ఏం తెలివిరా : చెప్పుల్లో కొకైన్.. ఫస్ట్ టైం ఇండియాలో ఇలాంటి స్మగ్లింగ్

ఏం తెలివిరా : చెప్పుల్లో కొకైన్.. ఫస్ట్ టైం ఇండియాలో ఇలాంటి స్మగ్లింగ్

నైజీరియా నుంచి దోహా మీదుగా వచ్చిన కెన్యా మహిళ నుంచి రూ.22 కోట్ల విలువైన 2.2 కిలోల కొకైన్‌ను చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 30 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ తన చెప్పుల్లో డ్రగ్స్‌ను దాచిపెట్టి భారత్‌లోకి అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించింది. 

ఆమె బ్యాగ్‌లో మరో ఐదు చెప్పులు కూడా ఉన్నాయి. అందులో కొకైన్ నింపబడి ఉందని అధికారులు తెలిపారు.  ఆమె లగేజీనిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా డ్రగ్స్ బయటపడ్డాయి.  మహిళ అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ సిండికేట్ సభ్యురాలిగా అధికారులు గుర్తించారు. చెన్నైలో ఆమెకు ఉన్న సంబంధాలను వెలికితీసేందుకు తదుపరి విచారణ జరుగుతోంది. ఆమెను అరెస్టు చేసి ప్రస్తుతం పుఝల్‌లోని సెంట్రల్ జైలులో ఉంచారు. 

 పట్టుబడిన కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.22 కోట్లు ఉంటుందని అంచనా. కాగా జూన్ మొదటి వారంలో చెన్నై విమానాశ్రయంలో రూ.35 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో కూడా అధికారులు విమాన ప్రయాణీకుల నుంచి రూ.27 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.