
హైదరాబాద్ శివారులోని కందుకూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.ముచ్చర్లలో మచ్చర్లను న్యూయార్క్ కంటే అద్భుతమైన నగరం గా రూపొందిస్తామన్నారు. 57 ఎకరాల్లో నిర్మించే స్కిల్ యూనివర్శిటీకి సీఎం రేవంత్ భూమి పూజ చేశారు.
స్కిల్ సెంటర్లో అడ్మిషన్ పొందితే పక్కా జాబ్ అని రేవంత్ అన్నారు. ప్రస్తుతం నైపుణ్యం లేకపోవడం వల్ల ఎంతో మందికి ఉద్యోగాలు రావడం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఓఆర్ఆర్ నిర్మించడం వల్లే ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరిగాయన్నారు. స్కిల్ యూనివర్శిటీతో పాటు నాలుగు ప్రధాన కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. హెల్త్ హబ్, స్పోర్ట్స్ హబ్‌లను నిర్మిస్తామన్నారు. రైతుల త్యాగాలకు ఫలితం ఉండాలంటే ఈ ప్రాంతం అభివృద్ది చెందాలన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు బాట వేస్తామన్నారు. స్కిల్ యూనివర్శిటీకి భూమి ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుని ప్రపంచంతో యువతతో పోటీ పడాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. యుంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చలో మాట్లాడిన ముఖ్యమంత్రి విద్యార్థుల కోసం 17 కోర్సులు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వృత్తి నైపుణ్యం లేకపోవడంతో పట్టాలు ఉన్నా ఉద్యోగాలు దొరకడం లేదన్న రేవంత్ దేశానికి ఆదర్శంగా నిలపాలనే ఉద్దేశంతో స్కిల్ వర్సిటీ రూపకల్పన చేసినట్టు తెలిపారు. ఏడాదికి రూ.50వేలు నామ మాత్రపు ఫీజుతో కోర్సుల శిక్షణ అందించనున్నట్లు సీఎం రేవంత్ వివరించారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉచితంగా అందిస్తామని అన్నారు.