కర్నాటక మీద పగతీర్చుకుంటున్నారా?..మోదీకి సీఎం సిద్ధరామయ్య ప్రశ్న

కర్నాటక మీద పగతీర్చుకుంటున్నారా?..మోదీకి సీఎం సిద్ధరామయ్య ప్రశ్న

బెంగళూరు: కర్నాటకకు కరువు సాయం అందించడంలో జాప్యం చేస్తున్నారని  ప్రధాని మోదీపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. తమ రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వం పగ తీర్చుకుంటోందా అని ప్రశ్నించారు.  రాష్ట్రంలోని మొత్తం 236 తాలుకాల్లో 216 తాలుకాలు తీవ్ర కరువు బారిన పడ్డాయని, ఆయా ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి, పరిస్థితిని నివేదించిందని గుర్తుచేశారు. 

అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ‘‘రాష్ట్రంలో 216 తాలుకాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అయినా కేంద్రం నుంచి పరిహారం కింద ఒక్క పైసా రాలేదు. ప్రపంచంలోని బాధలు, దు:ఖాలను చూసి చలించే మీ పెద్ద మనస్సు.. కన్నడిగుల పట్ల ఎందుకు అంత కఠినంగా ఉంది? మీరు మా రాష్ట్రంపై పగ తీర్చుకుంటున్నారా? ఈ ప్రశ్న నేను అడగడం లేదు. మా రాష్ట్రంలో ఆత్మాభిమానం ఉన్న ఆరున్నర కోట్ల మంది కన్నడీయులు అడుగుతున్నారు” అని సిద్ధరామయ్య శుక్రవారం ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు.