నాలుగేళ్లకో పెళ్లి చేసుకునే పవన్ ​​.. వాలంటీర్ల గురించి మాట్లాడటమా? : సీఎం ​ జగన్​

నాలుగేళ్లకో పెళ్లి చేసుకునే పవన్ ​​.. వాలంటీర్ల గురించి మాట్లాడటమా? : సీఎం ​ జగన్​

జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ఇటీవల ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ గురించి చేసిన కామెంట్లపై సీఎం వైఎస్​ జగన్​ తీవ్రంగా స్పందించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో జులై 21న ఆయన వైఎస్సార్​ నేతన్న నేస్తం నిధులు విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. నాలుగేళ్లకో పెళ్లి చేసుకునే పవన్​..  వాలంటీర్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. వాలంటీర్లు సేవాభావంతో పని చేస్తున్నారని.. సేవా మిత్ర, సేవా రత్నం, సేవా వజ్రం లాంటి పురస్కారాలు అందుకునే వ్యక్తులను క్యారెక్టర్లు లేని వారంతా తప్పుబడుతున్నారని అన్నారు.  

ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా బురదజల్లడమే ధ్యేయంగా ప్రతిపక్షాలు పని చేస్తున్నాయని అన్నారు. పవన్​ బీజేపీతో పొత్తు పెట్టుకుని.. చంద్రబాబుతో సంసారం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ వాలంటీర్లను విమర్శించరని.. వారంతా ప్రజలకు తెలిసిన వారేనని.. ఎండా వాన లెక్క చేయకుండా సేవలందిస్తున్నారని వివరించారు. 

వైసీపీ ప్రభుత్వం గడపగడపకు సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతుంటే చంద్రబాబు అండ్​ కో జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. వారు చేస్తున్న రాజకీయాలకు నిర్మాత టీడీపీ అధినేత చంద్రబాబు అని, నటన, మాటలు అన్నీదత్తపుత్రుడు పవన్​కల్యాణ్​వి అని విమర్శించారు. నేతన్న నేస్తం కింద ప్రతి నేతన్న చేతిలో లక్ష 20 వేల రూపాయలు ఉన్నట్లు జగన్​ తెలిపారు.  

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎన్నో హామీలు నెరవేర్చలేదని.. తమ పార్టీ అలా కాకుండా మేనిఫెస్టోలో ఉన్న అన్ని హామీలు అమలు చేస్తోందని వెల్లడించారు. ఇప్పటి వరకు నేతన్న లబ్ధిదారుల అకౌంట్లలో రూ.2 లక్షల 25 వేల కోట్లు జమ చేశామన్నారు.