాజకీయ జోక్యం లేదు.. పైరవీలకు చాన్స్​లేదు
  • శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ 
  • చట్టాన్ని గౌరవించే వాళ్లతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్​
  • పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
  • కానిస్టేబుల్​ ప్రమోద్​ ఫ్యామిలీకి రూ. కోటి ఎక్స్​గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం
  • సైబర్ నేరాలు, డ్రగ్స్​ కట్టడిపై స్పెషల్​ ఫోకస్​ పెట్టాలని పోలీసులకు సూచన
  • డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దని ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: 
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. ‘‘ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేస్తున్న. రాష్ట్రాభివృద్ధిలో, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతున్న” అని పేర్కొన్నారు.

 మంగళవారం (అక్టోబర్ 21) పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే) కార్యక్రమాన్ని హైదరాబాద్​లోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌‌లో నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. పోలీసుల సేవలను, త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు విస్తృతంగా జరిగేవని తెలిపారు. పోలీస్‌‌ శాఖ చర్యల వల్ల రాష్ట్రంలో శాంతి నెలకొన్నదన్నారు.


‘‘ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయారు. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి. ప్రజాస్వామ్య నిర్మాణంలో వారి వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా ఈ వేదిక మీది నుంచి విజ్ఞప్తి చేస్తున్న. రాష్ట్రంలో శాంతి భద్రతలు నిలబడినప్పుడే, పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అప్పుడే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయి. కాబట్టి.. ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించేందుకు ముందుకురావాలిన మావోయిస్టులను కోరుతున్న” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  

పోలీసు అమరవీరుల కుటుంబాలకు భరోసా 

ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది అమరులైతే.. అందులో తెలంగాణకు చెందినవారు ఆరుగురు ఉన్నారని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘గ్రేహౌం డ్స్​ కమాండోలు టి.సందీప్‌‌‌‌, వి.శ్రీధర్‌‌‌‌, ఎన్‌‌‌‌.పవన్‌‌‌‌ కల్యా ణ్‌‌‌‌ వంటి వారు సంఘవిద్రోహ శక్తులతో పోరాడి చనిపో యారు. అసిస్టెంట్‌‌‌‌ కమాండెంట్‌‌‌‌ బానోతు జవహర్‌‌‌‌లాల్‌‌‌‌, నల్గొండ కానిస్టేబుల్‌‌‌‌ బి.సైదులు విధినిర్వహణలో మరణించారు. మూడు రోజుల కిందట నిజామాబాద్‌‌‌‌ లో కానిస్టేబుల్‌‌‌‌ ప్రమోద్‌‌‌‌ కుమార్‌‌‌‌ వీర మరణం చెందా రు. 

ఈ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది” అని  భరోసా ఇచ్చారు. 2008 జూన్‌‌‌‌ 29న ఒడిశాలోని చిత్రకొండలో మావోయిస్టుల దాడిలో మర ణించిన 33 మంది పోలీస్ అమరుల కుటుంబాల్లో   గాజులరామారంలో 200 గజాల చొప్పున స్థలం కేటా యించినట్లు తెలిపారు. నిజామాబాద్ కానిస్టేబుల్​ ప్రమోద్‌‌‌‌ భార్య ప్రణీత, ముగ్గురు పిల్లలు, ఆ కుటుంబాని కి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

‘‘ప్రమోద్​ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌‌‌‌గ్రేషియా, పదవీ విరమణ వయసు వరకు లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నం. ఇవేకాకుండా పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ. 16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ. 8 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉం టాం” అని సీఎం తెలిపారు. కాగా, పోలీసు అమరవీరుల కుటుంబాలకు ర్యాంకును బట్టి ఎక్స్​గ్రేషియా ప్రభుత్వం చెల్లిస్తున్నదని వివరించారు.  

మహిళా ఐపీఎస్​లను చూసి తెలంగాణ గర్విస్తున్నది

అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో పోస్టింగులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తెలిపారు. “తెలంగాణ పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, ఆర్మ్​డ్​ రిజర్వ్‌‌‌‌, సీసీఎస్, సైబర్‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్‌‌‌‌లు సారథ్యం వహించడం రాష్ట్ర ప్రభుత్వానికి గర్వ కారణం. హైదరాబాద్‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌, రాచకొండ ఈ కీలక పోలీసు కమిషనరేట్లలో జోన్‌‌‌‌ డీసీపీలుగా ఏడుగురు మహిళా అధికారులే ఉన్నారు. రెండేసి కీలక విభాగాలను కూడా సమర్థవంతంగా నడిపిస్తున్న మహిళా ఐపీఎస్ అధికారులను చూసి తెలంగాణ గర్విస్తున్నది” అని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. 

సైబర్ నేరాలు, డ్రగ్స్​ కట్టడిపై ఫోకస్

గతంలో తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు ఉంటే.. ఇప్పుడు వైట్‌‌‌‌ కాలర్‌‌‌‌ నేరాలు, మాదకద్రవ్యాలు, సైబర్‌‌‌‌ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని సీఎం రేవంత్​ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వాటిని పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలువాలని ఆయన సూచించారు.  

‘‘తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్‌‌‌‌’ సమర్థవంతంగా పనిచేస్తున్నది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా  మార్చాలనేది మా ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతో పాటు విస్తృత అధికారాలు ఇచ్చాం. అందుకే డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశాం. ఒకప్పటితో పోలిస్తే సైబర్‌‌‌‌ నేరాలు, డిజిటల్‌‌‌‌ మోసాలు, మార్ఫింగ్‌‌‌‌ కంటెంట్‌‌‌‌, డ్రగ్స్, హ్యూమన్‌‌‌‌ ట్రాఫికింగ్‌‌‌‌ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాల్​గా మారుతున్నాయి.

 సాంకేతికత వినియోగంతో సైబర్‌‌‌‌ నేరాలను పోలీసు శాఖ ఎదుర్కొంటున్న తీరు అద్భుతం. సైబర్‌‌‌‌ నేరగాళ్లను అరికట్టడానికి అంతర్రాష్ట్ర ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్‌‌‌‌ దేశం సెల్యూట్‌‌‌‌ చేస్తున్నది” అని పేర్కొన్నారు. కాగా, కొత్తగా నిర్మించిన పోలీసు అమరవీరుల స్తూపాన్ని సీఎం రేవంత్​రెడ్డది ఆవిష్కరించారు. అమరవీరుల కుటుంబాలకు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్‌‌‌‌, డీజీలు, మాజీ డీజీలు, అడిషనల్‌‌‌‌ డీజీలు, సీపీలు, ఎస్పీలు, పోలీస్​ అమరవీరుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

చట్టాన్ని గౌరవించే వాళ్లతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్​

రాష్ట్రంలో శాంతి భద్రతల  పరిరక్షణ  కోసం పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి చెప్పారు. పోలీస్ శాఖపై రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులను కల్పించామన్నారు. పోలీస్ అధికారులకు కేటాయిస్తున్న పోస్టుల్లో ఎలాంటి  పైరవీలు, ఒత్తిళ్లకు అవకాశం లేకుండా సమర్థత, అనుభవ ప్రాతిపదికన వివిధ హోదాల్లో నియమిస్తున్నామని చెప్పారు. 

పూర్తి  స్వేచ్ఛగా పనిచేయడానికి  తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే వారితోనే ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ‘‘పోలీస్​ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసాగా నిలవాలి. పోలీస్ శాఖ గౌరవం పెరిగితే రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుంది” అని తెలిపారు.