ఉమ్మడి మెదక్ లో చలి పంజా..సింగిల్ డిజిట్ కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఉమ్మడి మెదక్ లో చలి పంజా..సింగిల్ డిజిట్ కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
  •     కోహిర్ లో 4.5 డిగ్రీలు నమోదు

సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయి చలి ప్రభావం మరింత పెరిగింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు వణికిపోతూ బయటికి రాలేకపోతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో బుధవారం రాత్రి 4.5 డిగ్రీలు నమోదైంది. 

జహీరాబాద్ మండలం అల్గోల్ లో 5.8, సత్వార్, మొగుడంపల్లి లో 7.5, దిగ్వాల్, కంగ్టిలో 8.1, న్యాల్కల్, నిజాంపేటలో 8.4, సదాశివపేటలో 8.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం దామరంచలో 9.6, కొల్చారంలో 9.9 ఉష్ణోగ్రతలు నమోదు కాగా సిద్దిపేట జిల్లాలో ఓవరాల్ గా 14.26 ఉష్ణోగ్రతలు ఉన్నాయి. దౌల్తాబాద్ లో 11.06 ఉష్ణోగ్రత నమోదైంది.

కమ్మేస్తున్న మంచు దుప్పటి

తెల్లవారు జాము చల్లటి గాలులు.. దట్టమైన పొగమంచు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. రాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకు రహదారులపై దట్టంగా మంచు కురుస్తోంది. ఈ పొగ మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యవసరమైతే తప్ప రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేషనల్ హైవేలపై అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.