యాదాద్రి జిల్లాలో లీజు మిల్లులకు సీఎంఆర్ కట్..అగ్రిమెంట్లపై సంతకాలు చేయని మిల్లుల ఓనర్లు

 యాదాద్రి జిల్లాలో లీజు మిల్లులకు సీఎంఆర్ కట్..అగ్రిమెంట్లపై సంతకాలు చేయని మిల్లుల ఓనర్లు
  •       ఫ్రాడ్​ మిల్లు సహా సీఎంఆర్​పెండింగ్​ మిల్లులకు కూడా కట్ 
  •       53 మిల్లుల్లో 43కే  సీఎంఆర్​
  •       పరిగణలోకి  గత వానాకాలం బ్యాంక్​ గ్యారెంటీ

యాదాద్రి, వెలుగు: వానాకాలం సీజన్​ వడ్ల కొనుగోలు ప్రారంభం కాగా మిల్లర్లకు ఆఫీసర్లు షాకిచ్చారు. లీజు మిల్లులతో పాటు భారీగా సీఎంఆర్​పెండింగ్​ఉన్న మిల్లులకు వడ్లను ఇవ్వమని తేల్చి చెప్పారు.  ఈ విధంగా యాదాద్రి జిల్లాలోని పది మిల్లులకు సీఎంఆర్​కట్​చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,82.890 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇందులో 32,640 వేల ఎకరాల్లోనే సన్న రకం సాగు చేస్తుండగా.. 2,50,250 ఎకరాల్లో దొడ్డు రకం సాగు చేస్తున్నారు. 

 రైతుల తిండి అవసరాలతో పాటు బహిరంగ మార్కెట్లో మిల్లర్లు కొనే వడ్లు పోనూ దాదాపు 3 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు సెంటర్లకు వస్తాయని అంచనా వేసిన ఆఫీసర్లు 325 సెంటర్లను ప్రారంభించారు. 

లీజుకు తీసుకుని ఎగనామం

ఓనర్​ దగ్గర నుంచి మిల్లులు లీజుకు తీసుకున్న వారికి సైతం గతంలో సీఎంఆర్​ ఇచ్చేవారు. గతంలో జిల్లాలోని గుండాల మండలం అనంతారంలోని ఓ మిల్లును బంధువు వద్ద లీజుకు తీసుకొని రూ. 4 కోట్ల విలువైన వడ్లను సీఎంఆర్​కు తీసుకొని ఎగనామం పెట్టారు. ఈ మిల్లుపై ఆర్​ఆర్​ యాక్ట్​ నమోదు చేశారు. రూల్స్​ ప్రకారం లీజు మిల్లులకు సీఎంఆర్​ ఇవ్వాలంటే 50 శాతం బ్యాంక్​ గ్యారంటీ ఇవ్వాలి. పైగా మిల్లు ఓనర్​ కూడా అగ్రిమెంట్​పై సంతకాలు చేయాలి. 

గత అనుభవంతో మిల్లులను ఓనర్లు అగ్రిమెంట్​పై సంతకం చేయకపోవడంతో జిల్లాలోని రెండు లీజు మిల్లులకు సీఎంఆర్​ ఇవ్వవద్దని నిర్ణయం తీసుకున్నారు. ఆ మిల్లులను లిస్ట్ నుంచి తొలగించారు. 2025 యాసంగి సీజన్​లో వలిగొండ మండలం సంగెంలోని పీఏసీఎస్​ కొనుగోలు సెంటర్​ ఇన్‌చార్జితో కుమ్మక్కై వడ్లు కొనుగోలు చేయకున్నా.. చేసినట్టుగా, ఆ వడ్లు తన మిల్లుకు వచ్చినట్టుగా ధాన్యలక్ష్మి మిల్లు యజమాని తప్పుడు రిపోర్ట్​ ఇచ్చారు.  విచారణలో వడ్లు కొనుగోలు చేయలేదని తేలడంతో, ధాన్యలక్ష్మి మిల్లుకు కూడా ఈ వానాకాలం సీజన్​ సీఎంఆర్​ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. 

పెండింగ్​ మిల్లులకు సైతం.

 భారీ స్థాయిలో సీఎంఆర్​ పెండింగ్​ ఉన్న మిల్లులకు కూడా వడ్లు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆలేరులోని మల్లిఖార్జున రైస్​ మిల్​ సహా ఏడు మిల్లుల్లో భారీగా సీఎంఆర్​ పెండింగ్​లో ఉంది. ఈ మిల్లులకు ఎన్నిమార్లు హెచ్చరికలు చేసినా సీఎంఆర్​ డెలివరీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ ఏడు మిల్లులకు వానాకాలం సీజన్​ సీఎంఆర్​ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని 53 మిల్లుల్లో పదింటిని పక్కన పెట్టి 43 మిల్లులకు సీఎంఆర్​ ఇవ్వనున్నారు. 

సీఎంఆర్​ పెండింగ్​ వివరాలు ఇలా

యాసంగి 2022–-23 సీజన్‌లో యాదాద్రి జిల్లాలోని 40  సీఎంఆర్​ మిల్లులకు 4,10,191 టన్నుల​ వడ్లను సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ అప్పగించింది. ఈ సీజన్​కు సంబంధించి సీఎంఆర్​ను మిల్లర్లు అప్పగించలేదు.  దీంతో పెండింగ్​లో ఉన్న 1.86  లక్షల టన్నుల వడ్లను 2024లో  టెండర్​ వేశారు. ఏడాదిన్నరలో ఇందులో 1.54 లక్షల టన్నుల వడ్లను అప్పగించగా  మరో 32 వేల టన్నుల వడ్లను అప్పగించాల్సి ఉంది.  2024 వానాకాలం సీజన్​కు సంబంధించి 2,22,,444 టన్నుల వడ్లను జిల్లాలోని 49 మిల్లులకు అప్పగించగా 1.50 లక్షల టన్నుల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది. 

ఈ సీజన్​కు సంబంధించి ఇంకా 14 వేల టన్నుల సీఎంఆర్​ పెండింగ్​లో ఉంది. 2024–-25 యాసంగి సీజన్​కు సంబంధించి అప్పగించిన 3.76 లక్షల టన్నుల వడ్లకు 2.54 లక్షల టన్నుల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది. అయితే ఈ సీజన్​కు సంబంధించి ఇంకా 1.54 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అందించాల్సి ఉంది. మొత్తంగా 2 లక్షల టన్నుల బియ్యం పెండింగ్​లో ఉంది. 

పాత బ్యాంక్​ గ్యారెంటీకి ఓకే

రూల్స్​ ప్రకారం తమకు కేటాయించిన వడ్లలో పది శాతం విలువ మొత్తాన్ని బ్యాంక్​ గ్యారెంటీ రూపంలో చూపించిన మిల్లుకే సీఎంఆర్​ ఇవ్వాల్సి ఉంది. అయితే 2024 వానాకాలం సీజన్​లో 51 మిల్లులు రూ. 7 కోట్ల బ్యాంక్​ గ్యారెంటీలను చూపించాయి. ఆ సీజన్​కు సంబంధించి 14 వేల టన్నుల సీఎంఆర్​ పెండింగ్‌లో ఉంది. పెండింగ్​ తక్కువగా ఉండడంతో ఆ సీజన్​కు సంబంధించిన బ్యాంక్​ గ్యారెంటీలను 2025 వానాకాలం సీజన్​ సీఎంఆర్​ కోసం పరిగణలోకి తీసుకోవాలని ఆఫీసర్లను మిల్లర్లు కోరారు.  దీన్ని పరిశీలించిన ఆఫీసర్లు అందుకు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.