ఇవాళ్టి నుంచి 4 స్కీమ్స్ .. తొలిరోజు మండలానికి ఓ గ్రామంలో ప్రారంభం

ఇవాళ్టి నుంచి 4 స్కీమ్స్ .. తొలిరోజు మండలానికి ఓ గ్రామంలో ప్రారంభం
  • నారాయణపేట జిల్లా చంద్రవంచలో లాంచ్​ చేయనున్న సీఎం
  • మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ అమలు
  • రిపబ్లిక్​ డే వేడుకల తర్వాత పథకాల ప్రారంభోత్సవాల్లో పాల్గొనాలి
  • కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్​ ఆదేశం
  • నిజమైన లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దు
  • అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్​ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్స్​ను రిపబ్లిక్​ డే సందర్భంగా ఆదివారం సీఎం రేవంత్​రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో తొలిరోజు ఈ నాలుగు పథకాలను ప్రారంభిస్తారు. కొత్తగా అప్లికేషన్లు వచ్చినందున వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని.. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31 వరకు అర్హులందరికీ ఈ స్కీములు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 

నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో నాలుగు పథకాలను సీఎం రేవంత్​ ప్రారంభిస్తారు. గణతంత్ర వేడుకల అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పథకాల ప్రారంభోత్సవాల్లో పాల్గొనాలని జిల్లాల కలెక్టర్లు, ఇన్​చార్జ్​ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులకు సీఎం సూచించారు. పథకాలపై శనివారం హైదరాబాద్​లోని పోలీస్​ కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో ఆయన సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి సర్వే, గ్రామ సభలు, కొత్తగా తీసుకున్న దరఖాస్తులపై అధికారులు సీఎం రేవంత్​రెడ్డికి వివరించారు. ‘‘నిజమైన లబ్ధిదారుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు” అని సీఎం తేల్చిచెప్పారు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే వాటిని క్యాన్సిల్​ చేస్తామని, ఆయా అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఒక్కో గ్రామంలో ఒక్కో పథకానికి ఒక్కొక్కరు చొప్పున నాలుగు పథకాలకు నలుగురు అధికారులను నియమించాలన్నారు. 

అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తం: భట్టి

ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకొని అర్హులకు లబ్ధి చేకూర్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క అన్నారు. లక్షల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను  వెరిఫై చేసి లబ్ధిదారులకు పథకాలను వర్తింపజేస్తున్నట్టు తెలిపారు. ‘‘జనవరి 26.. అత్యంత పవిత్రమైన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఈరోజు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ స్కీమ్స్​ అమలును ప్రారంభిస్తున్నాం. ఇచ్చిన మాట మేరకు పథకాలు అమలు చేస్తున్నాం. తొలిరోజు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని వంద శాతం ఆ గ్రామంలో ఈ నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. లక్షలాదిగా వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్లలో ఎంట్రీ చేసి అర్హులను గుర్తిస్తాం. మార్చి నెల వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది.  వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తాం. భూమిలేని నిరుపేద, 20 రోజులపాటు ఉపాధి హామీ పనికి వెళ్లిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి ఉన్నతమైన పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుడ్తున్నది” అని తెలిపారు. 

రేషన్​ కార్డులు ఇచ్చిన వెంటనేఫ్రీగా సన్నబియ్యం: ఉత్తమ్​

రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే లబ్ధిదారులందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడ్తామని మంత్రి ఉత్తమ్ ​కుమార్ ​రెడ్డి వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో ఇది విప్లవాత్మకమైన పథకం కాబోతున్నదని చెప్పారు. ‘‘రాష్ట్రంలో 70 నుంచి73 శాతం వరకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాం. దేశంలోనే తొలిసారి ఒక రాష్ట్రం ఇంత విస్తృతమైన ఆహార భద్రతా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. ఒకేసారి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం ఇదే మొదటిసారి. మొదట ఈ పథకాలను అన్ని మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో అమలు చేసి, ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో రోల్ అవుట్ చేస్తాం. లబ్ధిదారుల గుర్తింపు మార్చి వరకు కొనసాగుతుంది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరు ఉంటుంది” అని స్పష్టంచేశారు. జాబితాలో పేరు లేని అర్హులు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ ప్రక్రియ ప్రతి అర్హులైన కుటుంబానికి అందే వరకు కొనసాగుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆహార భద్రతను నిర్లక్ష్యం చేసిందని, పదేండ్లు దొడ్డు బియ్యం తిన్న పేదలందరూ త్వరలో సన్నబియ్యం తినబోతున్నారని ఆయన తెలిపారు. 

రబీ పంట కోసం ఎకరాకు రూ.6 వేలు: తుమ్మల

రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు సీజన్​కు రూ.6 వేల చొప్పున రైతు భరోసా అందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు తెలిపారు. ఇప్పుడు రబీ పంట కోసం ఈ మొత్తం పెట్టుబడి సాయం జమచేస్తామన్నారు. ‘‘అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతుల ఖతాల్లో రూ.30 వేల కోట్లు నేరుగా జమ చేశాం. ఇందులో రుణమాఫీ కోసం రూ.21 వేల కోట్లు, మొదటి విడత రైతుబంధు కింద రూ.7 వేల కోట్లు, రైతు బీమా కింద రూ.3 వేల కోట్లు ఇచ్చాం. ఇప్పుడు ఈ సీజన్​లో ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం కింద రూ.9 వేల కోట్లు ఇస్తున్నాం” అని వివరించారు. సాగుకు పనికి రాని భూముల గుర్తింపు చివరి దశకు చేరిందని.. గ్రామాల వారీగా సాగుకు యోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

అర్హులు కాకపోతే క్యాన్సిల్​ చేస్తం: పొంగులేటి

అత్యంత పకడ్బందీగా నిజమైన అర్హులకే లబ్ధి జరిగేలా స్కీమ్స్​ అందేలా చర్యలు తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. కొత్త దరఖాస్తులన్నీ పరిశీలించి ప్రతి అర్హుడికీ స్కీమ్స్​ అందజేస్తామని.. ఫిబ్రవరి మొదటి వారంలో నాలుగు పథకాలకు షెడ్యూల్ ఇచ్చి అన్ని గ్రామాల్లో మార్చిలోగా పూర్తి చేస్తామని తెలిపారు. పైరవీలు, అవినీతికి తావు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం మాదిరి ఒకసారి ఇచ్చి వదిలేయబోమని.. అర్హులందరికీ స్కీమ్స్​ అమలు చేస్తామని చెప్పారు. పథకాల్లో అర్హులు కాదని తేలితే వెంటనే క్యాన్సిల్ చేస్తామని.. అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటామని ఆయన తెలిపారు.  

రేపు ఉదయం ఖాతాల్లోకి నిధులు

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్లు శాంక్షన్​ చేసినట్లు ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. రేషన్​ కార్డులకు సంబంధించి కూడా ఫుడ్​ సెక్యూరిటీ పత్రాలను గ్రామాల్లో అర్హులకు ఇవ్వాలని.. రైతు భరోసా రైతుల ఖాతాల్లోకి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నేరుగా భూమి లేని కూలీల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయాలని ఆర్థికశాఖకు సూచించారు. ఆదివారం కావడంతో వెంటనే నిధులు జమ కావని.. అయితే సోమవారం ఉదయంలోపు ఆయా గ్రామాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేలా చూసి వారి ఫోన్లకు మెసేజ్​లు పంపాలన్నారు. ఈ పథకాలు నిరంతర ప్రక్రియ అని.. ప్రజలు ఆందోళన చెందొద్దని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 621 మండలాలు ఉండగా ఆదివారం ప్రతి మండలంలోని ఒక్కో  గ్రామంలో అంటే 621 గ్రామాల్లో నాలుగు స్కీమ్స్​ను ప్రారంభిస్తారు. సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నాలుగు స్కీములపై సెక్రటేరియెట్​లో మీడియాకు వివరాలు వెల్లడించారు.

నాలుగు పథకాల వివరాలు

 ఇవే రేషన్​ కార్డులు

  •     కొత్త, పేర్ల యాడింగ్​, డిలిషన్​  ఇలా వివిధ రకాలుగా 25 లక్షలకు పైగా అప్లికేషన్లు
  •     అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్​ కార్డు 
  •     కొత్తగా మంజూరు అయ్యే 
  • రేషన్​ కార్డులు 10 లక్షల పైనే

రైతు భరోసా 

  • సీజన్​కు ఎకరానికి 
  • రూ.6 వేల చొప్పున పంపిణీ
  • దాదాపు కోటి 49 లక్షల ఎకరాలకు ఇచ్చేలా ఏర్పాట్లు
  • సాగుకు యోగ్యం కాని భూములు 3 లక్షల ఎకరాలుగా గుర్తింపు

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా

  • భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి
  • రూ.12 వేలు జమ 
  • ఇప్పటి వరకు గుర్తించిన లబ్ధిదారుల కుటుంబాలు
  • 6 లక్షలు  

ఇందిరమ్మ ఇండ్లు:

  • వచ్చిన అప్లికేషన్లు 80.54 లక్షలు
  • వడపోత తర్వాత దాదాపు
  • 40 లక్షల అర్హుల గుర్తింపు  
  • మొదటి ఏడాదిలో 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు