
మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో సమ్మక్క సారక్కల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణం డిజైన్లను విడుదల చేశారు. కొత్తగా రిలీజ్ చేసిన డిజైన్ లో ఆలయంలో ముందుగా ప్రవేశ మార్గంలో కళాతోరణం ఉంది. లోపల సమ్మక్క,సారక్క దేవతలు కొలువుదీరిన గద్దెల ప్రాంగణంలోనే ఒకే వరుసలో గద్దెల పగిడిద్దరాజు గోవిందరాజు, ప్రతి రూపాలకు గద్దెలు నిర్మించనున్నారు.
పూజారుల సూచనలతో నాగులమ్మ గద్దె నిర్మాణం చేయనున్నారు. దీనిద్వారా జాప్యం లేకుండా అమ్మవార్లను భక్తులు దర్శించుకునేందుకు అనువుగా ఉంటుంది. జాతర టైంలో సులభంగా గద్దెల దగ్గరకు చేరుకోవడానికి 4 వైపులా క్యూ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. 1986 తర్వాత మేడారం గద్దెల ప్రాంగణం ఆధునీకరణ జరగనుంది.
గద్దెల అభివృద్ధికి రూ.58.2 కోట్లు, గద్దెల వద్ద కళాకృతి పనులకు రూ.6.8 కోట్లు, జంపన్న వాగు అభివృద్ధి కోసం రూ.39 కోట్లు, భక్తుల వసతి కోసం రూ.50 కోట్లు, రోడ్ల అభివృద్ధికి రూ.52.5 కోట్లు, మిగతావి ఇతరత్రా ఖర్చుల నిమిత్తం వెచ్చించనుంది ప్రభుత్వం. మేడారం అభివృద్ధిలో పూజారులను భాగస్వాములను చేయనుంది ప్రభుత్వం. మహా జాతరకు ప్రజా ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. అవసరమైతే ఇతర శాఖల సహాయంతో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని చెప్పింది.
మేడారం అభివృద్ధి పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరిత్యాలను తట్టుకునేలా రాతికట్టడాలు నిర్మించాలని ఆదేశించారు.