
కోల్‌బెల్ట్,వెలుగు: ఎడతెరిపి లేని వానలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచింది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని నాలుగు ఓపెన్‌కాస్ట్‌లు, శ్రీరాంపూర్ ఏరియా, మందమర్రి ఏరియా, బెల్లంపల్లి ఏరియాలోని ఓసీపీల్లోని క్వారీల్లో పనులు బంద్ పెట్టారు. దీంతో దాదాపుగా 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. క్వారీల్లో నీటిని మోటార్ల ద్వారా తోడుతున్నారు. డంపర్లు, డోజర్లు, షావల్ మెషీన్లను యార్డుపైనే నిలిపివేశారు.
ఓవర్‌బర్డెన్(మట్టి)వెలికితీత పనులు కూడా నిలిచాయి. మరోవైపు ఉద్యోగులు డ్యూటీలకు వచ్చినా పనులు లేకపోవడంతో ఖాళీగా ఉండిపోయారు. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని11 అండర్ గ్రౌండ్ బొగ్గు గనుల్లోనూ ఉద్యోగులు పూర్తిస్థాయిలో హాజరుకాలేదు. వర్షాలు తగ్గిన తర్వాతనే క్వారీల్లోకి రాకపోకలకు చాన్స్ ఉంది. అప్పటి వరకు స్టాక్ కోల్‌ను రవాణా చేస్తున్నారు.