చన్నీళ్ల స్నానమే జుట్టుకి మంచిది

V6 Velugu Posted on Jan 04, 2021

వింటర్ లో చన్నీళ్ల స్నానమంటే ఆమడ దూరం పారిపోతారు. తలస్నానం చేయాలంటే సలసల మరిగిన వేడినీళ్లు కావాల్సిందే. ఆ వేడినీళ్ల తలస్నానం వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. హెయిర్ ఫాల్ కి కూడా కారణం కావొచ్చు అంటున్నారు డెర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్​ప్లాంట్ సర్జన్ సయ్యద్. వారానికి రెండు, మూడు సార్లు తలస్నానం చేయడం వల్ల జుట్టు శుభ్రపడడమే కాకుండా.. హెల్దీగా , అందంగా పెరుగుతుంది. మరి  తలస్నానానికి చన్నీళ్లు, వేడినీళ్లలో ఏవి మంచివి? వీటివల్ల వెంట్రుకలకి  నష్టాలేంటి? లాభాలేంటి? వేడినీళ్లతో ఏ సీజన్​ అయినా  హెయిర్​ఫాల్​ కామన్. కానీ, మిగతాకాలాలతో పోలిస్తే వింటర్​లో కాస్త ఎక్కువగా  జుట్టు ఊడుతుంది. దానికి  వేడినీళ్లతో తలస్నానం చేయడం కూడా ఒక కారణం. మాములుగా వింటర్​లో  చర్మం డ్రైగా మారుతుంది. దురద కూడా ఇబ్బంది పెడుతుంటుంది. అలాగే  ఈ కాలంలో మాడు పొడిబారి దురద పుడుతుంది. దానిపై వేడినీళ్లు  పడితే ఆ సమస్య మరింత పెరుగుతుంది. వెంట్రుకలు పొడిబారి జుట్టు పీచులా  మారుతుంది. జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి అంటున్నారు డాక్టర్​ సయ్యద్​. వేడినీళ్ల స్నానం వల్ల తలలోని సహజ నూనెలన్నీ పోతాయి. ఫలితంగా వెంట్రుకలు పెళుసుగా మారతాయి.  మాడు పొడిబారడం వల్ల చుండ్రు సమస్య  మొదలవుతుంది. వేడినీళ్ల తలస్నానం వల్ల జుట్టు సహజ రంగుని కోల్పోయి గోధుమరంగులోకి మారుతుంది. మెరుపు తగ్గిపోతుంది.  దీనికి తోడు తలపై చర్మం పొడిబారి పొలుసులు పొలుసులుగా ఊడుతుంది.  కాకపోతే వేడినీళ్లు  మాడుపై ఉండే రంధ్రాలని అన్​లాక్​  చేసి మురికిని త్వరగా వదలగొడతాయి. అంతేకాదు రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. చన్నీళ్లతో చన్నీళ్ల తలస్నానం చేస్తే మాడుపై ఉండే,​ సహజ నూనెల్ని కాపాడి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టుని  మాయిశ్చరైజ్​ చేసి మృదువుగా, మెరిసేలా చేస్తాయి. హెయిర్​ ఫాల్​ని కంట్రోల్​ చేస్తాయి. బ్లడ్​ సర్క్యులేషన్​ని ఇంప్రూవ్​ చేసి జుట్టు పెరుగుదలకు సాయపడతాయి. జుట్టు ఆరోగ్యాన్ని పెంచే న్యూట్రియెంట్స్​, ఆయిల్స్​ని కాపాడతాయి. కానీ, చన్నీళ్ల వల్ల కొన్ని సార్లు  జుట్టులో తేమ లాక్​ అయ్యి జుట్టు పలుచగా కనిపిస్తుంది. అది తప్పించి చన్నీళ్ల వల్ల పెద్దగా నష్టాలేం లేవు. అందుకే  తలస్నానానికి చన్నీళ్లు లేదా గోరువెచ్చని నీళ్లని మాత్రమే ఎంచుకోవాలి అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. అలాగే ఏ నీళ్లతో తలస్నానం చేసినా ఈ పొరపాట్లకి దూరంగా ఉండాలంటున్నారు. ఇవి పాటించాల్సిందే ఒక్కోసారి తలస్నానం చేశాక జుట్టు ఆరబెట్టడానికి టైం ఉండదు. దాంతో  అలాగే జుట్టు అల్లేస్తారు చాలామంది. ఇలా చేయడం వల్ల  బ్యాక్టీరియల్, ఫంగల్​ ఇన్​ఫెక్షన్లు  వస్తాయి. అందుకే జుట్టుని బాగా ఆరబెట్టుకున్నాకే జడ వేసుకోవాలి. కొందరు  ప్రతిరోజూ తలస్నానం  చేస్తుంటారు. దానివల్ల   వెంట్రుకలు పొడిబారి జుట్టంతా పీచులా  మారుతుంది.  అందుకని వారానికి రెండూ లేదా మూడురోజులు మాత్రమే తలస్నానం చేయాలి. రాత్రిళ్లు తలస్నానం చేస్తే జుట్టు ఆరకుండా పడుకోకూడదు. అలాచేస్తే దిండు, బెడ్‌‌‌‌కి వెంట్రుకలు  అంటుకుపోతాయి. దీంతో అవి కూడా తడిగా మారి బ్యాక్టీరియా ఎక్కువగా తయారవుతుంది. అందుకే రాత్రిళ్లు తలస్నానం చేస్తే  జుట్టు పూర్తిగా ఆరాకే పడుకోవాలి. తలస్నానం చేసి రాగానే బ్లో డ్రయ్యర్​ వాడొద్దు.  కాస్త గాలికి ఆరాక వాడాలి.  దీనివల్ల  జుట్టుపై వేడి ప్రభావం అంతగా ఉండదు.  అలాగే స్ట్రెయిట్​నర్, కర్లర్ ఉపయోగించే ముందు తప్పనిసరిగా  కండీషనర్, హెయిర్​ ప్రొటక్షన్ సీరమ్​ జుట్టుకి వాడాలి. తలకు ఉపయోగించే  దువ్వెనలు, బ్రష్​లను తరచూ వేడినీళ్లలో  కడగాలి.  ఒకరు వాడిన దువ్వెన  మరొకరు వాడొద్దు.

Tagged cold water, dermatology, no hairloss, skin specialists

Latest Videos

Subscribe Now

More News