సెప్టెంబర్16న పాలమూరు లిఫ్ట్కు స్విచ్చాన్​

సెప్టెంబర్16న పాలమూరు లిఫ్ట్కు స్విచ్చాన్​
  • అదే రోజు నార్లాపూర్​ వద్ద భారీ బహిరంగ సభ
  • పాలమూరు - రంగారెడ్డిపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష
  • 17న కృష్ణా జలాలతో గ్రామ దేవతలను అభిషేకించాలని పిలుపు
  • దక్షిణ తెలంగాణకు పండుగ రోజు.. సంబురాలు చేయాలని సూచన
  • పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

స్వయం పాలనలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలపై దృష్టి సారించాం. ఉమ్మడి రాష్ట్రం నుంచి పెండింగ్‌‌లో ఉన్న భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్​సాగర్ లాంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాం. దీంతో పాలమూరు జిల్లా పచ్చబడింది. వలసలు ఆగిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి పాలమూరుకు కూలీలు వచ్చి పని చేస్తున్న చారిత్రక సందర్భం చోటు చేసుకుంది. చిన్న పెండింగ్​ ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే పాలమూరు ఇంత గొప్పగా పచ్చబడింది. పాలమూరు ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణ దశదిశ మారిపోతుంది.

- సీఎం కేసీఆర్​

హైదరాబాద్, వెలుగు : పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ స్కీంను ఈ నెల 16న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఎల్లూరు పంపుహౌస్​వద్ద మోటార్ స్విచ్ ఆన్ చేయనున్నారు. అక్కడి నుంచి నార్లాపూర్‌‌‌‌కు చేరుకొని కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత నార్లాపూర్ వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. పాలమూరు ప్రాజెక్టుపై బుధవారం సెక్రటేరియెట్‌‌లో కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నార్లాపూర్​వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభకు మహబూబ్​నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రజలు, సర్పంచులు తరలిరావాలని కేసీఆర్ పిలుపునిచ్చినట్లు సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.

బహిరంగ సభకు వచ్చే ప్రజలందరి రవాణా, భోజనం ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌‌ను ఆదేశించినట్లు చెప్పింది. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌‌లో ఉన్న కృష్ణా ప్రాజెక్టు ప్రారంభమవుతుండటం దక్షిణ తెలంగాణ ప్రజలకు పండుగ రోజు. ఈ నెల 17న ఉమ్మడి మహబూబ్​నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పల్లెపల్లెన పెద్ద ఎత్తున సంబురాలు చేయాలి. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చే సర్పంచులు.. కృష్ణా జలాలు తీసుకెళ్లి తమ గ్రామాల్లో గ్రామ దేవతలు, ఇతర దేవతల పాదాలను అభిషేకించాలి. ప్రాజెక్టు పరిధిలో కాల్వల తవ్వకానికి అవసరమైన భూ సేకరణ సహా ఇతర పనులను వేగంగా పూర్తి చేయాలి” అని సీఎం పేర్కొన్నట్లు వివరించింది. 


ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు సవాలుగా స్వీకరించి పని చేశారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారని అభినందించినట్లు వివరించింది. ‘‘ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ల నుంచి నీళ్లు తరలించే కాల్వలకు వెంటనే టెండర్లు పిలువాలి. ఇందుకోసం అవసరమైన భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి వేగంగా పనులు చేపట్టాలి. అచ్చంపేట నియోజకవర్గంలోని ఉమామహేశ్వరం ఎత్తిపోతల పనులు త్వరగా ప్రారంభించాలి. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కాల్వల నిర్మాణ పనులను ఇంజనీర్లతో కలిసి మంత్రులు పర్యవేక్షించాలి’’ అని ఆదేశాలిచ్చినట్లు సీఎంవో వివరించింది.

హరితహారంతో పరిస్థితులు మారినయ్​

‘‘పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్దవైన 145 మెగావాట్ల కెపాసిటీ గల పంపులు బిగించాం. ఈ పంపులకు బిగించే ఒక్కో బోల్ట్ బరువే 12 కిలోలు ఉంటుంది. రూటర్​బరువు 80 టన్నులు ఉంటుంది. 240 టన్నులు ఉండే 34 పంపులను ఎత్తిపోతల కోసం వినియోగిస్తున్నాం” అని కేసీఆర్ చెప్పినట్లు సీఎంవో తెలిపింది. పాలమూరు పరిధిలోకి వచ్చే చెరువులను నింపేలా కాల్వలను అనుసంధానించాలని సూచించినట్లు చెప్పింది.

‘‘ఇన్నాళ్లూ ఎగువ నుంచి వరద వస్తేనే కృష్ణా, గోదావరి నదులు పారేవి. మా ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో పరిస్థితులు మారాయి. దీంతో రాష్ట్రంలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలతోనే ఇక్కడి నదుల్లోకి ప్రవాహం వస్తుంది” అని సీఎం వివరించినట్లు పేర్కొంది.