నకిలీ లబ్ధిదారులతో సీఎంఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ స్వాహా..8 మంది అరెస్ట్‌‌‌‌..నిందితుల్లో హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పీఏ,

నకిలీ లబ్ధిదారులతో సీఎంఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ స్వాహా..8 మంది అరెస్ట్‌‌‌‌..నిందితుల్లో హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పీఏ,
  • క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ టెక్నికల్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌7 చెక్కులు డ్రా
  • మరో 44 చెక్కులను స్వాధీనం చేసుకున్న పోలీసులు

సూర్యాపేట, వెలుగు : సీఎంఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ చెక్కులను అసలు లబ్ధిదారులకు ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడిన ఎనిమిది మందిని సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కె.నరసింహ సోమవారం వెల్లడించారు. హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి క్యాంప్ ఆఫీస్‌‌‌‌లో టెక్నికల్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌గా పనిచేసిన పెండెం వెంకటేశ్వర్లు, ప్రైవేట్‌‌‌‌ పీఏగా పనిచేసిన పులిదిండి ఓంకార్ మరికొందరితో కలిసి సీఎంఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ చెక్కుల అక్రమాలకు ప్లాన్‌‌‌‌ చేశారు. 

ఇందులో భాగంగా 2023 కంటే ముందు మంజూరైన రూ.34,58,400 విలువైన 51 చెక్కులను పక్కదారి పట్టించారు. లబ్ధిదారుల పేర్లకు దగ్గరగా ఉన్న వ్యక్తులను గుర్తించి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు సాయంతో రూ. 9.50 లక్షల విలువైన ఏడు చెక్కులను డ్రా చేయించారు. ఇందులో నకిలీ లబ్ధిదారులకు కొంత కమీషన్‌‌‌‌ ఇచ్చి మిగతా సొమ్మును స్వాహా చేశారు. ఈ క్రమంలో మేళ్లచెర్వుకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి పెరాలిసిస్‌‌‌‌ రావడంతో 2023లో సీఎంఆర్ఎఫ్‌‌‌‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన పేరుతో చెక్‌‌‌‌ వచ్చినప్పటికీ రాలేదని నమ్మించి మరో పేరుతో డ్రా చేసుకున్నారు. 

ఇటీవల ఈ విషయం కాస్తా వెంకటేశ్వర్లుకు తెలియడంతో మేళ్లచెర్వు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల ఎంక్వైరీలో నిందితుల అక్రమాలు బయటపడ్డాయి. దీంతో పెండెం వెంకటేశ్వర్లు, పులిదిండి ఓంకార్‌‌‌‌, బెల్లంకొండ వెంకటేశ్వర్లుతో పాటు మాదాసు వెంకటేశ్వర్లు, మట్టపల్లి సైదులు, గొట్టిముక్కల వెంకటేశ్వర్లు, బెల్లంకొండ సైదులు, బెల్లంకొండ పద్మను పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.7.30 లక్షలు, 44 డ్రా చేయని చెక్కులు, ఆరు సెల్‌‌‌‌ఫోన్లు, ఆరు బ్యాంక్ పాస్‌‌‌‌బుక్స్‌‌‌‌ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.