న్యూఢిల్లీ: పద్దెనిమిదవ లోక్‌సభ తొలి సెషన్ మొదటిరోజు ప్రతిపక్ష ఇండియా కూటమి బలప్రదర్శన చేసింది. కూటమి పార్టీలకు చెందిన నేతలంతా పార్లమెంట్ పాత బిల్డింగ్ వద్ద కలుసుకున్నారు. ఆపై చేతుల్లో రాజ్యాంగ ప్రతులు పట్టుకుని కొత్త భవనం వద్దకు ర్యాలీగా వచ్చారు. మహాత్మాగాంధీ విగ్రహం ఉన్న ప్రాంతంలో రాజ్యాంగ ప్రతులను చూపుతూ "ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. రాజ్యాంగాన్ని బతికిద్దాం. రాజ్యాంగాన్ని రక్షిద్దాం" అంటూ నినాదాలు చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయ, డీఎంకేకు చెందిన టీఆర్. బాలు తదితర ప్రతిపక్ష నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ ఆశీస్సులతోనే 18వ లోక్‌సభలో ఇండియా కూటమి నాయకులు ప్రవేశించారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు.
'ప్రజాస్వామ్య పరిరక్షణకు మేం కాపలాదారులం.. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నాం. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఐక్యంగా ఉన్నాం' అని ట్వీట్ చేశారు. ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ప్రజల తీర్పు అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఉందని ఇండియా బ్లాక్ తెలిపింది.రాజ్యాంగాన్ని రక్షించడానికి ప్రజలు ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇచ్చారని చెప్పింది.
