రూ.434 కోట్లకు పెరిగిన కాఫీ డే అప్పులు

రూ.434 కోట్లకు పెరిగిన కాఫీ డే అప్పులు

న్యూఢిల్లీ :  కాఫీ డే ఎంటర్‌‌‌‌ప్రైజెస్ లిమిటెడ్ పరిస్థితి రానురాను మరింత దిగజారుతోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు,  అన్‌‌‌‌లిస్టెడ్ డెట్ సెక్యూరిటీల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ,  అసలు విలువ డిసెంబర్ క్వార్టర్​లో  రూ. 433.91 కోట్లకు చేరింది.   లిక్విడిటీ సంక్షోభం కారణంగా లోన్లను చెల్లించలేకపోతున్నామని  కాఫీ డే ఎంటర్‌‌‌‌ప్రైజెస్ లిమిటెడ్ (సీడీఈఎల్​) రెగ్యులేటరీ ఫైలింగ్​లో పేర్కొంది. సీడీఈఎల్​ డిసెంబరు 31, 2023 నాటికి బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు కట్టాల్సిన రూ. 183.36 కోట్ల విలువైన అప్పులను తీర్చలేక డిఫాల్ట్​అయింది.  పైన పేర్కొన్న వాటికి రూ.5.78 కోట్ల వడ్డీ కట్టలేదు. రూ. 200 కోట్ల విలువైన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్‌‌‌‌సీడీలు),  నాన్-కన్వర్టబుల్ రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్‌‌‌‌లు (ఎన్‌‌‌‌సిఆర్‌‌‌‌పిఎస్) వంటి అన్‌‌‌‌లిస్టెడ్ డెట్ సెక్యూరిటీల కోసం డబ్బులు సర్దలేక డిఫాల్ట్ అయింది.   

“వడ్డీ,  అసలు తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ అవడంతో ఆర్థిక సంస్థలు కంపెనీకి లోన్ రీకాల్ నోటీసులు పంపారు. చట్టపరమైన చర్యలను ప్రారంభించారు.  చట్టపరమైన వివాదాల కారణంగా కంపెనీ ఏప్రిల్ 2021 నుంచి వడ్డీని గుర్తించలేదు ”అని పేర్కొంది. 2019 జులైలో కంపెనీ చైర్మన్ వీజీ సిద్ధార్థ మరణించిన తర్వాత, ఆస్తుల అమ్మకం ద్వారా సీడీఈఎల్​ అప్పులను తీర్చింది. మార్చి 2020లో, సీడీఈఎల్​ తన టెక్నాలజీ బిజినెస్ పార్క్‌‌‌‌ను విక్రయించడానికి బ్లాక్‌‌‌‌స్టోన్ గ్రూప్‌‌‌‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తదనంతరం 13 మంది రుణదాతలకు రూ. 1,644 కోట్లను తిరిగి చెల్లించినట్లు తెలిపింది. సిద్ధార్థ ప్రమోట్ చేసిన మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్‌‌‌‌ నుంచి రూ. 3,535 కోట్లకు పైగా రికవరీ చేయడానికి ప్రయత్నిస్తోంది.